అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 13 డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ డి.జయ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా డి.జయ మాట్లాడుతూ జిల్లాలో బాలికలకు పెదపవని, చీమకుర్తి, నార్త్ అద్దంకి, కొండపిలలో 4 గురుకులాలు ఉన్నాయని, బాలురకు దర్శి, కురిచేడులలో 2 గురుకులాలు ఉన్నాయని తెలిపారు. ఈ 6 గురుకులాల్లో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యాబోధన అందుతుందన్నారు. కురిచేడులోని పాఠశాలలో 5వ తరగతి నుంచి పదో తరగతి లోపు, మార్కాపురం జిల్లాలో బాలికలకు కంభం, దూపాడు, మార్కాపురం, రాచర్లలో గురుకులాలు ఉన్నాయని తెలిపారు. అలాగే బాలురకు వెలుగొండ, అర్ధవీడు గురుకులాల్లో 5వ తరగతికి 80 సీట్లు, ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరానికి 80 సీట్ల చొప్పున కేటాయిస్తారన్నారు. అభ్యర్థులు ఫిబ్రవరి 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. హెచ్‌టీటీపీఎస్://ఏపీజీపీసీఈటీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికెట్స్, విద్యా ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్, పాస్‌ఫొటో, ఆధార్ కార్డుకు అనుసంధానమైన ఫోన్ నంబర్ దగ్గర ఉంచుకోవాలన్నారు. 5వ తరగతిలో ప్రవేశాలకు 11 సంవత్సరాల్లోపు, ఇంటర్‌కు 17 సంవత్సరాల్లోపు వయసున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షలోపు ఉండాలన్నారు. 6 నుంచి పదో తరగతి లోపు ఖాళీలను బట్టి తీసుకుంటారన్నారు.
ఒంగోలు టౌన్: నీట్ స్పెషాలిటీస్ ప్రవేశ పరీక్షల్లో నగరానికి చెందిన డాక్టర్ మద్దూరి వంశీకృష్ణ క్రిటికల్ కేర్ విభాగంలో జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించారు. గత డిసెంబర్‌లో దేశ వ్యాప్తంగా జరిగిన ఈ ప్రవేశ పరీక్షల్లో సుమారు 3500 మందికి పైగా పరీక్షలు రాశారు. డాక్టర్ వంశీకృష్ణ విజయవాడ సిద్దార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిమ్స్ వైద్య కళాశాలలో అనస్తీషియన్ విభాగంలో పీజీ చేశారు. ప్రస్తుతం నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య సంస్థలో ప్రవేశానికి అర్హత సాధించడం ఎంతో గర్వంగా ఉందని డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు.
ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయులకు త్వరితగతిన ప్రాన్ నంబరును కేటాయించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోడూరి వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి మంగళవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 2004 సెప్టెంబర్ ఒకటి తర్వాత సర్వీసులో చేరిన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ప్రాన్ నంబర్, అంతకు ముందు సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు పీఎఫ్ నంబర్ కేటాయించాలన్నారు. ఎయిడెడ్ విద్యార్థులకు అన్ని రకాల మెటీరియల్ సప్‌లై చేయాలన్నారు. ఎయిడెడ్‌లో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు డీఏ, అరియర్ గ్రాట్యుటీ విడుదల చేయాలన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని రకాల డీఏ అరియర్స్ చెల్లించాలని, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులు, కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు తెలుగు, సంస్కృతం, హిందీ, పీఈటీలకు పదోన్నతి సౌకర్యం కల్పించాలన్నారు.
మార్కాపురం: మార్కాపురం పట్టణంలో జిల్లా స్థాయి ఎమ్మార్పీఎస్ సమావేశాన్ని బుధవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ జయరాజ్ తెలిపారు. నూతన జిల్లా కమిటీ ఎన్నిక, మండలాల కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి వ్యవస్థాపకుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ హాజరవుతారని అన్నారు.


