దొరకని ఆచూకీ..
● కంభం చెరువులో గల్లంతైన వ్యక్తి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
కంభం: కంభం చెరువులో ఆదివారం గల్లంతైన వ్యక్తి కోసం నాలుగు రోజులుగా బోటుతో పోలీసులు గాలిస్తుండగా, బుధవారం కూడా ఆచూకీ లభించలేదు. బుధవారం కంభం సీఐ కె.మల్లికార్జునరావు, ఎస్సై శివకృష్ణారెడ్డి, ఫైర్ సిబ్బంది, జాలరులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటిపడేంత వరకు చెరువులో గాలించినా ఆచూకీ దొరకలేదు. కందులాపురం పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి ఆదివారం నుంచి కనిపించకుండా పోవడం, ఆటోలో చెరువు కట్ట వరకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించిన నేపథ్యంలో.. చెరువులో పడి ఉంటాడని భావించి మూడు రోజులుగా గాలిస్తున్నారు.
రాచర్ల: మండలంలోని ఆకవీడులో జీవనమూర్తిస్వామి ప్రథమ శిష్యుడైన చిన్నయ్యస్వామి జెండా మహోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 9 గంటల నుంచి రాష్ట్రస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ధర్మకర్త పిక్కిలి రంగయ్యనాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల ఎడ్ల యజమానులు ఆ రోజు ఉదయం 9 గంటల్లోగా 1000 రూపాయల ప్రవేశ రుసుం చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.1,00,116, రెండో బహుమతిగా రూ.75,116, మూడో బహుమతిగా రూ.50,116, నాలుగో బహుమతిగా రూ.25,116, ఐదో బహుమతిగా రూ.20,116, ఆరో బహుమతిగా రూ.10,116 అందజేయనున్నట్లు వివరించారు. పూర్తి వివరాలకు 85559 74029, 96768 28926, 95151 79210, 96765 17010నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఒంగోలు సబర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 100 శాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీఆర్ కృష్ణతేజ ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని పరిస్థితుల గురించి కమిషనర్‌కు జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు వివరించారు. కమిషనర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 15 నాటికే గ్రామాల్లో పన్నుల వసూలు పూర్తి చేయాలన్నారు. ఇంటి పన్నులతో పాటు ఇతర పన్నులన్నీ వేగవంతంగా వసూలు చేయాలన్నారు. పన్నుల వసూలుకు ప్రత్యేక డ్రైవ్‌లు కూడా నిర్వహించాలని ఆదేశించారు. డివిజినల్ డెవలప్‌మెంట్ ఆపీసర్లు, డివిజినల్ పంచాయతీ అధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలు స్వయంగా క్యాంప్ చేయాలన్నారు. పన్నుల చెల్లింపులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీపీఓతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
గిద్దలూరు రూరల్: గిద్దలూరుకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు కంచర్ల కోటయ్యగౌడ్ జాతీయ స్థాయి టెన్నిస్ పోటీల్లో ప్రతిభ చూపాడు. విశాఖపట్నంలో జరుగుతున్న జాతీయస్థాయి టెన్నిస్ క్రీడల్లో 65 ఏళ్ల వయసు విభాగంలో హైదరాబాద్‌కు చెందిన చంద్రశేఖర్ టీం, విశాఖపట్నం ఆఫీసర్స్ క్లబ్ క్రీడాకారులు డాక్టర్ సనత్‌రావు, కృష్ణారావు టీంపై 9.5 పాయింట్లతో విజయం సాధించారు. ఈ పోటీలకు ఒడిశా, కర్ణాటక, తెలంగాణకు చెందిన సీనియర్ సిటిజన్ క్రీడాకారులు పాల్గొన్నారు.
పొదిలి: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున ఒంగోలు–కర్నూలు రోడ్డుపై పొదిలిలోని చిన్న బస్టాండ్ సమీపంలో పెట్రోల్ బంకు వద్ద జరిగింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. పొదిలిలోని బాప్టిస్ట్‌పాలేనికి చెందిన అనపర్తి పెద యలమంద (60) వేకువజామున టీ తాగేందుకు సెంటర్‌వైపు వెళుతున్నాడు. కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కనిగిరి వైపునకు వెళ్తూ యలమందను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యలమంద అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఏఎస్సై సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
దొరకని ఆచూకీ..


