ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తరగతుల బహిష్కరణ
ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ కాలేజీ కొనసాగించాలని డిమాండ్
ఒంగోలు టౌన్: జిల్లా కేంద్రమైన ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ కాలేజీని కొనసాగించాలని, ఎటువంటి సౌకర్యాలు లేని కనిగిరి ప్రాంతానికి తాము వెళ్లమని ఎస్‌ఎస్‌ఎన్ క్యాంపస్‌కు చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తెగేసి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి, యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మంగళవారం తరగతులను బహిష్కరించి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం ఒంగోలు ట్రిపుల్ ఐటీని దెబ్బ తీసి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అన్నీ సౌకర్యాలు ఉన్నాయని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వేలాది మంది విద్యార్థులు ఒంగోలు ట్రిపుల్ ఐటీలో చేరారని, తీరా ఇప్పుడు ఇక్కడ సౌకర్యాలు లేవంటూ కొంత మందిని నూజివీడు, మరికొంత మందిని పులివెందులకు తరలించారని, మిగిలిన వారిని కనిగిరి ప్రాంతంలో నిర్మించే కళాశాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. ఒంగోలులో 50 ఎకరాల్లో ట్రిపుల్ ఐటీ నిర్మించడానికి సమస్య ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఒంగోలులో అయితే మంచినీటి సౌకర్యం, రవాణా సౌకర్యం కూడా ఉంటుందని తెలిపారు. దీంతోపాటుగా విద్యార్థులకు ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారని చెప్పారు. ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ కాలేజీని కొనసాగించాలని, లేనిపక్షంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఇంటి వద్దకు పాద యాత్ర చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో భార్గవ్, గౌతం, వెంకీ, భాస్కర్, కొమ్ము రాజీవ్, ఈస్టర్ కృష్ణ, సూర్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


