
పాలమూరు నీళ్లపోరు ధర్నాలో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల
కొల్లాపూర్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్ చేసింది శూన్యం అని ఆమె ధ్వజమెత్తారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమ వారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో కొనసాగింది. ఆమె నార్లాపూర్ రిజర్వాయర్ డిస్ట్రిబ్యూటరీ చానల్ వద్ద పాలమూరు నీళ్ల పోరు ధర్నా చేపట్టారు.
కార్యక్రమంలో మాట్లాడుతూ ‘కేసీఆర్‌కు పాలమూరు జిల్లాపై ప్రేమ లేదు. తెలంగాణ ఉద్యమం ఇక్కడి నుంచే మొదలుపెట్టారు కదా! రాష్ట్రం వచ్చాక వలసల జిల్లా పాలమూరుపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నా, ఇప్పటివరకు చేసిందేమీ లేదు. ప్రాజెక్టు పనులపై 15 రోజులకు ఒకసారి సమీక్ష అన్నారు. ఇక్కడే కుర్చీ వేసుకుని కూర్చుంటా. దగ్గరుండి ప్రాజెక్టు కట్టిస్తా అన్నారు. ఆయన మాటలు కోటలు దాటుతాయి. పనులు మాత్రం గడప దాటవు’ అని ఎద్దేవా చేశారు. బీజేపీతో రాసుకు, పూసుకు తిరిగి ప్రాజెక్టుకు అనుమతులు ఎందుకు తెచ్చుకోలేకపోయారని ప్రశ్నించారు. ధర్నా ప్రాంతంలో షర్మిల మొక్కలు నాటారు.