ఉలవపాడు మామిడి పేరుతో మోసం | - | Sakshi
Sakshi News home page

ఉలవపాడు మామిడి పేరుతో మోసం

Jan 29 2026 6:04 AM | Updated on Jan 29 2026 6:04 AM

ఉలవపాడు మామిడి పేరుతో మోసం

ఉలవపాడు మామిడి పేరుతో మోసం

హైవే పై మామిడి అమ్మకాలు బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అమ్మకాలు ఉలవపాడు ప్రాంతంలో పూతదశలోనే చెట్లు

వీరేపల్లి సమీపంలో అమ్ముతున్న కాయలు

ఉలవపాడు: ప్రపంచ వ్యాప్తంగా ఉలవపాడు మామిడి కాయలు అంటే మంచి గుర్తింపు ఉంది. మామిడి సీజన్‌లో ఉలవపాడు మామిడికాయల కోసం మామిడి ప్రియులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. దీనినే కొందరు వ్యాపారులు ఆసరాగా తీసుకున్నారు. ఉలవపాడు మండల పరిధిలోని జాతీయ రహదారితో పాటు పక్కన మండలాలైన గుడ్లూరు, శింగరాయకొండ పరిధిలోని జాతీయరహదారిపై మామిడి కాయల అమ్మకాలు ప్రారంభించారు. బయట ప్రాంతాలైన అనంతపురం, కడపలలో ప్రస్తుతం మామిడి కాయలు కోతకు వచ్చాయి. వాటిని ఇక్కడకు తీసుకొచ్చి ఉలవపాడు పరిసర మండలాల పరిధిలో జాతీయ రహదారిపై ఆటోల్లో తీసుకొచ్చి ట్రేలలో పెట్టి అమ్ముతున్నారు. ఉలవపాడు ప్రాంతంలో జాతీయ రహదారిపై మామిడి కాయల అమ్మకాలు అంటే ఈ ప్రాంతానికి చెందినవనే ఆలోచనతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతారు. దాన్ని ఆసరాగా చేసుకుని ఇక్కడ అమ్ముకోవచ్చనే మోసపు ఆలోచనతో ఎక్కడో 200 కి.మీ పైన ఉన్న ప్రాంతాల నుంచి కాయలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. కాయలు ఈ సమయంలో తక్కువ ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. హైవే పై కార్లు, లారీలలో వెళ్లే వారు ఉలవపాడు ప్రాంతంలో కాయలు ఉండడంతో ఉలవపాడు మామిడి వచ్చేసిందని కొనుగోలు చేసి వెళుతున్నారు.

ఉలవపాడు బ్రాండ్‌ కే దెబ్బ...

ఉలవపాడు మామిడి కాయలు అంటే ప్రత్యేక గుర్తింపు ఉంది. మంచిరంగుతోపాటు అద్భుతమైన రుచి సొంతం. కానీ ప్రస్తుతం ఇక్కడ అమ్మే కాయలకు పులుపు తగులుతుంది. ఇదేంటి ఉలవపాడు కాయలు రుచి తగ్గాయి అని తిన్న వారు అంటున్నారు. ఇది ఉలవపాడు ప్రాంతంలో పండే మామిడికే దెబ్బ అని మామిడి తోటల యజమానులు అంటున్నారు. ప్రస్తుతం ఉలవపాడు ప్రాంతంలో మామిడి కేవలం పూత దశలోనే ఉంది. మామిడి సీజన్‌ ఏప్రిల్‌ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ మూడు నెలల ముందే బయట కాయలు తీసుకువచ్చి ఉలవపాడు పరిసర ప్రాంతాల్లో పెట్టి అమ్మకాలు చేయడం వలన ఉలవపాడు మామిడికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా సాధారణంగా మామిడి సీజన్‌ లో కేజీ రూ.75 నుంచి రూ.150 వరకు అత్యధికంగా పలుకుతుంది. కానీ ఇప్పుడు బయటప్రాంతాల కాయలను కేజీ రూ.180 చొప్పున అమ్మకాలు చేస్తున్నారు. వేసవి లో దొరికే మామిడి ముందుగా శీతాకాలంలో దొరుకుతుంది అంటే గొప్ప అనే ఉద్దేశంతో కొనుగోలు దారులు ఆశగా కొంటున్నారు. కాయల వ్యాపారం ఎలా ఉన్నా ఈ కాయలు ఉలవపాడు మామిడి కాయలు మాత్రం కాదని, ఆ పేరుతో బయట ప్రాంతాల నుంచి వస్తున్న మామిడి మాత్రమే అని రైతులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement