స్వాట్ టీం సాహస ప్రదర్శన..
జిల్లా పోలీస్ స్వాట్ టీం శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల ప్రాణాలను కాపాడడంలో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ చేసిన సాహస ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్ కెమెరాల ద్వారా శత్రువులు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి, అక్కడికి స్వాట్ కమాండోలు చేరుకొని, చాకచక్యంగా శత్రువులను హతమార్చి, ప్రముఖులను ఎలా సురక్షితంగా రక్షిస్తారో డెమో ద్వారా ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు. అదేవిధంగా అగ్ని ప్రమాదం, విపత్కర పరిస్థితుల్లో స్పందించే విధానం, ఎలా రక్షించుకోవాలి అన్న విషయాలపై అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్దన్ రాజు సందర్శించారు. రిపబ్లిక్ డే పరేడ్‌ను అద్భుతంగా ప్రదర్శించిన ప్లాటూన్ కమాండర్లను కలెక్టర్ ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు. అలాగే స్వాట్ టీమ్ సిబ్బంది ప్రదర్శించిన సాహసాలను కలెక్టర్, ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించి ప్రశంస పత్రాలను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను అద్భుతంగా ప్రదర్శించిన పలు పాఠశాలల విద్యార్థులకు కలెక్టర్ ప్రశంస పత్రాలను అందజేశారు.


