విద్యార్థి తౌషిక్‌ది ముమ్మాటికీ హత్యే.. | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి తౌషిక్‌ది ముమ్మాటికీ హత్యే..

Feb 21 2026 6:51 AM | Updated on Feb 21 2026 6:51 AM

విద్య

విద్యార్థి తౌషిక్‌ది ముమ్మాటికీ హత్యే..

త్రీమెన్‌ కమిటీ వద్ద విద్యార్థి తల్లిదండ్రుల కన్నీటి నివేదన పోలీసుల విచారణలో తీవ్ర నిర్లక్ష్యం నిందితులకు శిక్ష పడేదాక న్యాయం కోసం చచ్చేదాక పోరాడుతాం విద్యార్థి తౌషిక్‌ తండ్రి సయ్యద్‌ అలీ

కనిగిరిరూరల్‌: ‘‘నా కుమారుడు తౌషిక్‌(11)ది ముమ్మాటికీ స్కూల్‌ యాజమాన్యం, సిబ్బంది కలిసి చేసిన హత్యే.. మేం అన్ని ఆధారాలను చూపించాం. అయినా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఈ ప్రభుత్వం నా కుమారుడి మృతిపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందో అర్థం కావడం లేదు. నా పిల్లవాడికి జరిగినట్లు మరెవరికీ అన్యాయం జరగకూడదు. నిందితులను అరెస్ట్‌ చేసి, కఠిన శిక్షి విధించాలి. 50 మందికి కూడా రికగ్నైజేషన్‌ లేని పాఠశాలలను 400 మందితో నడుపుతున్నారు. మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. నా బిడ్డ కోసం అవసరమైతే అసెంబ్లీ, పార్లమెంట్‌ దాక అయినా వెళ్లి కూర్చుంటా..’’ అని విద్యార్థి తౌషిక్‌ తండ్రి సయ్యద్‌ అలీ అన్నారు. సింగరాయకొండ చైతన్య నవోదయ స్కూల్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి సయ్యద్‌ తౌషిక్‌ తల్లిదండ్రులను త్రీమెన్‌ కమిటీ శుక్రవారం విచారించింది. అనంతరం సయ్యద్‌ అలీ మీడియాతో మాట్లాడారు. ‘‘మేము నలుగురు, ఐదుగురిపై అనుమానం వ్యక్తం చేశాం. కానీ కనీసం వారిని పిలిపించి విచారణ చేసిన దాఖలాలు లేవు. మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. దొంగతనం చేసిన వారిని విచారించి 10 నిమిషాల్లో పోలీసులు నిజం చెప్పిస్తున్నారు. అలాంటిది 11 ఏళ్ల విద్యార్థిని హత్య చేసిన కేసుపై ఎందుకు పోలీసులు ఇంతా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడంలేదని’’ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి హత్యకు కారణమైన యాజమాన్యం, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు పోరాటం సాగిస్తామన్నారు. గతంలో కూడా ఈ పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరిగాయని తెలిసిందని, అప్పుడు కూడా యాజమాన్యంపై ఆరోపణలు ఉన్నాయని, అయితే అధికారం అండతో తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. పోలీసులు, దర్యాప్తు అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు.

తౌషిక్‌ తల్లిదండ్రులతో మాట్లాడిన త్రీమెన్‌ కమిటీ

సింగరాయకొండ చైతన్య నవోదయ స్కూల్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి సయ్యద్‌ తౌషిక్‌ తల్లిదండ్రులను త్రిమెన్‌ కమిటీ శుక్రవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో మాట్లాడారు. త్రిమెన్‌ కమిటీ అధికారులు డీఈఓ సీవీ రేణుక, ఐసీడీఎస్‌ పీడీ మాధురి, సింగరాయకొండ తహసీల్దార్‌ రాజేష్‌లు విద్యార్థి తల్లిదండ్రులతో దాదాపు 4 గంటలకు పైగా మాట్లాడారు. తౌషిక్‌ తల్లిదండ్రులు తమ కుమారుడు ఆ రోజు ఎన్ని గంటల సమయంలో తమతో మాట్లాడాడు.. ఎంతో సేపు మాట్లాడాడు.. ఘటన జరిగిన పాఠశాలలోని సీపీ పుటేజీ దృశ్యాలు... తమకు ఎవరిపై అనుమానం ఉంది.. తదితర అంశాలను, బలమైనా ఆధారాలను పూర్తిగా త్రిమెన్‌ కమిటీకి వివరించారు. తమకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని, దర్యాప్తులో పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. అనంతరం త్రీమెన్‌ కమిటీ సభ్యులైన డీఈఓ రేణుక విలేకర్లతో మాట్లాడుతూ విద్యార్థి తౌషిక్‌ అనుమానాస్పద మృతిపై విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించినట్లు చెప్పారు. సమగ్ర విచారణ అనంతరం తుది నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు నవోదయ స్కూల్‌ యాజమాన్యం, సిబ్బందిపై కనీసం విచారణ ఎందుకు జరిపించడం లేదని అడగ్గా... అది తన ఒక్కరి నిర్ణయం కాదని, విచారణ నివేదిక ప్రారంభ దశలోనే ఉందంటూ వెల్లడించారు. వీరి వెంట స్థానిక రెవెన్యూ, విద్యాశాఖ అధికారులున్నారు.

ప్రగతి స్కూల్‌ ఆన్‌లైన్‌ హాజరులో తౌషిక్‌ పేరు

ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాల అయిన కనిగిరిలోని ప్రగతి విద్యా నిలయం స్కూల్‌ రికార్డులను విద్యాశాఖ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. సింగరాయకొండలోని చైతన్య నవోదయ స్కూల్‌ (కోచింగ్‌ సెంటర్‌)లో అనుమానాస్పదంగా మృతి చెందిన తౌషిక్‌(11) పేరు స్థానిక ప్రగతి విద్యానిలయం రికార్డుల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈమేరకు డిప్యూటీ డీఈఓ మామిళ్ల శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎంఈఓ, డీఈఓ కార్యాలయ సిబ్బంది ప్రగతి పాఠశాల రికార్డులను పరిశీలించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓ మాట్లాడుతూ విద్యార్థి తౌషిక్‌ పేరు ఆన్‌లైన్‌ రికార్డు రిజిస్టర్‌లో హాజరు నమోదవుతోందన్నారు. కానీ డైలీ రిజిస్టర్‌లో, అటెండెన్స్‌ రిజిస్టర్‌లో హాజరు లేదన్నారు. దీంతో పాఠశాలకు సంబంధించిన అన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నామని, సమగ్ర విచారణ చేస్తామని చెప్పారు.

సింగరాయకొండలో..

సింగరాయకొండ: జిల్లాలో సంచలనం సృష్టించిన శ్రీ చైతన్య నవోదయ స్కూలు విద్యార్థి తౌషిక్‌ అనుమానాస్పద మృతి ఘటనపై కలెక్టర్‌ పి రాజాబాబు నియమించిన త్రీసభ్య కమిటీ సభ్యురాలు డీఈఓ సీవీ రేణుక విచారణకు శుక్రవారం రాత్రి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వచ్చారు. ఈ కమిటీలోని మిగతా సభ్యులైన ఐసీడీఎస్‌ పీడీ మాధురి, తహశీల్దార్‌ రాజేష్‌ కోసం కొంతసేపు నిరీక్షించి వారు రాకపోవటంతో శనివారం వచ్చి విచారణ జరుపుతానని అక్కడనుంచి వెళ్లిపోయారు.

విద్యార్థి తౌషిక్‌ది ముమ్మాటికీ హత్యే..1
1/1

విద్యార్థి తౌషిక్‌ది ముమ్మాటికీ హత్యే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement