‘అసలు సమస్యలు పక్కనపెట్టి ‘కూటమి’ డైవర్షన్ డ్రామా’ | Ysrcp Leader Veerasekhar Reddy Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

‘అసలు సమస్యలు పక్కనపెట్టి ‘కూటమి’ డైవర్షన్ డ్రామా’

Jun 16 2026 10:30 PM | Updated on Jun 16 2026 10:30 PM

Ysrcp Leader Veerasekhar Reddy Fires On Chandrababu Government

సాక్షి, తాడేప‌ల్లి: రాష్ట్రంలో మహిళల భద్రత, చిన్నారుల అదృశ్య ఘటనలు, శాంతిభద్రతల సమస్యలు, పెరుగుతున్న అప్పులు, సంక్షేమ పథకాల అమలులో వైఫల్యాలు వంటి అసలు సమస్యలపై సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్‌రెడ్డి మండిప‌డ్డారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ కొత్త వివాదాలకు తెరలేపారని ఆక్షేపించారు.

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై చర్చ జరగకుండా దృష్టి మళ్లించడమే ఈ రాజకీయ రచ్చ వెనుక ఉద్దేశమని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న ప్రభుత్వ తీరును ఎండ‌గ‌ట్టారు. ప్రెస్‌మీట్‌లో వీర‌శేఖ‌ర్‌రెడ్డి ఏమ‌న్నారంటే..

అప్పుల్లో చంద్ర‌బాబు గిన్నిస్ రికార్డు
ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్ ప్రభుత్వంపై రాష్ట్రం రూ.12 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అప్పుల్లో ఉందంటూ కూటమి నేతలు దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలోనే రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేశారు. కేవలం జూన్ నెల తొలి 15 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు అప్పు చేసిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిది. మరోవైపు కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వైయస్ జగన్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లి, గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, మెడికల్ కాలేజీలు, పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయడంతో పాటు లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించింది.

ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సూడాన్, సోమాలియా వంటి నిరుపేద దేశాల కంటే దారుణంగా తయారైంది. ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తోంది. కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందడం లేదు. చేయూత, చేదోడు వంటి సంక్షేమ పథకాలు అటకెక్కాయి. రైతులకు మద్దతు ధర లేదు.. రైతు భరోసా లేదు.

రాష్ట్ర ఆదాయం ఆవిరి
వైఎస్‌ జగన్ పాలనలో రాష్ట్రంలో తలసరి ఆదాయం, జీఎస్‌డీపీ, జీఎస్‌టీఎన్ వసూళ్లు, పారిశ్రామిక వృద్ధి, వ్యవసాయ వృద్ధి, సేవారంగ వృద్ధి గణనీయంగా పెరిగాయి. కానీ నేడు ఆ ప్రగతి కనిపించడం లేదు. సంపద సృష్టిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, రాష్ట్ర సంపదనే ఆవిరి చేస్తున్నారు. క్వార్ట్జ్, మట్టి, ఇసుక, మద్యం, సిలికా, భూములు అన్నింటినీ టీడీపీ నేతలు దోచుకుంటున్నారు. వైఎస్‌ జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు దారి మళ్లిపోవడంతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది.

మద్యం ఏరులై పారుతున్నా రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం లేదు. అమరావతి పేరుతో అంచనాలు పెంచి దోపిడీ చేస్తున్నారు. కూటమి పాలనలోనే రాష్ట్రం దివాళా దిశగా వెళ్తోందని కాగ్ లెక్కలే చెబుతున్నాయి. సంక్షేమ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఈ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదన్న నిరంకుశ ధోరణితో పాలన సాగుతోంది.

గాడితప్పిన శాంతి భద్రతలు
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో హోంమంత్రి అనిత అసెంబ్లీలో ఇచ్చిన సమాధానమే చెబుతోంది. గంటకు ముగ్గురు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆమె స్వయంగా వెల్లడించారు. ముచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తల్లిదండ్రులు వారం రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. విజయవాడలో సాయికృష్ణ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. రాప్తాడులో మైనర్ బాలికపై అత్యాచారం, గుంటూరులో టీడీపీ నేతల ఆగడాలు, మహిళలపై వేధింపుల ఘటనలపై మౌనం పాటిస్తున్న ప్రభుత్వం.. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలను మాత్రం రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తోంది.

'మేకప్' వ్యాఖ్యలే పెద్ద సమస్యా?
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు, బడుగు బలహీన వర్గాల భద్రత కంటే హోంమంత్రిపై చేసిన 'మేకప్' వ్యాఖ్యలే పెద్ద సమస్యగా చూపించడం దురదృష్టకరం. టీడీపీ, జ‌న‌సేన‌ నేతలు గతంలో వైఎస్సార్‌సీపీ మహిళా నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మరిచి ఇప్పుడు నీతులు చెబుతున్నారు. అసలు సమస్యలపై సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. నా కూతురు ఎక్కడ? నా కొడుకు ఎక్కడ? అని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి రాజకీయ రచ్చ చేయడం మానుకోవాలి. ఈ కీచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో ప్రజలే తగిన తీర్పు ఇస్తారు అని వీరశేఖర్‌రెడ్డి హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement