‘బాబు అనుకూల మీడియానే జగన్‌ బలం చూసింది.. ఒప్పుకుంది’ | YSRCP Leaders Serious Comments On CBN Govt Over Tholi Adugu Program, More Details Inside | Sakshi
Sakshi News home page

‘బాబు అనుకూల మీడియానే జగన్‌ బలం చూసింది.. ఒప్పుకుంది’

Jul 2 2025 1:48 PM | Updated on Jul 2 2025 3:55 PM

YSRCP Leaders Serious Comments On CBN Govt

సాక్షి, గుంటూరు: వైఎ‍స్సార్‌సీపీ జెండా మోసిన వారికి, పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పకుండా ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. ఇదే సమయంలో చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాల్సిన బాధ్యత వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఉందన్నారు. పెన్షన్లు పెంచామని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. దీనిపై ప్రజలే సమాధానం చెబుతారు అని కామెంట్స్‌ చేశారు.

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, నియోజక వర్గాల ఇంఛార్జిలు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం, వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘ప్రజలను మరోమారు మభ్యపెట్టేందుకు చంద్రబాబు తొలి అడుగు కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకే బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ చేపడుతోంది.

వైఎస్‌ జగన్‌ చేసింది సుపరిపాలనో.. చంద్రబాబు చేసేది సుపరిపాలనా అనేది ప్రజలకు తెలియజేయాలి. కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా జగన్ చేసింది సుపరిపాలన. పెన్షన్లు పెంచామని చంద్రబాబు గొప్పలు చెబుతున్నాడు. ఎంతమంది పెన్షన్లు అందక ఇబ్బంది పడుతున్నారో మారుమూల గ్రామాలకు వెళితే తెలుస్తుంది. అదే వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉండి ఉంటే ఈ ఏడాది కాలంలో ఏం చేయగలిగేవారో ప్రజలకు మనం తెలియజేయాలి. వైఎస్‌ జగన్‌ చెప్పినట్లు మన కార్యకర్తలకు సెల్ ఫోనే ఆయుధం. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం. జెండా మోసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..‘ఎన్నికల్లో చంద్రబాబు, టీడీపీ నేతలు ఇంటింటికీ తిరిగారు. బాండ్లు చూపించి మరీ ఎంతెంత వస్తాయో చెప్పారు. చంద్రబాబు రీకాల్ కార్యక్రమంలో బాబు ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించడం మన బాధ్యత. నియోజకవర్గం, మండల స్థాయిలో చంద్రబాబు రీకాల్ కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా విజయవంతం చేయాలి. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ప్రజలు ఈ ప్రభుత్వంపై సంతృప్తిగా లేరు. ప్రభుత్వ వైఫల్యాన్ని మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.

మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ..‘పోరాటాలు మనకు, మన పార్టీకి కొత్త కాదు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి పోరాటం చేసిన పార్టీ వైఎస్సార్‌సీపీ. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో మరోసారి మనం పోరాటాలకు సిద్ధమవ్వాలి. ఆచరణ కాని అబద్ధాల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి.  వైఎస్‌ జగన్‌ను చూసి చంద్రబాబు మారాడని ప్రజలు భ్రమపడి ఓటేశారు. వైఎస్సార్‌సీపీ పోరాటం వల్లే ఈ ప్రభుత్వం తల్లికి వందనం ఇచ్చింది. వైఎస్‌ జగన్‌ సత్తెనపల్లి కార్యక్రమానికి ఎవరూ కార్లు పెట్టవద్దని పోలీసులు హెచ్చరించారు. కానీ, వేల మంది అభిమానులు స్వచ్ఛందంగా వైఎస్‌ జగన్‌ వెంట తరలివచ్చారు. చంద్రబాబు అనుకూల మీడియానే వైఎస్‌ జగన్‌ బలం గురించి నిజం ఒప్పుకుంటోంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా సోషల్‌ మీడియాను విస్తృతంగా వినియోగించాలి.

మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌కు, వైఎస్సార్‌సీపీకి అనుసంధానం కార్యకర్తలే. సచివాలయాలను నమ్ముకుని మనం మునిగిపోయాం. రెండు అబద్ధాలు చెప్పి అయినా సరే మనం అధికారంలోకి వద్దామని వైఎస్‌ జగన్‌ను కోరాం. కానీ, అబద్ధాలు వద్దని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేని వ్యక్తి చంద్రబాబు. ఈ ఐదేళ్లూ పనిచేసిన మన కార్యకర్తలను మర్చిపోకుండా పేర్లు రాసుకుందాం. మళ్లీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి న్యాయం చేస్తాం. చంద్రబాబు ష్యూరిటీ మోసం గ్యారంటీని మనం జనంలోకి తీసుకెళ్లాలి. జంప్ జిలానీలంతా టీడీపీలోకి పోయారు. మన దగ్గర దమ్ బిర్యానీ వంటి నాయకులు, కార్యకర్తలు మిగిలారు’ అని చెప్పుకొచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement