తిరుపతి లడ్డూ కల్తీ అవాస్తవం
మార్కాపురం టౌన్: పవిత్ర తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు, కూటమి పెద్దలు చేసిన తప్పుడు ప్రచారం అబద్ధమని అత్యున్నత న్యాయస్థానం సుప్రింకోర్టుకు సీబీఐ అందించిన చార్జీషీట్‌లో తేటతెల్లమైందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్‌చార్జి అన్నా రాంబాబు అన్నారు. గురువారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంతో పాటు ప్రపంచం మొత్తం ఉన్న దేవదేవుని భక్తుల మనోభావాలతో కూటమి ప్రభుత్వం రాజకీయం చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక ఆయన్ను ఇబ్బంది పెట్టేందుకే కూటమి నేతలు విష ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రింకోర్టు ఆదేశాలతో రంగ ప్రవేశం చేసిన సీబీఐ క్షుణ్ణంగా మొత్తం ప్రక్రియను పరిశీలన, పరీక్షలు నిర్వహించి న్యాయస్థానానికి ఫైనల్ చార్జిషీటు సమర్పించినట్లు పేర్కొన్నారు. పరిశీలించిన న్యాయస్థానం తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ కొవ్వు, ఎలాంటి జంతువుల కళేబరాల కల్తీ లేదని కోర్టుకు నివేదించిందని, కేవలం చంద్రబాబునాయుడు, కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రాజకీయంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేకనే ఇలాంటి ప్రచారానికి దిగారని మండిపడ్డారు. గౌరవమైన రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తులు ప్రజలు, భక్తుల మనోభావాలతో ఆడుకోవడం సమంజసం కాదన్నారు. విష ప్రచారం చేసిన వారు ప్రజలకు, భక్తులకు క్షమాపణలు చెప్పి వెంకటేశ్వరస్వామికి నమస్కరిస్తే వారు చేసిన పాపం పోతుందన్నారు. దుర్మార్గమైన మాటలు మాట్లాడటం తగదన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిని ఆ దేవుడే కఠినంగా శిక్షించాలని కోరుతున్నట్లు అన్నా రాంబాబు పేర్కొన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు కేవీ రమణారెడ్డి ఉన్నారు.
చంద్రబాబు, కూటమి పెద్దల తప్పుడు ప్రచారం
మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ధ్వజం


