క్షేత్రస్థాయిలో మాయ! | - | Sakshi
Sakshi News home page

క్షేత్రస్థాయిలో మాయ!

Jan 29 2026 6:04 AM | Updated on Jan 29 2026 6:04 AM

క్షేత

క్షేత్రస్థాయిలో మాయ!

ప్రకటనల్లో యూరియా..

త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి వద్ద తెల్లవారుజామున యూరియా కోసం వేచి ఉన్న రైతులు (ఫైల్‌)

సాక్షి ప్రతినిధి, ఒంగోలు/మార్కాపురం:

చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంటలకు గిట్టుబాటు ధర లభించక ఆర్థికంగా కుదేలయ్యారు. ఒక వైపు పకృతి వైపరీత్యాలతో నష్టపోయిన వారిని గాలికొదిలేసింది. మరో వైపు రైతులకు అండగా నిలవాల్సిన రైతు సేవా కేంద్రాల వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 5,31,369 మంది రైతులున్నారు. రబీ సీజన్‌కు సంబంధించి 86,982 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగుచేశారు. అయితే రైతులు యూరియా అందక పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. సాగర్‌ ఆయకట్టు భూముల్లో 4.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. సాగర్‌ ఆయకట్టు కింద త్రిపురాంతకం, యర్రగొండపాలెం, కురిచేడు, దొనకొండ మండలాల్లో వరి, మార్కాపురం, పెద్దారవీడు, కంభం, గిద్దలూరు, బేస్తవారిపేట, కొనకనమిట్ల, కంభం, రాచర్ల తదితర మండలాల్లో మొక్కజొన్నకు యూరియా వాడుతున్నారు. నెల రోజుల నుంచి రైతు సేవా కేంద్రాల ద్వార మాత్రమే అరకొరగా యూరియా లభ్యమవుతోంది. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల త్రిపురాంతకం మండలం, విశ్వనాథపురం సొసైటీకి వచ్చిన యూరియా బస్తాలు మరో ప్రాంతానికి వెళ్తుంటే ఆ గ్రామ టీడీపీ రైతులే అడ్డుకుని 250 బస్తాలు ఆ గ్రామానికి వాడుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రబీలో వరి, మొక్కజొన్న, గడ్డిసాగుకు యూరియాను రైతులు ఎక్కువగా వాడుతున్నారు. డిమాండ్‌కు సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

38 వేల మెట్రిక్‌ టన్నులు యూరియా అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నా రైతులకు మాత్రం సకాలంలో అందక అవస్థలు పడుతున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని కూటమి నాయకులు యూరియాను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నాయకులు చెప్పిన రైతులకే అధికారులు బస్తాలు ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సాగు చేసిన పంటలకు యూరియా బస్తాలు దొరక్క ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రైతులకు అవసరమైన యూరియా అందించడంలో ఆర్‌ఎస్‌కేలు విఫలమయ్యాయన్న విమర్శలు ఉన్నాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అవసరమైన యూరియా, ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ఆర్‌బీకేల ద్వారా స్థానికంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు లభించాయి. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం సకాలంలో ఎరువులు, యూరియా రైతులకు అందించడంలో విఫలమై రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.

యూరియాకు డిమాండ్‌

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రబీలో 14,230 హెక్టార్లలో మొక్కజొన్న సాగుచేశారు. ఈ ఏడాది మొక్కజొన్న లక్ష్యం 5626 హెక్టార్లు నిర్ణయించగా అత్యధికంగా 14,230 హెక్టార్లలో సాగుచేశారు. అధిక దిగుబడికి ఎకరాకు 4 బస్తాల యూరియా వేయాలని ప్రచారం జరిగింది. గత ఏడాది ఇదే రబీ సమయానికి 4523 హెక్టార్లలో సాగుచేయగా ఈ ఏడాది అత్యధికంగా 14,230 హెక్టార్లలో సాగుచేశారు. గత ఏడాది ఇదే సమయానికి వరి 9836 హెక్టార్లలో ఉమ్మడి జిల్లాలో సాగుకాగా 11,526 హెక్టార్లలో సాగు చేశారు. గడ్డి సాగుకు కూడా రైతులు యూరియా వాడుతున్నారు. దీంతో యూరియాకు డిమాండు పెరిగింది. దీంతో రైతులు బయట మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు వెళ్లగా అక్కడ నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కేవలం రైతు సేవా కేంద్రాల్లో మాత్రమే లభ్యమవుతున్నాయి. అక్కడ రైతుల అవసరాలకు బస్తాలు లభ్యం కావడంలేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో చాలీచాలని యూరియాను రైతులు పొలాల్లో జల్లుతున్నారు. ఇదిలా ఉండగా రైతు సేవా కేంద్రాల్లో బస్తా యూరియా రూ.295 పడుతోంది. ఒంగోలులో బస్తా రూ.245 కాగా ఒక్కొక్క బస్తాకు రూ.50 ట్రాన్స్‌పోర్టు చార్జీకింద ఖర్చవుతుంది. ఎరువుల వ్యాపారులు కనీసం బస్తాకు రూ.10 లాభం లేనిది అమ్మలేమని చెబుతుండగా రూపాయి ఎక్కువ అమ్మినా కేసులు నమోదు చేస్తామని వ్యవసాయాధికారులు హెచ్చరించడంతో ఎరువుల వ్యాపారులు యూరియాను తెప్పించడం మానేశారు. మార్కాపురానికి గత వారం కేవలం 15 టన్నుల యూరియా మాత్రమే వచ్చినట్లు తెలిసింది. దీంతో పాటు మార్కాపురం పట్టణంలో 9, రూరల్‌లో 8, తర్లుపాడులో 6, పెద్దారవీడులో 10, యర్రగొండపాలెం ప్రాంతంలో 20 వరకూ ఎరువులు, పురుగు మందుల దుకాణాలు ఉన్నాయి. వీటిలో కొద్దిమొత్తంలో మాత్రమే యూరియా నిల్వలు ఉన్నాయి.

యూరియాకు కొరతలేదు

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతానికి యూరియా కొరత లేదు. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది అక్టోబర్‌ 1 నుంచి ఈ ఏడాది జనవరి 31 వరకూ 27,296 మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా ఇప్పటికి 38,671 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంచాం. ఇప్పటి వరకూ 36,799 మెట్రిక్‌ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి. ఇతర ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం.

– శ్రీనివాసరావు, జేడిఏ, ఉమ్మడి ప్రకాశంజిల్లా

యూరియా దొరక్క అవస్థలు

ఆర్‌ఎస్‌కేల ద్వారా ఇప్పటి వరకు యూరియా, ఎరువులు అందించలేదు. గతంలో ఆర్‌బీకేల ద్వారా యూరియా, ఎరువులు రైతులకు అందేవి. ప్రస్తుతం యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

– జీ ముసలయ్య రైతు, విశ్వనాథపురం

ఆర్‌ఎస్‌కేల ద్వారా అందించాలి..

ఆర్‌ఎస్‌కేల ద్వారా యూరియాను అందించాలి. స్థానికంగా అందిస్తే రైతులకు ఉపయోగం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటే రైతులకు ఆర్థికంగా భారమవుతుంది. మాగ్రామానికి రావాల్సిన యూరియా ఇతర ప్రాంతాలకు తరలితే గ్రామ రైతులకు అందే అవకాశం ఉండదు. స్థానికంగానే యూరియా ఆర్‌ఎస్‌కేల్లో దించి రైతులకు అందించాలి.

– ఎస్‌ వెంకటరంగయ్య, రైతు, విశ్వనాథపురం

క్షేత్రస్థాయిలో మాయ!1
1/3

క్షేత్రస్థాయిలో మాయ!

క్షేత్రస్థాయిలో మాయ!2
2/3

క్షేత్రస్థాయిలో మాయ!

క్షేత్రస్థాయిలో మాయ!3
3/3

క్షేత్రస్థాయిలో మాయ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement