ఏసీబీకి చిక్కిన ఏఓ
కంభం: ఎరువుల డీలర్ వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ వ్యవసాయాధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన మార్కాపురం జిల్లా కంభంలో శుక్రవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలో ఉన్న ఎరువుల దుకాణాల నుంచి వ్యవసాయాధికారి శాంపిల్స్ సేకరించి క్వాలిటీ చెకింగ్ చేసి ల్యాబ్‌కు పంపిస్తుంటారు. ఈ నేపథ్యంలో తురిమెళ్ల గ్రామానికి చెందిన రవీంద్రకుమార్ అనే డీలర్ నుంచి శాంపిల్స్ సేకరించకుండా రిపోర్టు పంపిస్తామని చెప్పిన కంభం వ్యవసాయాధికారి షేక్ మహమ్మద్ అందుకోసం రూ.20 వేలు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వడం ఇష్టంలేని డీలర్ ఏసీబీ అధికారులను సంప్రదించడంతో శుక్రవారం మధ్యాహ్నం వ్యవసాయాధికారి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని కార్యాలయానికి తీసుకెళ్లి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఏసీబీ అధికారులు దాడులకు వచ్చారని తెలిసిన పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అక్కడ నుంచి జారుకున్నారు.


