పని ఒత్తిడి తగ్గించండి | - | Sakshi
Sakshi News home page

పని ఒత్తిడి తగ్గించండి

Feb 21 2026 6:51 AM | Updated on Feb 21 2026 6:51 AM

పని ఒత్తిడి తగ్గించండి

పని ఒత్తిడి తగ్గించండి

ఇప్పటి వరకు తీవ్రమైన ఒత్తిడితో 80 మంది సచివాలయ ఉద్యోగుల మృతి పని ఒత్తిడి తగ్గించాలని ఉద్యోగులు క్యాండిల్‌ ర్యాలీతో నిరసన

ఒంగోలు వన్‌టౌన్‌: రకరకాల సర్వేలు, టార్గెట్లు పెట్టి సెలవు రోజుల్లోనూ పనిచేయిస్తూ సచివాలయ ఉద్యోగులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని..పని ఒత్తిడి తగ్గించాలంటూ సచివాలయ ఉద్యోగులు ఒంగోలులో శుక్రవారం రాత్రి క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులు అత్యంత తీవ్రమైన పని ఒత్తిడితో ఉన్నారని, దీని వలన ఇప్పటి వరకు సుమారు 80 మంది స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆకస్మికంగా మృతిచెందారన్నారు. వారి మరణాలకు సంతాపంగా ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ సచివాలయ ఉద్యోగుల తరఫున క్యాండిల్‌ ర్యాలీ చేపట్టినట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో వాలంటరీ వ్యవస్థ లేకపోవడంతో జాబ్‌చార్ట్‌ జీఓ నంబర్‌11తో సచివాలయ ఉద్యోగులకు అధిక విధులతో పాటు, అనేక సర్వేలు అప్పగించి వేధిస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థ ఏర్పడి ఏడేళ్లయినా ఎటువంటి ప్రమోషన్‌ చానల్‌ కానీ, పదోన్నతులు కానీ కల్పించలేదన్నారు. ప్రొబేషన్‌ పీరియడ్‌లో రావాల్సిన 9 నెలల అరియర్స్‌, 3 నోషనల్‌ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. ఆరేళ్లు ఎటువంటి పదోన్నతి రాని వారికి అడ్వాన్స్‌ స్కీం కింద ఒక ఇంక్రిమెంట్‌ మంజూరు చేయాలన్నారు. మరణించిన ఉద్యోగులకి న్యాయం చేసి వాళ్ల ఇంట్లో మరొకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. ఒకే సమయంలో మరో పోస్ట్‌ కి ఇన్‌చార్జిగా డ్యూటీ వేస్తే సీసీఎల్‌ రూల్స్‌ ప్రకారం అదనపు భత్యం కల్పించాలన్నారు. ప్రతి సచివాలయానికి సొంత మొబైల్‌ ఫోను ఇవ్వాలని, ఉద్యోగుల మృతిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలి అని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌కి సంబంధించిన సెక్రటరీ సంఘ తరఫున పీ రవి రెడ్డి, వీ హరిబాబు, శ్రీ మహావిష్ణు, కే ప్రభాకర్‌, షేక్‌ చాంద్‌బాషా, వనమాల శ్రీనివాస్‌ రావు, ఆర్‌ అంజి, జీ లక్ష్మణ్‌, ప్రదీప్‌, బ్రహ్మేశ్వరరావు, విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి, లక్షీదేవి, స్వర్ణ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement