మోటారు సైకిల్‌ను ఢీకొట్టిన లారీ
సంతమాగులూరు (అద్దంకి): మోటారు సైకిల్‌ను లారీ ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన సంతమాగులూరు మండలంలోని నామ్ రహదారిలో ఏల్చూరు గ్రామ సమీపంలో బుధవారం జరిగింది. పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లెకు చెందిన గుంటుపల్లి శ్రీనివాసరావు (45) వ్యక్తిగత పనిమీద స్వగ్రామం నుంచి మోటారు సైకిల్‌పై బల్లికురవ మండలలంలోని అంబడిపూడిలో వరి కోయించుకునేందుకు వెళ్తున్నాడు. సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామ సమీపానికి రాగానే సంతమాగులూరు వైపు నుంచి అద్దంకి వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే శ్రీనివాసరావు మృతిచెందాడు. లారీ చక్రాలు కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో అతని అవయవాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


