సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. చంద్రబాబు తెచ్చే అప్పులు.. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చి 450 రోజులైనా ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడంలేదని మండిపడ్డారు.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆరోగ్యశ్రీ పథకం 2006-07లో ప్రారంభమైతే.. కూటమి ప్రభుత్వ కాలంలో రెండు సార్లు ఆగిపోయింది. ఇరవై ఏళ్లలో ఇలాంటి గొప్ప పథకం నిలిచిపోవడం దారుణం. ఆరోగ్యశ్రీ పేరు చెప్పితే చంద్రబాబు నాయుడుకు క్రెడిట్ రావటంలేదు. ఆరోగ్యశ్రీ పేరు చెప్తే రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ గుర్తుకు వస్తున్నారు. అందుకే ఈ పథకాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఆరు నెలలు ఎదురు చూసినా బిల్లులు రాక మళ్లీ స్ట్రైక్ చేశారు. ఆసుపత్రుల నిరసనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతోంది.
అప్పులకు సంబంధించి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ను, ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలను షూరిటీగా పెడుతున్నారు. ఇంతకంటే అన్యాయం ఎక్కడైనా ఉందా? చంద్రబాబు. ప్రభుత్వం తీసుకున్న అప్పులను ప్రైవేట్ ఆసుపత్రులే చెల్లించాలనే షరతు పెట్టడం దారుణం. రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.3.54 లక్షల కోట్లు అప్పులు చేశారు. ప్రభుత్వం నడపడం చేతకాక ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నారు. ఈ మాత్రం దానికి మంత్రులు ఎందుకు? సింగపూర్ పర్యటనలు ఎందుకు?. “సంపద సృష్టి” అంటే చంద్రబాబు భాషలో అప్పులు చేయడమేనని అర్ధం. సంపద సృష్టించలేక అప్పులతోనే పాలన సాగుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని పెట్టుబడిదారులకు లాభదాయక వనరుగా మార్చుతున్నారు. ఇంత దారుణమైన విధానం దేశంలో ఎక్కడా లేదు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పగించేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అన్ని ప్రైవేట్ వ్యక్తులకే ఇస్తే ఆరోగ్య శాఖ అవసరం ఏంటి?. ప్రతీ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్ నిర్మిస్తే చంద్రబాబు వాటిని ప్రైవేట్ వారికి ఇచ్చేస్తున్నారు. ప్రజలపై ఆరోగ్య బిల్లులు పెరుగుతున్నాయి. వాటిని తగ్గించాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచించినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


