టీడీపీ కార్యాలయంలో పాదరక్షలతో పతాకావిష్కరణ
యర్రగొండపాలెం: రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న జరిగిన సంబరాల్లో భాగంగా మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పాదరక్షలతో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సంఘటనపై మంగళవారం రాత్రి నుంచి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ డే సంబరాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు టీం గూడూరి పేరుతో ఆ కార్యాలయం నుంచి వాట్సాప్ గ్రూపుల్లో విడుదల చేశారు. ఎరిక్షన్‌బాబు చెప్పులు వదలకుండా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం, జెండా వందనం చేయడం స్పష్టంగా కనిపిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవం ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తిగా అధికారుల చేతుల మీదుగానే జరుగుతుంది. ఈ వేడుకల్లో ప్రజా ప్రతినిధులను మర్యాదపూర్వకంగా అధికారులు ఆహ్వానిస్తుంటారు. అటువంటి పరిస్థితికి భిన్నంగా కొంత మంది అధికారులు పచ్చనేతలను ఆహ్వానించారు. దీనిని అదునుగా తీసుకున్న టీడీపీ, బీజేపీ నాయకులు కొంతమంది ఆయా కార్యాలయాల్లో పాల్గొని హల్‌చల్ చేశారు. వారే ముందు వరుసలో నిలబడి ఉద్యోగులను వెనక్కి నెట్టారు. స్థానిక ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా ఆహ్వానించాలన్న ఆలోచన అధికారులకు లేకుండా పోయిందని పలువురు విమర్శిస్తున్నారు. చెప్పులతో పతాకావిష్కరణ, జెండా వందనం చేయడమేమిటని పచ్చనేత తీరుపై వారు ముక్కున వేలేసుకుంటున్నారు. కార్యక్రమం అనంతరం అయినా తాము చేసిన తప్పులు తెలుసుకోకుండా ఆర్భాటంగా వీడియోలు, ఫొటోలు గ్రూపుల్లో పెట్టి ఆనందం పొందడం వారికే సరిపోతుందని అంటున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పచ్చనేత ఎరిక్షన్‌బాబు జెండావిష్కరణ
స్వయంగా పోస్టులు చేసిన టీం గూడూరి
ప్రభుత్వ కార్యాలయాల్లో పచ్చనేతల హల్‌చల్
ఎమ్మెల్యేకు అందని రిపబ్లిక్ డే ఆహ్వాన పత్రిక
టీడీపీ కార్యాలయంలో పాదరక్షలతో పతాకావిష్కరణ


