పాదయాత్రను ఉత్తరాంధ్ర పొలిమేరల్లోనే అడ్డుకుంటాం | Sakshi
Sakshi News home page

పాదయాత్రను ఉత్తరాంధ్ర పొలిమేరల్లోనే అడ్డుకుంటాం

Published Fri, Oct 14 2022 4:57 AM

YSRCP MLC Duvvada Srinivas On Amaravati Farmers Padayatra - Sakshi

టెక్కలి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉన్నతాశయంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని, అమరావతి యాత్ర పేరుతో పెయిడ్‌ ఆర్టిస్టులు వస్తే.. ఉత్తరాంధ్ర పొలిమేరల్లోనే అడ్డుకుని వారిని తరిమికొడతామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ హెచ్చరించారు. ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గురువారం మీడియాతో మాట్లాడారు.

75 ఏళ్లుగా ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంతో ఉందని, ఇప్పటికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనవల్ల పరిపాలన రాజధాని రాబోతోందన్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రలు పన్ని అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి.. అందులో అమరావతి ఉండాలి అనేది తమ నినాదమని.. కానీ, చంద్రబాబు మాత్రం కేవలం తన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం.. తన వాళ్ల ప్రయోజనం కోసం  కేవలం అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలనే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఉత్తరాంధ్ర ప్రజల భిక్షతో దశాబ్దాలుగా రాజకీయంగా లబ్ధిపొందిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు ఈరోజు అమరావతి ప్రాంతంలో వారి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల కోసం.. పుట్టిన గడ్డకు తీరని ద్రోహం చేస్తున్నారని ఎమ్మెల్సీ మండిపడ్డారు. అమరావతిలో రాజధాని నినాదంతో ఉప ఎన్నికలకు సిద్ధం కావాలంటూ ఇప్పటికే అచ్చెన్నాయుడుకు 24 గంటలు సమయం ఇచ్చానని దువ్వాడ గుర్తుచేశారు.

అధికార వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి నినాదంతో టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడుపై పోటీకి తానింకా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అమరావతే రాజధాని కావాలంటే ఆ ఒక్క ప్రాంతానికే మద్దతిస్తే.. ఉత్తరాంధ్ర ద్రోహి అచ్చెన్నాయుడు అంటూ ప్రతి గ్రామంలో బ్యానర్లు కట్టి ప్రచారం చేస్తామని హెచ్చరించారు.

అధికార వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఈ నెల 15వ తేదీన విశాఖలో జరగనున్న ర్యాలీకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారని,  ఉత్తరాంధ్ర సత్తాను దేశం మొత్తం చాటుతామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement