ప్రత్యేక హోదా ఎందుకివ్వరు?

YSRCP MPs who deposed Central Govt in Parliament On AP Special status - Sakshi

పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

నాటి, ప్రస్తుత ప్రధానమంత్రులు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందేనని డిమాండ్‌

లోక్‌సభ, రాజ్యసభల్లో పార్టీ వాణిని వినిపించిన మిథున్‌రెడ్డి, బోస్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకివ్వరని మంగళవారం పార్లమెంటులో వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పి.వి.మిథున్‌రెడ్డి, రాజ్యసభలో పార్టీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని కోరారు. లోక్‌సభలో  డిమాండ్స్, గ్రాంట్స్‌పై జరిగిన చర్చలో మిథున్‌రెడ్డి మాట్లాడుతూ యూపీఏ, ఎన్డీయే కలిసి రాష్ట్రాన్ని విభజించాయని గుర్తుచేశారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నాటి ప్రధాని మన్మోహన్, ప్రస్తుత ప్రధాని మోదీ సభలోను, బయట ఇచ్చిన హోదా హామీ నెరవేర్చాలని కోరారు.

విభజన సమయంలో తెలంగాణ కన్నా ఏపీ తలసరి ఆదాయం తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. విభజన చట్టం అమలు పదేళ్ల కాలంలో ఇప్పటికి ఎనిమిదేళ్లు ముగిసిందని చాలా హామీలు నెరవేర్చాల్సి ఉందని చెప్పారు. విభజన హామీల అమలు తీరు.. ఒక రాష్ట్రానికి సాయం చేయడానికి ఓ రాజు పలువురు తెలివైనవారి సలహాలు తీసుకుని పులిని చేయబోయి పిల్లిని ఆవిష్కరించినట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లు గడిచినా పోలవరం ప్రాజెక్టు, పెట్రోకారిడార్‌ వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్, వెనకబడిన జిల్లాల గ్రాంటు ఇలా పలు అంశాల్లో రాష్ట్రం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. విభజన సమయంలో ఎన్డీయే, యూపీఏ రెండూ రాష్ట్రానికి హామీలిచ్చాయని గుర్తుచేశారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో కేంద్రం రాష్ట్రానికి సహకరించాలని కోరారు. 

పోలవరాన్ని ఇరిగేషన్, తాగునీరు..అంటూ వేరుచేయడం సరికాదు
పోలవరం ప్రాజెక్టుకు నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే 194 టీఎంసీలతో డిజైన్‌ రూపొందించారని గుర్తుచేశారు. ప్రాజెక్టును విభజన చట్టం రాకముందే మొదలు పెట్టారన్నారు. విభజన చట్టంలో పోలవరానికి జాతీయ హోదా ప్రకటిస్తూ.. కేంద్రమే పూర్తిచేస్తుందని, అన్ని అనుమతులు ఇచ్చి పునరావసం పరిహారం సహా అన్నింటినీ నెరవేరుస్తామని చెప్పి ఇప్పుడు చేయకపోవడం బాధాకరమని చెప్పారు. సవరించిన అంచనాలకు సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపిందని, దీన్ని కేబినెట్‌ ఆమోదించాలని కోరారు. నాడు ఎన్డీయే ప్రభుత్వం, టీడీపీల మధ్య ఏం జరిగిందో అనవసరమని రాష్ట్రానికి నిర్మాణ బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తిగాక ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇరిగేషన్, తాగునీరు కాంపొనెంట్‌ అంటూ వేరుచేయడం సరికాదన్నారు. సవరించిన అంచనా రూ.55 వేల కోట్లకు అనుమతించినప్పుడే ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందన్నారు. 

ఇవ్వాల్సిన రూ.1,700 కోట్లు వెంటనే విడుదల చేయాలి
ఏపీలో పౌరసరఫరాలకు ఇవ్వాల్సిన రూ.1,700 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. రిసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ విషయంలో కాగ్‌ ఆడిట్‌ చేసి చెప్పిన విధంగా రాష్ట్రానికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంపై ఇటీవల భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని, తక్షణ సాయంగా రూ.వెయ్యికోట్లు విడుదల చేయాలని కోరారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని, కేంద్ర ప్రభుత్వమే ఈ పరిశ్రమను నడిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన 13 వైద్య కళాశాలలకు సాయం చేయాలని కోరారు. నియోజకవర్గంలో అభివృద్ధి నిమిత్తం సభ్యులకు ఎంపీలాడ్స్‌ నిధులు పెంచాలని మిథున్‌రెడ్డి కోరగా పలువురు సభ్యులు బల్లలు చరిచి మద్దతు తెలిపారు. విభజన హామీల అమలుకు గడువు రెండేళ్లే ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌ పట్ల కేంద్రం సానుభూతి చూపించాలని ఆయన కోరారు.

ఏపీ ఆర్థికంగా నష్టపోయింది
రాజ్యసభ జీరో అవర్‌లో ఎంపీ సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ.. విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా చాలా నష్టపోయిందని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top