రవాణాశాఖ విభజనకు ఏర్పాట్లు
ఆర్‌టీఓ పోస్టు డీటీఓగా మార్పు దర్శిలో ఉన్న కనిగిరి, మార్కాపురం పరిధిలోకి..
మార్కాపురం: మార్కాపురం జిల్లా ఏర్పాటుతో ఉమ్మడి జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఉన్న పలు కార్యాలయాలు మార్కాపురంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా రవాణాశాఖను విభజిస్తున్నారు. మార్కాపురం జిల్లాలో 21 మండలాలను రవాణాశాఖ పరిధిలోకి తీసుకొస్తున్నారు. గతంలో కనిగిరి నియోజకవర్గం, దర్శి ఎంవీఐ పరిధిలో ఉండగా జిల్లా విభజనతో మార్కాపురం ఎంవీఐ పరిధికి తీసుకొస్తున్నారు. ఆర్టీఓ పోస్టును మార్కాపురం జిల్లాకు సంబంధించి డీటీఓ (డిస్ట్రిక్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసరు)గా మార్పు చేశారు. స్థానిక రాయవరం వద్ద డీటీఓ కార్యాలయ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. భవన నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీనివలన వాహనదారులకు మెరుగైన సేవలు అందనున్నాయి. కనిగిరి నియోజకవర్గ వాహనదారులు ఎల్‌ఎల్‌ఆర్, డీఎల్, ఫిట్‌నెస్ తదితర లైసెన్సుల కోసం ఒక్కొక్కసారి ఒంగోలుకు వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడే డీటీఓ కార్యాలయం ఏర్పాటు చేయనుండటంతో వారి ఇబ్బందులు తీరనున్నాయి. ఇందుకోసం సిబ్బందిని కూడా నియమించాల్సి ఉంది. ప్రస్తుతం మార్కాపురం ఎంవీఐ పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలకు చెందిన లైసెన్సుదారులు ఉన్నారు. సుమారు 7 వేలకు పైగా ఆటోలు, 15 వేలకు పైగా ద్విచక్ర వాహనాలు ఇంకా వెయ్యి కార్లు ఉన్నాయి. ఇటీవల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీని నంద్యాలకు మార్చడంతో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో మార్కాపురంలోనే డీటీఓ కార్యాలయం ఏర్పాటు చేయడంతో సమస్యలు కూడా తొలగనున్నాయి. 21 మండలాలు కావడంతో అతిపెద్ద ఎంవీఐ కార్యాలయంగా మార్కాపురం ఎంవీఐ కార్యాలయం ఏర్పాటు కానుంది. దీంతో మరో సబ్‌యూనిట్ కార్యాలయ ఏర్పాటుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. కనిగిరి ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కావాల్సి ఉంది
రవాణాశాఖ పునర్‌వ్యవస్థీకరణపై అమరావతిలో ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనమిత్ర, సారథి యాప్‌లను మార్పుచేయాల్సి ఉంది. కొన్ని అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
– శ్రీ చందన, ఆర్టీఓ, మార్కాపురం
రవాణాశాఖ విభజనకు ఏర్పాట్లు
రవాణాశాఖ విభజనకు ఏర్పాట్లు


