
మద్యం తాగించి కొట్టి చంపారు
ఒంగోలు టౌన్: మిస్టరీగా మారిన అర్జున్ రెడ్డి హత్య కేసు ఒక కొలిక్కి వచ్చింది. ఒంగోలు రూరల్ మండలంలోని పాతపాడు గ్రామానికి చెందిన మోరుబోయని అర్జున్ రెడ్డి (57) గత నెల 19వ తేదీ నుంచి కనిపించడం లేదు. దాంతో అనుమానం వచ్చిన ఆయన సోదరుడు వెంకటేశ్వర రెడ్డి 29వ తేదిన తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అర్జున్ రెడ్డి భార్య సుశీలతో వివాహేతర సంబంధం ఉన్నట్లు చెబుతున్న కావూరి రమేష్‌రెడ్డిని గురువారం ఉదయం అరెస్టు చేశారు. తమదైన శైలిలో విచారించారు. దాంతో అర్జున్ రెడ్డిని హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసుల కథనం ప్రకారం...పాతపాడుకు చెందిన కాపూరి రమేష్‌రెడ్డికి, అదే గ్రామానికి చెందిన మోరబోయిన అర్జున్ రెడ్డి భార్య సుశీలతో అక్రమ సంబంధం ఉంది. చాలా కాలంగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయినా అర్జున్‌రెడ్డి అడ్డుగా ఉన్నాడని భావించిన రమేష్‌రెడ్డి, సుశీలతో కలిసి హత్యకు పథకం పన్నాడు. ఈ పథకంలో భాగంగా అర్జున్‌రెడ్డిని మద్యం తాగేందుకు రమ్మని చెప్పి దశరాజుకుంట పొలాల వైపు పిలుచుకొని వెళ్లాడు. అర్జున్‌రెడ్డిని మాటల్లో పెట్టి ఫుల్లుగా మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న అతడిని రాయితో కణతకు కొట్టి చంపాడు. అర్జున్‌రెడ్డి మరణించాడని నిర్ధారణ చేసుకున్న తరువాత సుశీలతో కలిసి మృతదేహాన్ని పక్కనే ఉన్న మరల బావిలో పడేశారు. ఆ తరువాత ఏమీ తెలియనట్లు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అయితే 19వ తేదీ నుంచి అర్జున్ రెడ్డి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. మృతుడి సోదరుడు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహం బాగా కుళ్లిపోయి ఉండడంతో ఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అర్జున్‌రెడ్డి భార్య సుశీల ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సీఐ అజయ్ కుమార్ తెలిపారు. ఆమె కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామని, త్వరలోనే ఆమెను పట్టుకుంటామని చెప్పారు.