గిద్దలూరు కొండ లూటీ
గిద్దలూరు రూరల్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఏ మార్గం నుంచి నిధులు వస్తాయోనని టీడీపీ నాయకులు పొంచు వేసి ఉన్నారు. అందులో భాగంగానే కొండలు, గుట్టలను కొల్లగొడుతున్నారు. పట్టణ శివారులోని కొంగలవీడ రోడ్డు దర్గా సమీపంలో ఉన్న కొండను గురువారం కొందరు టీడీపీ మద్దతుదారులు జేసీబీలు పెట్టి గ్రావెల్ మట్టి అక్రమంగా తరలిస్తున్నారు. పదుల కొద్ది ట్రాక్టర్లను ఉంచి జేసీబీల సాయంతో మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. మట్టి తరలింపులో భాగంగా జేసీబీలు, ట్రాక్టర్ల శబ్ధాలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రావెల్ మట్టి తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ల అతివేగం కారణంగా మట్టి రోడ్డు వెంట రాళ్లతో పాటు కింద పడుతోందని స్థానికులు వాపోతున్నారు. గతంలో గుట్టుచప్పుడు కాకుండా రాత్రుల సమయంలో మట్టి తరలించే వారు. ప్రస్తుతం పగటి పూట బహిరంగంగానే కొండలను చదును చేసి మట్టి తరలిస్తున్నారంటే వారికి ఎంతటి పెద్ద వాళ్ల మద్దతు ఉందో ఇట్టే అర్థమతోంది. గత ప్రభుత్వంలో గ్రావెల్ మట్టి ట్రాక్టర్ రూ.400 నుంచి రూ.500 వరకు విక్రయించే వారు. ప్రస్తుతం చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ట్రాక్టర్ మట్టి ధర రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. అధికారం అండదండలతో టీడీపీ నాయకులు గ్రావెల్ మట్టి దందాను పెద్ద వ్యాపారంగా కొనసాగిస్తున్నారు. మండలంలోని నరవ రోడ్డులో కొండ ప్రాంతం, కేఎస్‌పల్లె సమీపంలోని దుప్పిల తిప్ప నుంచి రోజుకు వందల ట్రిప్పులు గిద్దలూరు పట్టణానికి వస్తుంటాయి. అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ మట్టిని అధికారులు అడ్డుకుని జరిమానాలు విధించిన దాఖలాలు లేవు.
సీనరేజి పేరుతో బహిరంగ దోపిడీ
ప్రభుత్వం నుంచి సీనరేజి వసూలు బాధ్యత తీసుకున్న ఓ ప్రైవేటు సంస్థ సిబ్బంది పోరుమామిళ్ల రోడ్డులోని సగిలేరు బ్రిడ్జి వద్ద, అంబవరం రోడ్డు, ఒంగోలు హైవే రోడ్డులో నిఘా స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. ఇసుక, గ్రావెల్ వంటివి పట్టణంలోకి రావాలంటే వారికి తప్పకుండా రుసుం చెల్లించాలి. గ్రావెల్ మట్టి, ఇసుక తోలుకునే వారు ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.350 చొప్పున చెల్లించాలి. అది కూడా కేవలం నగదు రూపంలో మాత్రమే తీసుకుంటారు. సామాన్య ప్రజలకు ఆర్థిక భారం మోపే విధంగా అడ్డగోలుగా వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రావెల్ అక్రమ తరలిపు విషయమై స్థానిక తహసీల్దార్ ఎం.ఆంజనేయరెడ్డిని వివరణ కోరగా సమాచారం అందితే వెంటనే అడ్డుకుంటామని తెలిపారు. అనుమతులు లేనిచోట అక్రమంగా గ్రావెల్ తరలిపుం చర్యలు నేరమన్నారు.
యథేచ్ఛగా గ్రావెల్ తరలింపు
గిద్దలూరు కొండ లూటీ
గిద్దలూరు కొండ లూటీ


