చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం.. నీరుగారిన లక్ష్యం..!
నిర్మించిన తొట్లకు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్ల ఆవేదన
● నిర్మించిన తర్వాత నిధులు, విధుల గురించి పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
పొన్నలూరు:
పశువులు, మూగజీవాలు మేత కోసం పొలాలకు వెళ్లినప్పుడు తాగునీటికి అవస్థపడకుండా ఉండాలనే లక్ష్యంతో వాటి దాహార్తి తీర్చడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉపాధి హామీ పథకం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం నీటి తొట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే, పొలాల్లో నీటి తొట్ల నిర్మాణానికి పశుపోషకులు ముందుకు రాకపోవడంతో చేసేదేమీలేక నిర్మాణ బాధ్యతలను ఆయా గ్రామాల్లోని గుత్తేదారులకు అధికారులు అప్పగించారు. 15 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో నిర్మించే నీటి తొట్టికి సుమారు రూ.30 వేల నిధులు మంజూరు చేస్తామనడంతో గ్రామాల్లో నీటి తొట్ల నిర్మాణానికి గుత్తేదారులు పూనుకున్నారు. కొన్ని పంచాయతీల్లో నీటి తొట్ల నిర్మాణానికి గుత్తేదారులు కూడా ముందుకు రాకపోవడంతో ఉపాధి హామీ ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు ఫీల్డ్ అసిస్టెంట్లే కాంట్రాక్టర్ల అవతారమెత్తి నీటి తొట్లు నిర్మించారు. అయితే, నీటి తొట్లు నిర్మించి ఆరు నెలలకుపైగా అవుతున్నా ప్రభుత్వం బిల్లులు చెలించకపోవడంతో వారంతా చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పైగా, నిర్మించిన నీటి తొట్లకు నీరు నింపకపోవడంతో నిరుపయోగంగా మారాయి. కొన్ని నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేయడం, మరికొన్ని నిర్మాణాలు నాణ్యతా లోపం కారణంగా కొద్ది రోజులకే పాడైపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయింది.
బిల్లుల కోసం ఆరు నెలలుగా ఎదురుచూపులు...
ఉపాధి హామీ ఉన్నతాధికారుల సమాచారం మేరకు జిల్లాలో సుమారు 1400 పశువుల నీటి తొట్లు మంజూరయ్యాయి. వాటిలో 1200 నీటి తొట్లను పూర్తి స్థాయిలో నిర్మించారు. కొండపి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు 134 నీటి తొట్లు మంజూరవగా, వాటిలో 123 నీటి తొట్లను నిర్మించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పూర్తిగా నిర్మించిన నీటి తొట్లకు సుమారు రూ.3.60 కోట్ల బిల్లులను గుత్తేదారులకు చెల్లించాలి. కొండపి నియోజకవర్గంలో సుమారు రూ.40 లక్షల వరకు బిల్లులు చెల్లించాలి. అయితే, గ్రామాల్లో నీటి తొట్లు నిర్మించి ఆరు నెలలకుపైగా అవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి మరీ పశువుల నీటి తొట్లు నిర్మించామని, కానీ, చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన వాటికి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.
అలంకారప్రాయంగా నీటి తొట్లు...
పశువుల దాహార్తి తీర్చడానికి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్లు అలంకారప్రాయంగా మారాయి. కొన్ని గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్లకు నీటి వసతి ఉన్నప్పటికీ తగిన సౌకర్యాలు కల్పించకపోవడంతో వినియోగంలో లేక నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. అలాగే, మరికొన్ని నీటి తొట్లకు నీటి పైపులైన్ ఏర్పాటు చేయకుండా వదిలేసి నీటిని నింపకపోవడంతో ఖాళీగా ఉన్నాయి. దీంతో పాటు నిర్మించిన నీటి తొట్లకు చంద్రబాబు ప్రభుత్వం బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తుండటంతో కాంట్రాక్టర్లు కొన్నింటిని పూర్తిస్థాయిలో నిర్మించకుండా మధ్యలోనే వదిలేశారు. కొన్నిచోట్ల నాసిరకంగా నాణ్యత లేకుండా నిర్మిచడంతో వాడుకలోకి రాకముందే పగుళ్లు ఏర్పడ్డాయి. కొన్ని మండలాల్లో ఉపాధి హామీ మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పూర్తిగా నిర్మించిన నీటి తొట్ల వివరాలతో సకాలంలో ప్రభుత్వానికి ఏం బుక్ అందించకపోవడం వలన కూడా బిల్లుల మంజూరులో జాప్యం జరిగినట్లు సమాచారం. అలాగే కొత్తగా ప్రభుత్వం టెండర్ ప్రక్రియ ద్వారా బిల్లుల చెల్లింపును ప్రవేశపెట్టడంతో ఈ ప్రక్రియ పూర్తికాక బిల్లులు మంజూరు కాలేదు. మొత్తంగా జిల్లాలో పశువుల నీటి తొట్లు నిర్మాణానికి సంబంధించి బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో పాటు నిర్మించిన వాటిని నిరుపయోగంగా వదిలేయడంపై చంద్రబాబు ప్రభుత్వంపై కాంట్రాక్టర్లు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మండలం మంజూరైనవి పూర్తయినవి చెల్లించాల్సిన డబ్బు
పొన్నలూరు 45 31 రూ.9.30 లక్షలు
జరుగుమలి 05 05 రూ.1.50 లక్షలు
కొండపి 21 21 రూ.6.30 లక్షలు
మర్రిపూడి 37 37 రూ.11.10 లక్షలు
టంగుటూరు 14 14 రూ.4.20 లక్షలు
సింగరాయకొండ 12 12 రూ.3.60 లక్షలు
నీరు నింపక నిరుపయోగంగా మారిన
పశువుల తొట్లు
మధ్యలోనే నిలిచిపోయిన కొన్ని నిర్మాణాలు
నాణ్యతా లోపంతో అలంకారప్రాయంగా
మరికొన్ని..
జిల్లాకు సుమారు 1400 తొట్ల మంజూరు
అప్పులు తెచ్చి మరీ 1200 తొట్లు నిర్మించిన గుత్తేదారులు
వారికి చెల్లించాల్సిన నిధులు సుమారు రూ.3.60 కోట్లు
త్వరలోనే బిల్లులు చెల్లిస్తాం:
జిల్లాలో పశువుల నీటి తొట్లు నిర్మించిన వారికి కొంతమేర బిల్లులు చెల్లించాలి. ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు 1200 నీటి తొట్లు పూర్తి స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే నిర్మించిన నీటి తొట్ల వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించాం. ఉపాధి హామీ పథకం నిధులు మంజూరు కాకపోవడం వలన వెంటనే బిల్లులు చెల్లించలేకపోయాం. సాధ్యమైనంత త్వరగా బిల్లులు అందిస్తాం. అసంపూర్తిగా ఉన్న నీటితొట్లను కూడా పూర్తిస్థాయిలో నిర్మించడంతో పాటు నీటి వసతి కల్పించి వాడుకలోకి తెస్తాం.
జోసఫ్ కుమార్, డ్వామా పీడీ, ఒంగోలు
కొండపి నియోజకవర్గంలో నీటి తొట్ల నిర్మాణాల వివరాలిలా...


