స్తంభించిన బ్యాంకుల లావాదేవీలు
న్యాయమైన కోర్కెల సాధన కోసం అన్ని బ్యాంకులు ఒకతాటిపైకి జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు బంద్ ఒంగోలులో భారీ బైక్ ర్యాలీ ఐదు రోజుల పనిదినాన్ని అమలు చేయాలని డిమాండ్
ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా అన్ని జాతీయ బ్యాంకులు బంద్ పాటించటంతో ఆర్ధిక లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం అన్ని బ్యాంకులు కలిసి ఒకతాటిపైకి వచ్చి బంద్ పాటించాయి. అందులో భాగంగా అన్ని బ్యాంకుల యూనియన్లు కలిపి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్‌గా ఏర్పడ్డాయి. దాంతో ఫోరంగా ఏర్పడిన బ్యాంకు యూనియన్లు మంగళవారం బంద్ పాటించాయి. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలో బ్యాంకు ఉద్యోగులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. భారీ బైక్ ర్యాలీలో అన్ని బ్యాంకుల యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. యూనియన్ నాయకుడు రాజీవ్ రతన్ దేవ్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజుల పనిదినాన్ని తక్షణమే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెన్షన్ అప్‌డేషన్ డిమాండ్ కూడా అపరిష్కృతంగా మిగిలిపోయిందన్నారు. 12వ ద్వై పాక్షిక ఒప్పందంలో అంగీకరించిన డిమాండ్లతో పాటు పెండింగ్‌లో ఉన్న వివిధ న్యాయబద్ధమైన డిమాండ్లు వెంటనే అమలు చేయాలన్నారు. మరో యూనియన్ నాయకుడు రాజేష్ ఖన్నా మాట్లాడుతూ అన్ని బ్యాంకుల్లో రిక్రూట్‌మెంట్లు నిలిపేశారన్నారు. బ్యాంకుల్లో వినియోగదారులు పెరుగుతున్నారు, ఖాతాలు పెరుగుతున్నాయి, సేవలు కూడా పెరుగుతున్నా నూతనంగా ఉద్యోగులను తీసుకోకుండా కాలం గడుపుతున్నారన్నారు. దాంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరిగిపోయి ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా నిరర్ధక ఆస్తులు పెరిగిపోతున్నాయని(ఎన్‌పిఏ), వాటిని రకవరీ చేసి బ్యాంకులకు రావాల్సిన వాటిని రాబట్టాలన్నారు.
నగరంలో భారీ బైక్ ర్యాలీ...
బ్యాంకుల దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దక్షిణ బైపాస్‌లోని మినీ స్టేడియం నుంచి బయలుదేరిన బైకు ర్యాలీ కర్నూలు రోడ్డు ఫ్‌లై ఓవర్ మీదుగా పాత బైపాస్‌కు చేరుకుంది. అక్కడ నుంచి ముంగమూరు రోడ్డు జంక్షన్, సీవీఎన్ రీడింగ్ రూమ్ మీదుగా నెల్లూరు బస్టాండ్ సెంటర్‌లోని యూనియన్ బ్యాంకుకు చేరుకుని అక్కడ సభ ఏర్పాటు చేశారు. బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లను వివరించారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ ఆఫీసర్స్ నాయకుడు శ్రీనివాస్, క్లరికల్ యూనియన్ నాయకుడు సుధాకరరావు, ఉమా శంకర్, బ్రహ్మ నాయుడు, ఎస్‌కే.హసన్, కెనరా బ్యాంకు ఆఫీసర్స్ నాయకుడు కిషోర్ రెడ్డి, శ్రీధర్, రవి ప్రకాశ్, ఏడుకొండలు, ఎల్‌ఐసీ యూనియన్ నాయకుడు శ్రీనివాస్, సీఐటీయూ నాయకుడు చీకటి శ్రీనివాస రావు, రమేష్, ఏఐటీయూసి వెంకటేశ్వర రావుతో పాటు పలు కమ్యూనిస్టు పార్టీల నాయకులు పాల్గొన్నారు.
స్తంభించిన బ్యాంకుల లావాదేవీలు


