మద్యం ముడుపుల డాన్‌ బాబే: వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jaganmohan Reddy Fires On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

మద్యం ముడుపుల డాన్‌ బాబే: వైఎస్‌ జగన్‌

May 23 2025 4:58 AM | Updated on May 23 2025 6:37 AM

YSRCP President YS Jaganmohan Reddy Fires On Chandrababu Govt

పథకాల అమలులో ఫెయిల్‌.. పాలనలో వైఫల్యం 

దాన్ని కప్పిపుచ్చుకునేందుకే లిక్కర్‌ స్కామ్‌ అంటూ చంద్రబాబు కుతంత్రం

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం

కేబినెట్‌ కళ్లుగప్పి మద్యంపై ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేస్తూ మూడు చోట్ల ఫైల్‌పై చంద్రబాబు సంతకాలు 

దీనివల్ల ఏటా ఖజానాకు రూ.5 వేల కోట్లకుపైగా నష్టం.. 

ఆదాయానికి గండి కొట్టడంపై బాబు సర్కారును తప్పుబట్టిన కాగ్‌ 

ప్రైవేట్‌ మద్యం దుకాణాలు, బెల్టు షాపులతో విచ్చలవిడిగా లూటీ 

ఎమ్మార్పీ కంటే రూ.20 – రూ.30కి అధికంగా విక్రయాలు 

ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది.. అలా తగ్గిన ఆదాయం 

చంద్రబాబు గజదొంగల ముఠా జేబులోకి చేరింది 

మద్యం స్కామ్‌పై బలమైన సాక్ష్యాధారాలున్నందునే బాబుపై కేసు నమోదు 

ఆ కేసులో ఇప్పుడు ఆయన బెయిల్‌పై ఉన్నారు 

తనపై కేసును నీరుగారుస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు

2019–24 మధ్య మద్యం స్కామ్‌ జరగకపోయినా.. జరిగినట్లుగా భేతాళ కుట్రలు చేస్తున్నారు 

ప్రలోభాలకు లొంగిపోయిన వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుంది? 

మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఇస్తారా? ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే లంచాలు ఇస్తారా? ఆలోచించండి 

మద్యంపై పన్నులు అధికంగా వేసి.. అమ్మకాలు తగ్గించి.. దానివల్ల లాభాలు తగ్గితే ఎవరైనా లంచాలు ఇస్తారా? 

మద్యం అమ్మకాలు పెంచి.. దాని వల్ల డిస్టిలరీలకు లాభాలు పెంచితే లంచాలు ఇస్తారా? 

బెదిరించి తప్పుడు వాంగ్మూలాలతో సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి..టార్గెట్‌ చేసి మరీ వేధిస్తున్నారు 

మా ప్రభుత్వ మద్యం పాలసీ, అమ్మకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని.. పారదర్శకంగా ఉందని 2022లోనే సీసీఐ తీర్పు 

బాబు మోసాలు, అరాచకాలను నిలదీస్తూ జూన్‌ 4న వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం 

సూపర్‌ సిక్స్‌ సహా 143 హామీలు అమలు చేయాలని కలెక్టర్లకు డిమాండ్‌ పత్రాలిస్తాం  

ఒక్క అవినీతి మాత్రమే కాదు.. పాలనలో కూడా ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. అందుకే నెలకో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు, ఆయన దొంగల ముఠా(ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5) రకరకాల పనులు చేస్తున్నారు. 

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకం అమలు లేదు. మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ రద్దు చేశారు. మే నెల పూర్తి కావస్తున్నా చంద్రబాబు ఇస్తానన్న రైతు భరోసా రూ.26 వేలు ఇవ్వలేదు. గత ఏడాది కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటికీ అందలేదు. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేల చొప్పున ఎగనామం. ఆడబిడ్డ నిధి రూ.18 వేలు, నిరుద్యోగ యువతకు ఏడాదికి రూ.36 వేలు, 50 ఏళ్లకే ప్రతి మహిళకు రూ.48 వేలు మోసంగా మారాయి.  పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన లేదు.

ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3,600 కోట్లు చెల్లించకపోవ­డంతో పేదలకు వైద్యం అందడం లేదు. ఇంకా మేనిఫెస్టోలో బాబు ప్రకటించిన 143 హామీల అమలు ఊసే లేదు. అన్ని రంగాలు తిరోగమనం. స్కూళ్లు, ఆస్పత్రులు అన్నీ నాశనం. ఏడాదిలోనే ప్రజలకు రూ.15 వేల కోట్ల కరెంటు బిల్లుల షాక్‌లిచ్చారు.  

‘‘మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే బలమైన కేసు నమోదైంది. తనపై నమోదైన కేసును ఇప్పుడు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. బెయిల్‌ నియమ, నిబంధనలన్నీ ఉల్లంఘించిన చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయకూడదు?’’

‘‘చంద్రబాబు చెప్పిన 143 హామీలు ఏమయ్యాయని గట్టిగా నిలదీస్తూ.. రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో చేస్తున్న అరాచకాలు, అన్యాయాలపై గళమెత్తుతూ జూన్‌ 4వ తేదీన ‘వెన్నుపోటు’ దినం నిర్వహిస్తాం. ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తయ్యే రోజు సందర్భంగా సామాజికవేత్తలు, యువకులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులను మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్‌ పత్రాలు అందించి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం’’
-మీడియాతో వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం కుంభకోణానికి పాల్పడి ఆ కేసులో బెయిల్‌పై ఉన్న సీఎం చంద్రబాబు ఆ కేసు దర్యాప్తును నీరుగారుస్తూ గత ప్రభుత్వ పారదర్శక మద్యం విధానంపై అబద్ధపు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. 2019–24 మధ్య అసలు మద్యం స్కామ్‌ ఎక్కడ జరిగిందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. భేతాళ కథలు సృష్టించి.. జరగని స్కామ్‌ను జరిగినట్లు చిత్రీకరించి.. ప్రలోభపెట్టి, బెదిరించి, భయపెట్టి లొంగదీసుకున్న వ్యక్తులతో తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని.. వాటి ఆధారంగా సంబంధం లేని వ్యక్తులపై తప్పుడు కేసులు పెడుతూ అరాచకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యానికి సంబంధించి ఒక్క ఫైలైనా సీఎంవోకు వచ్చినట్లుగానీ.. సంతకం చేసినట్లుగానీ చూపించగలరా? అంటూ సీఎం చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. ఎవరికైనా లాభాలు వచ్చేలా చేస్తే లంచాలు ఇస్తారేమోగానీ.. పన్నులు బాదేసి, పర్మిట్లు రద్దు చేసి, వారి లాభాలు తగ్గించి, రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచితే ఎవరైనా లంచాలు ఇస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. నిజమైన మద్యం స్కామ్‌స్టర్‌ చంద్రబాబేనని పునరుద్ఘాటించారు. 2014–19 మధ్య చంద్రబాబు మద్యం కుంభకోణానికి పాల్పడి సాక్ష్యాధారాలతో పట్టుబడ్డారని.. ఆ కేసులో ఆయన బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేశారు. 

ఆ కేసును నీరుగార్చడానికే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అప్పుడు మద్యం కుంభకోణానికి పాల్పడి దోపిడీ చేసిన తరహాలోనే ఇప్పుడూ దోచేస్తున్నారని.. దాన్ని సమర్థించుకోవడానికే 2019–24 మధ్య జరగని మద్యం స్కామ్‌ జరిగినట్లుగా చిత్రీకరిస్తూ తప్పుడు కేసులు పెట్టి.. సంబంధం లేని వ్యక్తులను వేధిస్తున్నారని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. 

సీసీఐ (కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా) తీర్పు, 2014–15 మధ్య కేబినెట్‌ ఆమోదం లేకుండా.. ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండా మద్యంపై ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు మూడు చోట్ల సంతకం చేసిన నోట్‌ ఫైలు.. 2014–19 మధ్య మద్యం అమ్మకాలు పెరిగినా ప్రభుత్వానికి ఆదాయం తగ్గడం లాంటి వాటిని సాక్ష్యాధారాలతో సహా ఎండగడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వ దుర్నీతిని కడిగి పారేశారు. చంద్రబాబు  మోసాలను నిలదీస్తూ.. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ ఏమయ్యాయని ప్రశ్నించారు. 
 


చంద్రబాబు చెప్పిన 143 హామీలు ఏమయ్యాయని గట్టిగా నిలదీస్తూ.. రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో చేస్తున్న అరాచకాలు, అన్యాయాలపై గళమెత్తుతూ జూన్‌ 4వ తేదీన ‘వెన్నుపోటు’ దినం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సందర్భంగా ప్రజలతో కలసి, ప్రజల కోసం సామాజికవేత్తలు, యువకులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులను మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్‌ పత్రాలు అందించి నిరసన కార్యక్రమాలు నిర్వహి­స్తామన్నారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

పాలనలో ఘోర వైఫల్యం..
ఒక్క అవినీతి మాత్రమే కాదు.. పాలనలో కూడా ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. అందుకే నెలకో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు, ఆయన దొంగల ముఠా (ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5) రకరకాల పనులు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకం అమలు లేదు. మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. 

మే నెల పూర్తి కావస్తున్నా కూడా చంద్రబాబు ఇస్తానన్న రైతు భరోసా రూ.26 వేలు ఇవ్వలేదు. గత ఏడాది కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటికీ అందలేదు. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేల చొప్పున ఎగనామం. ఆడబిడ్డ నిధి రూ.18 వేలు, నిరుద్యోగ యువతకు ఏడాదికి రూ.36 వేలు, 50 ఏళ్లకే ప్రతి మహిళకు రూ.48 వేలు మోసంగా మారాయి.  

పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన లేదు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయి ఏడాది దాటింది. రూ.3,600 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు వైద్యం అందడం లేదు. ఇంకా మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించిన 143 హామీల అమలు ఊసే లేదు. అన్ని రంగాలు తిరోగమనం. స్కూళ్లు, ఆస్పత్రులు అన్నీ నాశనం. ఏడాదిలోనే ప్రజలకు ఏకంగా రూ.15 వేల కోట్ల కరెంటు బిల్లుల షాక్‌లిచ్చారు.

లిక్కర్‌ స్కామ్‌.. ఫ్యాబ్రికేషన్‌..
ఇలాంటి పరిస్థితుల్లో.. చంద్రబాబు తనకు తెలిసిన మాస్టర్‌ ఆర్ట్‌ను బయటకు తెచ్చారు. వ్యవస్థలను నాశనం చేయడంతోపాటు ప్రశ్నించే గొంతులను నొక్కడానికి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. తాజాగా లిక్కర్‌ స్కామ్‌ అంటూ రాజకీయ కక్షకు దిగారు. అసలు స్కామ్‌ ఎక్కడ జరిగింది? ప్రతి ఒక్కరూ ఆలోచించమని కోరుతున్నా. మీ మనస్సాక్షిని అడగండి. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? మద్యం ఎక్కువ అమ్మి, అమ్మకాలు పెంచి, దాని వల్ల డిస్టిలరీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా? లేక పన్నులు పెరిగి, అమ్మకాలు తగ్గిపోతే డిస్టిలరీలు లంచాలు ఇస్తాయా?

రెండు ప్రభుత్వాలు.. మద్యం విక్రయాలు
ఒకసారి రెండు ప్రభుత్వాల హయాంలో మద్యం అమ్మకాలు, వాటి ద్వారా వచ్చిన ఆదాయం చూస్తే.. టీడీపీ హయాంలో ఐఎంఎల్, బీర్ల అమ్మకాల ద్వారా చివరి ఏడాది 2018–19లో రూ.17,341 కోట్ల ఆదాయం వస్తే.. మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది 2023–24లో వచ్చిన ఆదాయం రూ.25,082 కోట్లు. అదే సమయంలో టీడీపీ హయాంలో కంటే మద్యం అమ్మకాలు తగ్గాయి. అయినా ఆదాయం ఎందుకు పెరిగిందంటే.. పన్నులు వేశాం. ఆ విధంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చాం. టీడీపీ హయాంలో చివరి ఏడాది ఐఎంఎల్‌ 3.84 కోట్ల కేసులు, బీర్లు 2.77 కోట్ల కేసులు అమ్ముడుపోతే మా ప్రభుత్వ చివరి ఏడాదిలో ఐఎంఎల్‌ 3.32 కోట్ల కేసులు, బీర్లు 1.12 కోట్ల కేసులు అమ్ముడుపోయాయి.

2014–19 మధ్య మద్యంలో అవినీతి.. 
చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నట్లుగానే కొన్ని డిస్టిలరీలకు మాత్రమే మేలు చేసేలా ప్రైవేటు లిక్కర్‌ షాప్‌ల నుంచి ఇండెంట్‌ పెట్టించడం ద్వారా 2014–19 మధ్య కేవలం ఐదు డిస్టిలరీలే రాష్ట్రంలో 69 శాతం మద్యాన్ని సరఫరా చేశాయి. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉంటే వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబే అనుమతి ఇచ్చారు. మిగిలిన ఆరు వేర్వేరు ప్రభుత్వాల్లో అనుమతి పొందాయి. అంతేకాదు.. మద్యం సేకరణకు ఆ 20 డిస్టిలరీలను లిస్ట్‌ చేసింది (ఎంప్యానల్‌) కూడా చంద్రబాబు ప్రభుత్వమే. మేం కొత్తగా ఏ డిస్టిలరీనీ చేర్చలేదు. కొత్తగా ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదు. 

మా విధానం సహేతుకమని సీసీఐ తీర్పు.. 
చంద్రబాబు అండ్‌ కో కంపెనీలు మా ప్రభుత్వ మద్యం విధానంపై 2022లో కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాలో కేసు వేశాయి. ఆ పిటిషన్‌లో ఉన్న అంశాలన్నీ టీడీపీ వాళ్లు అప్పుడూ, ఇప్పుడూ చేస్తున్న అభియోగాలే. అందుకే అందరూ జాగ్రత్తగా చూడాలని కోరుతున్నా. ఆ అభియోగాలు ఏమిటంటే.. కొన్ని బ్రాండ్లను ఉద్దేశపూర్వకంగా తొక్కి పెట్టేశారని, సప్లయ్‌ ఆర్డర్లలో వివక్ష చూపించారని ఆరోపించారు. సీసీఐ ఆ అభియోగాలన్నింటిపై సుదీర్ఘ విచారణ చేపట్టి సంబంధిత రికార్డులు, సప్లయ్‌ ఆర్డర్లన్నింటినీ పరిశీలించి 2022 సెప్టెంబర్‌ 19న చారిత్రాత్మక జడ్జిమెంట్‌ ఇచ్చింది. 

రాష్ట్ర ప్రభుత్వం అమ­లు చేస్తున్న మద్యం విధానం పూర్తిగా సహేతుకంగా ఉందని, మా ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల మద్యం అమ్మ­కాలు తగ్గాయని, అన్ని కంపెనీల మద్యం బ్రాండ్లు కొంటున్నారని, వాటికి సంబంధించిన చెల్లింపులు కూడా సకాలంలో చేస్తున్నారని తీర్పు ఇచ్చింది. సీసీఐ ఇచ్చిన తీర్పులో పేరాగ్రాఫ్‌ 85, 90, 95, 96, 97, 98, 101లో మొత్తం వివరాలు ఉన్నాయి. సీసీఐ జడ్జిమెంట్‌ కాపీలు పబ్లిక్‌ డొమైన్లో ఉంచుతాం.  

ఏం విలువ ఉంటుంది?  
చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయిరెడ్డి. రాజ్యసభ సభ్యుడిగా మరో మూడున్నరేళ్ల టర్మ్‌ ఉండగానే చంద్రబాబు కూటమికి మేలు చేసేందుకు పదవికి రాజీనామా చేశాడు. వైఎస్సార్‌సీపీకి తగినంత ఎమ్మెల్యేల బలం లేదు.. మళ్లీ రాజ్యసభకు తన అభ్యరి్థని పంపించే అవకాశం ఉండదని, కూటమికి మేలు జరుగుతుందని తెలిసి కూడా ప్రలోభాలకు గురై రాజీనామా చేశారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్స్‌కు ఏం విలువ ఉంటుంది? 

మరో నిందితుడిగా చెబుతున్న రాజ్‌ కేసిరెడ్డికి బెవరేజెస్‌ కార్యకలాపాలతో ఏం సంబంధం? ఐటీ రంగంలో అనుభవం ఉన్న ఆయన ఒక వ్యాపారస్తుడు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అనేక మందిలో ఒకరు. అదీ రెండేళ్లు మాత్రమే. అది కూడా కోవిడ్‌ సమయంలో. ఇక విజయవాడకు వచ్చింది కూడా తక్కువే. ఆయనకు ప్రస్తుత టీడీపీ విజయవాడ ఎంపీతో సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇద్దరూ కలిసి వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఇద్దరూ కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. 

ఈ వ్యక్తి అయితే టీడీపీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని, సులభంగా ప్రలోభ పెట్టవచ్చని తీసుకొచ్చారు. ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభాలు పెట్టి అప్రూవర్‌గా మారుస్తామన్నారు. అయితే అబద్ధం చెప్పకపోవడం వల్ల నిందితుడిగా చేర్చారని ఆయన స్వయంగా సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఇలా చేయదల్చుకుంటే ఎవరి మీదనైనా భేతాళ విక్రమార్క కథలు అల్లేసి ఏమైనా చెప్పించవచ్చు.  

బెవరేజెస్‌ కార్పొరేషన్, లిక్కర్‌తో ఎంపీ మిథున్‌రెడ్డికి ఏం సంబంధం? వాళ్ల నాన్న కనీసం ఈ శాఖ మంత్రి కూడా కాదు. అరెస్టు చేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ కె.ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి పి.కృష్ణమోహన్‌రెడ్డికి ఈ కేసుతో ఏం సంబంధం? మద్యానికి సంబంధించి ఒక్క  ఫైలు అయినా సీఎంవోకు వచ్చినట్లు, ఒక్క సంతకం అయినా చూపించగలరా? అని సవాల్‌ విసురుతున్నా చంద్రబాబుకు. ధనుంజయరెడ్డి కనీసం ఎక్సైజ్‌ శాఖ కూడా చూసేవారు కాదు.  

మల్టీ నేషనల్‌ కంపెనీని అప్రతిష్ట పాలు చేస్తూ.. 
బాలాజీ గోవిందప్ప మల్టీ నేషనల్‌ కంపెనీ వికాట్‌లో హోల్‌టైమ్‌ డైరెక్టర్‌. 12 దేశాల్లో వాళ్లకు కార్యకలాపాలు ఉన్నాయి. ఆయన అసలు ఏపీలోనే ఉండరు. వికాట్‌ యూరప్‌ టాప్‌ 5 సిమెంట్‌ కంపెనీల్లో ఒకటి. చంద్రబాబు, ఈనాడు రాతలు, మాటలు చూస్తే.. ఆయనేదో ఖాళీగా ఉన్నాడు, నా పనులు చక్కబెట్టేవారని రాసుకొచ్చారు. నా పనులు చక్కబెట్టడానికి నా కంపెనీ డైరెక్టర్లు, ఉద్యోగులు చాలామంది నాకున్నారు. 

అసలు వికాట్‌ అనేది నా కంపెనీనే కాదు. రిలయన్స్‌లో నాకు కొన్ని షేర్లు ఉంటే రిలయన్స్‌ నాది అయిపోదు. నాకు ఓనర్‌షిప్‌ ఉన్న కంపెనీలు నాకు ఉంటాయి. దాంట్లో ఎంప్లాయీస్‌ నాకు ఉంటారు. దాంట్లో డైరెక్టర్స్‌ నాకు ఉంటారు. నేను ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే వాళ్లతో చేయిస్తా. నా వ్యాపారాలకు సంబంధించి. అంతే తప్ప నాది కాని కంపెనీలో డైరెక్టర్లు, బిజీగా ఉండేవాళ్లు నాకెందుకు పని చేస్తారు? ఒక మల్టీ నేషనల్‌ కంపెనీని అప్రతిష్ట పాలు చేస్తూ తప్పుడు సంకేతాలు పంపుతున్నారు.  

తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలు, కేసులు.. 
వాస్తవాలు ఇలా ఉంటే అక్రమ కేసులో భయపెట్టి, బెదిరించి తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి చంద్రబాబు అరాచకంగా వ్యవహరిస్తున్నారు. బెవరేజెస్‌ కార్పొరేషన్‌లో పని చేస్తున్న సత్యప్రసాద్‌ ఒక సాధారణ సూపరింటెండెంట్‌ స్థాయి ఉద్యోగి. సూపరింటెండెంట్‌లు పదుల సంఖ్యలో ఉంటారు. అనూష ఔట్‌ సోర్సింగ్‌లో పని చేసిన క్లరికల్‌ ఉద్యోగి. 

వాళ్లను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించారు. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా పని చేసిన వాసుదేవరెడ్డి ఈ ప్రభుత్వం తనను వేధిస్తోందని హైకోర్టులో మూడు సార్లు ముందస్తు బెయిల్‌ పిటిషన్లు వేశారు. ఆయన్ను బెదిరించి, భయపెట్టి, లొంగదీసుకుని అబద్ధపు వాంగ్మూలం ఇప్పించాక కేంద్ర సర్వీస్‌కు వెళ్లిపోవడానికి ఎన్‌ఓసీ ఇచ్చారు. ఇలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్‌మెంట్స్‌కు ఏం విలువ ఉంటుంది?  

అసలు లంచాలు ఎప్పుడిస్తారు..?
మద్యాన్ని ప్రభుత్వమే స్వయంగా అమ్మితే లంచాలు ఇస్తారా? షాపులు తగ్గించి, పర్మిట్‌ రూమ్‌లు, బెల్టు షాపులను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? లేకప్రైవేటు వ్యక్తులకు లిక్కర్‌ వ్యాపారం అప్పజెప్పి అడ్డగోలుగా రోజంతా అమ్మి లాభాలు గడిస్తే, డిస్టిలరీలకు ఎక్కువ ఆదాయం వస్తే లంచాలు ఇస్తారా? ఆలోచించండి. పేరుకు లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించినా తమకు కావాల్సిన వారికే షాపులు దక్కేలా చేశారు. 

ఇతరులు ఎవరైనా షాపులు దక్కించుకుంటే నిస్సిగ్గుగా 30 శాతం వాటా తీసుకున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. రోజంతా యథేచ్ఛగా అమ్ము­తున్నారు. చివరకు డోర్‌ డెలివరీ కూడా చేస్తున్నారు. బెల్టుషాప్‌ల నిర్వహణకు వేలంపాట పాడుతున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మిస్తున్నారు. అలా వస్తున్న ఆదాయాన్ని పంచుకుంటున్నారు. అంతే కాకుండా ఏ డిస్టిలరీకి మేలు చేయాలనుకుంటే ప్రైవేటు షాపుల ప్రైవేటు సైన్యంతో ఆ డిస్టిలరీ ఉత్పత్తులకు ఇండెంట్‌ వేయిస్తారు. 

ఆ విధంగా ఆ కంపెనీకి మేలు చేస్తున్నారు. ఇది మా హయాంలో జరిగిందా? ఎక్కడైనా ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మారా? మరి లంచాలు ఎవరికి ఇస్తారు? ప్రైవేటు షాపుల చేత, వీరు ఎంపిక చేసుకున్న డిస్టిలరీకి ఎక్కువ ఆర్డర్‌ ఇస్తే లంచాలు ఇస్తారా? లేక మా హయాంలో మాదిరిగా ప్రతి బాటిల్‌పై క్యూఆర్‌ కోడ్‌ పెట్టి దాన్ని అమ్మేటప్పుడు స్కాన్‌ చేసి ఆటోమేటిక్‌గా అప్‌లోడ్‌ చేసే విధానం అమలు చేశాం. ఆ డిమాండ్‌ మేరకు ఆయా డిస్టిలరీలకు ఆర్డర్లు ఇచ్చాం. అలా చేస్తే లంచాలు ఇస్తారా?

స్కామ్‌స్టర్‌ చంద్రబాబే
మద్యంలో అసలు స్కామ్‌స్టర్‌ ఎవరంటే చంద్రబాబే. 2014–2019 మధ్య చేసిన లిక్కర్‌ స్కామ్‌లో చంద్రబాబు బెయిల్‌పై లేరా? ఇది వాస్తవం కాదా? ఆ రోజు చంద్రబాబు చేసిన స్కామ్‌ మీరే చూడండి.. 

రాష్ట్రంలో 4,380 లిక్కర్‌షాపుల కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియను రిగ్గింగ్‌ చేశారు. తన ఎమ్మెల్యేలు, మంత్రులు, బినామీలు, తన మనుషులు రిగ్గింగ్‌ చేసి షాపులు ఇప్పించుకున్నారు. ఈ షాపులన్నింటిని ఒక సిండికేట్‌ మాఫియాగా తయారు చేశారు. వీటికి పక్కనే ఇల్లీగల్‌గా పర్మిట్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి ఏకంగా 43 వేల బెల్ట్‌షాపులు నడిపారు. ఎక్కువ రేటుకు మద్యాన్ని అమ్మారు. అప్పుడు కూడా ఇలాగే ప్రైవేట్‌ షాపుల సిండికేట్‌ ఏర్పాటు చేసుకుని తనకు కావాల్సిన డిస్టిలరీలకు మేలు చేసే వి«ధంగా ఆర్డర్స్‌ చేశారు. తనకు కావాల్సిన కంపెనీలతో ఇండెంట్‌ ఇప్పించారు. 2015– 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఐదు కంపెనీలకే 69 శాతం ఆర్డర్స్‌ దక్కాయి.  

⇒ కొన్ని బ్రాండ్లకు కృతిమ డిమాండ్లు సృష్టించారు. 2014 నవంబర్‌లో జీవో 993 ప్రకారం ఏర్పాటైన  కమిటీ సిఫార్సులు బేఖాతరు చేస్తూ డిస్టిలరీల కెపాసిటీకి మించి ఉత్పత్తికి చంద్రబాబు ప్రత్యేకంగా సిఫార్సు చేశారు. తరువాత 2012 నుంచి అమలులో ఉన్న ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేసి ప్రైవేటు వైన్‌షాప్‌లు, బార్లకు లబ్ధి చేకూర్చారు. అందుకోసం 2015 డిసెంబర్‌ 11న జీవోను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన నోట్‌ఫైల్‌లో స్వయంగా చంద్రబాబే సంతకం చేశారు. 

క్యాబినెట్‌ అనుమతి లేకుండా మూడుసార్లు చంద్రబాబు సంతకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చుతూ చంద్రబాబు సంతకం చేసిన ఫైల్‌ను కాగ్‌ కూడా తప్పుబట్టింది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే చంద్రబాబుపై బలమైన కేసు నమోదైంది. చంద్రబాబు ఆ కేసులో ఇప్పుడు బెయిల్‌పై ఉన్నారు. దాన్ని కప్పి పుచ్చుకుంటూ ఇప్పుడు అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారు. తన ట్రేడ్‌ మార్క్‌ పాలసీ ప్రకారం స్కామ్‌లు చేస్తూ వైఎస్సార్‌సీపీ హయాంలో కుంభకోణం జరిగినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ బ్రాండ్లు ఎప్పుడైనా చూశామా? 
ఇప్పడు చంద్రబాబు అమ్ముతున్న బ్రాండ్లు ఏమిటి? ఈ బ్రాండ్ల ఫొటోలు ఎప్పుడన్నా చూశారా? సుమో.. కేరళా మాల్ట్‌ ఎప్పుడన్నా చూశారా? షార్ట్‌ విస్కీ ఎప్పుడన్నా చూశారా? బెంగళూరు విస్కీ.. బెంగళూరు బ్రాందీ.. రాయల్‌ ల్యాన్సర్‌ విస్కీ.. ఓల్డ్‌ క్లబ్‌.. గుడ్‌ ఫ్రెండ్స్‌ అంట.. ఎప్పుడూ చూడని బ్రాండ్లు కాదా ఇవి?  ఏ శాస్త్రీయత ఆధారంగా ఈ ఆర్డర్లు ప్లేస్‌ చేస్తున్నారు? ఇవన్నీ ప్రైవేటు మాఫియా చేత.. తన ప్రైవేటు షాపులు.. తనకు కావాల్సిన డిస్టిలరీస్‌కు మేలు చేసేందుకు.. ఇండెంట్లు పెడుతున్నారు. ఇలాంటి ఊరూ పేరూ లేని బ్రాండ్లు కావాలని ఎవరన్నా అడుగుతారా? 

ధరలు తగ్గిస్తానని చెప్పి..
చంద్రబాబు తానొస్తే ధరలు తగ్గిస్తానన్నాడు.. తగ్గించింది లేదు కానీ షాపులు తన మాఫియా చేతుల్లో పెట్టిన తర్వాత.. ప్రాసెస్‌ అంతా పూర్తయ్యాక వారికిచ్చే కమీషన్‌ పెంచాడు. ఇది స్కాం కాదా? ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారు. విలేకరులు గ్రామాల్లోకి వెళ్లి ఎంక్వైరీ చేయండి. ఇది స్కాం కాదా? రూ.99కే లిక్కర్‌ ఇస్తానని క్వాలిటీ గతంలో కంటే ఒక లెవల్‌ తగ్గించి అమ్ముతున్నారు. ఆ చీపెస్ట్‌ చీప్‌ లిక్కర్‌ కూడా పొరుగు రాష్ట్రాల్లో రూ.10 తక్కువ. 

అన్నీ పబ్లిక్‌ డొమైన్‌లో..
చంద్రబాబు హయాంలో లిక్కర్‌లో దోపిడీకి సంబంధించి వివరాలు పబ్లిక్‌ డొమైన్‌లో పెడుతున్నాం. వైఎస్సార్‌ సీపీ హ్యాష్‌ ట్యాగ్‌.. వైఎస్సార్‌ సీపీ ట్విట్టర్‌ హ్యాండిల్‌లో నా పర్సనల్‌ ట్విట్టర్‌ హ్యాండిల్‌లో 22 పేజీల డాక్యుమెంట్‌ పెడతాం. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. డౌన్‌ లోడ్‌ చేసుకోండి. మద్యం అక్రమాలు, రెడ్‌ బుక్‌ మీద కూడా ఇంగ్లిష్‌, తెలుగు వెర్షన్‌ కాపీలు పెడతాం.  

కూటమి ప్రభుత్వ అనైతిక పర్వం
చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక  జరిగిన హత్యలు 390. హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్‌ సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు 500 మంది. అక్రమ కేసులు నమోదైన సోషల్‌ మీడియా యాక్టివిస్టులు 440 మంది. 

కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్‌ మీడియా యాక్టివిస్టులు 79 మంది. దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198. ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. జైలుకు వెళ్లిన ప్రజాసంఘాల నాయకులు 2. జైళ్లకు వెళ్లిన జర్నలిస్టులు 8 మంది.

అధికారులకు వేధింపులు
టీడీపీ పాలనలో వేధింపులకు గురైన అధికారులు 199 మంది. వారిలో ఏఎస్పీలు 27, డీఎస్పీలు 42, సీఐలు 119 మంది. ఐపీఎస్‌లు డీజీ ర్యాంకు అధికారి.. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, డీజీ ర్యాంక్‌ దళిత అధికారి సునీల్‌ కుమార్, అడిషనల్‌ డీజీ ర్యాంకు అధికారి సంజయ్‌ ఐపీఎస్, సీనియర్‌ ఆఫీసర్, ఐజీ ర్యాంక్‌ కాంతిరాణా టాటా, ఐజీ ర్యాంక్‌ ఆఫీసర్‌ విశాల్‌ గున్నీ, ఐజీ ర్యాంకు అధికారి రఘురామిరెడ్డి, రవిశంకర్‌ రెడ్డి, నిశాంత్‌ రెడ్డి ఐపీఎస్‌ లు, ఐపీఎస్‌ అధికారి పి.జాషువా వేధింపులకు గురయ్యారు. మరో రిటైర్డ్‌ అధికారి విజయ్‌పాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. పార్టీ ట్విట్టర్‌ హ్యాండిల్, నావ్యక్తి గత ట్విట్టర్‌ హ్యాండిల్‌లో కూడా ఈ సమాచారాన్ని అప్‌ లోడ్‌ చేస్తాం. 

మచ్చలేని అధికారులు.. 
ధనుంజయరెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్‌. రిటైర్డ్‌ ఐఏఎస్‌. పాపం ఆయన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తుంటే తీసుకొచ్చి జైల్లో పెట్టారు. కృష్ణమోహన్‌ అన్న కుమార్తెకు ఇటీవలే పెండ్లి ఖాయమైంది. బాలాజీ గోవిందప్ప తన కుమార్తె పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకో అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును తీసుకొచ్చి జైల్లో పెట్టారు. సునీల్‌ కుమార్‌ డీజీ స్థాయి దళిత ఐపీఎస్‌ అధికారి. ఆయన్ను సస్పెండ్‌ చేసి హరాస్‌ చేస్తున్నారు. సంజయ్‌ అడిషనల్‌ డీజీ, దళిత ఆఫీసర్‌. ఆయన్ను సస్పెండ్‌ చేసి కేసులు పెట్టారు. విజయ్‌ పాల్‌ను తప్పుడు కేసులతో అరెస్టు చేశారు. 

కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీ సీనియర్‌ ఐపీఎస్‌లు ఇద్దరినీ సస్పెండ్‌ చేశారు. ఐపీఎస్‌ అధికారి జాషువాపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. రఘురామిరెడ్డి ఐజీ, ఐపీఎస్‌. రిషాంత్‌ రెడ్డి ఎస్పీ, ఐపీఎస్‌. వీరికి పోస్టింగులు లేవు. దాదాపు 199 మంది పోలీసు అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇవ్వకుండా వీఆర్‌లో పెట్టింది. ప్రభుత్వమే స్వయంగా అసెంబ్లీకి దీన్ని వెల్లడించింది. నిజం చెప్పాలంటే రాష్ట్రంలో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. అందుకే ఐఏఎస్‌లే కాదు, ఐపీఎస్‌లు కూడా మీటింగ్‌ పెట్టుకోవాలి.

నిప్పు రవ్వలు
‘‘మా హయాంలో రెండేళ్లు కోవిడ్‌ లాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వచ్చినా రాష్ట్రాన్ని గొప్పగా సంక్షేమం, అభివృద్ధి బాటలో నడిపాం. అదే చంద్రబాబు ఏడాది పాలన.. కాగ్‌ నివేదిక గమనిస్తే.. ఎక్కడా అభివృద్ధి, సంక్షేమం లేనే లేదు. కేవలం 3.08 శాతం మాత్రమే గ్రోత్‌రేట్‌ కనిపిస్తోంది. ఇదే సమయంలో దేశంలో 13.76 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఆదాయం రాష్ట్ర ఖజానాకు కాకుండా చంద్రబాబు, ఆయన గజదొంగల ముఠా జేబులోకి వెళ్తోంది. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే చంద్రబాబు కేవలం 12 నెలల్లోనే రూ.1,37,546 కోట్ల అప్పులు చేశారు. చంద్రబాబు అప్పుల కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. 436 గనులను తాకట్టు పెట్టి బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.9 వేల కోట్ల అప్పు చేస్తున్నాడు. ఆ అప్పు కోసం చట్ట విరుద్ధంగా రాష్ట్ర కన్సాలిడేటెడ్‌ ఫండ్‌పై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పిస్తున్నారు. అది నేరం..’’  

పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు
ఇప్పటికే సజ్జన్‌ జిందాల్‌ను బెదరగొట్టారు. జత్వానీ గిత్వానీ అని చెప్పి అధికారులను అరెస్టు చేశారు.  ఆంధ్ర అంటే నమస్కారం పెట్టి వ్యాపారం చేయొద్దని సజ్జన్‌ జిందాల్‌ చెబుతున్నాడు. అరబిందో వాళ్లు ఇప్పటికే చంద్రబాబుకి నమస్కారం పెడుతున్నారు. షిప్, సీజ్‌ అంటూ ఇష్టం వచ్చినట్లు  ఆరోపణలు చేశారు. చివరకు షిప్, బియ్యం పోయాయి. ఇప్పుడు వికాట్‌ మల్టీ నేషనల్‌ కంపెనీపై పడ్డారు. వీళ్ల ఎమ్మెల్యేలు, మంత్రుల పుణ్యమా అని కుమారమంగళం బిర్లా అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ నమస్కారం పెడుతోంది. ఇలా పారిశ్రామిక­వేత్తలను హడలెత్తిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement