వల్లూరు చెరువులో పచ్చదొంగలు
రోజుకు 100 ట్రిప్పుల్లో టిప్పర్ల ద్వారా గ్రావెల్ అక్రమ రవాణా నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్న అధికారులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: టంగుటూరు మండలంలోని వల్లూరు గ్రామంలో ఉన్న చెరువులో టీడీపీ నాయకులు గ్రావెల్ ను యథేచ్ఛగా అమ్ముకుంటూ తమ జేబులు నింపుకుంటున్నారు. రోజుకు వందల సంఖ్యలో టిప్పర్లలో గ్రావెల్ తరలించుకుంటున్నారు. ఒక టిప్పర్ ధర రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. దాదాపు 100 టిప్పర్లకు సగటున రూ.9 వేల చొప్పున వసూలు చేస్తున్నా రోజుకు రూ.9 లక్షల వరకు మట్టిని అమ్ముకుంటున్నారు. సూరారెడ్డిపాలెంలో వేస్తున్న భారీ వెంచర్‌కు ఇక్కడ నుంచే గ్రావెల్‌ను తరలిస్తున్నారు.
పరిమితికి మించి తవ్వకాలు..
వల్లూరులోని గ్రామస్తులు తమ గ్రామంలోని అవసరాలకు గ్రావెల్ ను మూడు అడుగుల లోపు తవ్వుకునేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. ఆ విధంగానే తమ అవసరాల కోసం గ్రావెల్ ను తీసుకొచ్చుకుంటున్నారు. అయితే టీడీపీ గ్రావెల్ దొంగలు అవేవీ పట్టించుకోకుండా చెరువులో పది నుంచి 15 అడుగుల వరకు లోతులో గ్రావెల్ తవ్వుతూ అమ్ముకుంటున్నారు. గతంలో లోతైన గుంతల్లో పడి అనేకమంది మరణించిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల మూడు నెలల క్రితం ఒక గొర్రెల కాపరి గుంటలో పడి మరణించాడు.
హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినా..
వల్లూరు చెరువులో సర్వే నంబర్ 91లో వల్లూరుకు చెందిన ఒక ప్రధాన దేవస్థానానికి నామినేటెడ్ పోస్టులో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి తన రాజకీయ పలుకుబడితో అనుచరులను ఏర్పాటు చేసుకొని అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. ఇదే భూమిలో గతంలో రెవెన్యూ అధికారులు హైకోర్టు ఉత్తర్వుల హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయినా పట్టించుకోకుండా గ్రావెల్ దందా సాగిస్తున్నారు.
పట్టించుకోని అధికారులు:
టీడీపీ నాయకులు యథేచ్ఛగా గ్రావెల్ తరలిస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. నాయకులు కూడా మామూళ్ల మత్తులో పడి కనీసం స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ గ్రావెల్ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వల్లూరు చెరువులో పచ్చదొంగలు


