breaking news
veera sekhar reddy
-
అరెస్ట్‌ను సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు: వీరశేఖర్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తే పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని, వారి భాషలోనే అంతకన్నా బలంగా సమాధానం ఇస్తామని.. తమ హుందాతనాన్ని చేతకానితనంగా భావించవద్దని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహనం నశించేలా తమను రెచ్చగొడితే చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు సంబంధించిన అంశాలపై కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.2014 నుంచి 2019 మధ్య కాలంలో ఫైబర్ నెట్, ఇసుక, మద్యం, అమరావతి భూములు, స్కిల్ డెవలప్మెంట్ వంటి అనేక స్కామ్‌లకు పాల్పడి, కోట్లు కొల్లగొట్టి, జైలుకు వెళ్లి మెడికల్ బెయిల్‌పై బయటికి వచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టస్ పేరుతో ఆ కేసులను కొట్టేయించుకున్న విధానంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మా సహనాన్ని తక్కువ అంచనా వేయొద్దు:వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేస్తే చూస్తూ ఊరుకోం. మా హుందాతనం చేతకానితనం అనుకోవద్దు. మీరు రాళ్లు వేస్తే మేము బండలు వేయగలం. మీరు పూలు పెడితే మేము పుష్పగుచ్ఛాలు ఇవ్వగలం. మీరు బూతులు తిడితే మేము కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము హుందాగా మాట్లాడుతున్నామంటే చేతకాక కాదు. మాపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాజకీయంగా విమర్శిస్తే రాజకీయంగానే సమాధానం ఇస్తాం. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి అనే దానిపై మాట్లాడాలి.కానీ చంద్రబాబు మాట్లాడటం మొదలుపెడితే బూతులు, అబద్ధ ప్రచారం, విషప్రచారం తప్ప మరేమీ కనిపించడం లేదు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ స్థాయికి దిగజారడం దురదృష్టకరం. మాజీ ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిపై వ్యక్తిగతంగా, నీచంగా మాట్లాడటం సరైంది కాదు. ముఖ్యమంత్రి అనే స్థాయిని చంద్రబాబు మర్చిపోకూడదు.2014 నుంచి 2019 మధ్య ఫైబర్‌నెట్, ఇసుక, మద్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, అమరావతి అసైన్డ్ భూములు, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన అనేక ఆరోపణలు వచ్చాయి. స్కిల్ కేసులో వందల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల ఆరోపణలతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే కోర్టు జైలుకు పంపింది. అలాంటిది కేసులు, అరెస్టులు, రిమాండ్లకు సంబంధించిన విషయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవడం ఏ విధమైన రాజకీయ సంస్కతి? తప్పు చేయకుండా ఒక సిద్ధాంతం కోసం పోరాడి జైలుకు వెళ్లినవాళ్లు గొప్పగా చెప్పుకుంటారు.కానీ తన అరెస్టును చంద్రబాబు సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు. స్కిల్ కేసులో అరెస్టు కాబటి జైల్లో ఉండొచ్చిన చంద్రబాబు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాడు? ఆయన మెడికల్ గ్రౌండ్స్‌పై బెయిల్ వచ్చాడే కానీ కేసుల్లో నిజాయితీ పరుడిగా నిర్ధారణ కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న కేసులను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ పేరుతో తొలగించేసుకుంటున్నాడు.ముఖ్యమంత్రి పదవి చేపట్టింది తనపై ఉన్న కేసులను తొలగించుకోవడానికా? లేక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికా? ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. కేసుల విషయంలో కోర్టులు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం, పోలీసులు తీసుకునే నిర్ణయాలపై కూడా ప్రజలకు వివరణ ఇవ్వాలి.లోకేశ్ బాగోతం బయట పెట్టమంటారా?వైఎస్ జగన్ చదువుల కోసం అమెరికా వెళ్లి హోమ్‌సిక్‌తో తిరిగి రావడం ఏమైనా పెద్ద తప్పా? చదువు కోసం అమెరికా వెళ్లి తల్లిదండ్రులను విడిచి ఉండలేక తిరిగి రావడాన్ని కూడా రాజకీయ విమర్శగా ఉపయోగించుకోవడం అన్యాయం. అప్పట్లో వైఎస్సార్.. చంద్రబాబు వ్యాఖ్యలకు ఇచ్చిన సమాధానం ప్రజలకు తెలుసు. వైఎస్ జగన్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతున్న చంద్రబాబు.. ముందుగా తన కుటుంబానికి సంబంధించిన ఆరోపణలపై సమాధానం చెప్పాలి. నారా లోకేష్‌కు సంబంధించి గతంలో వచ్చిన ఆరోపణలపై ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఇతరుల వ్యక్తిగత జీవితాలను ప్రశ్నించే ముందు తన కుటుంబంపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జనాలు అన్నీ మర్చిపోయారు, తాను ఏది చెప్పినా నమ్ముతారు అనుకోవద్దు.దస్తగిరి టీడీపీ ఆఫీస్‌కు ఎందుకు వెళ్లారు?వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరికి టీడీపీ కార్యాలయంలో ఏం పని? ఆయనకు న్యాయ సహాయం ఎవరు అందించారు? ఈ అంశాలపై రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. వీటికి సమాధానం చెప్పిన తర్వాత వైఎస్ జగన్ గురించి మాట్లాడాలి. మేము హుందాగా మాట్లాడుతున్నాం. అంతే తప్ప, అది తమ బలహీనత కాదన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలని వీరశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
‘అసలు సమస్యలు పక్కనపెట్టి ‘కూటమి’ డైవర్షన్ డ్రామా’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో మహిళల భద్రత, చిన్నారుల అదృశ్య ఘటనలు, శాంతిభద్రతల సమస్యలు, పెరుగుతున్న అప్పులు, సంక్షేమ పథకాల అమలులో వైఫల్యాలు వంటి అసలు సమస్యలపై సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ కొత్త వివాదాలకు తెరలేపారని ఆక్షేపించారు.రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై చర్చ జరగకుండా దృష్టి మళ్లించడమే ఈ రాజకీయ రచ్చ వెనుక ఉద్దేశమని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రెస్మీట్లో వీరశేఖర్‌రెడ్డి ఏమన్నారంటే..అప్పుల్లో చంద్రబాబు గిన్నిస్ రికార్డుఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ప్రభుత్వంపై రాష్ట్రం రూ.12 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అప్పుల్లో ఉందంటూ కూటమి నేతలు దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలోనే రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేశారు. కేవలం జూన్ నెల తొలి 15 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు అప్పు చేసిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిది. మరోవైపు కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వైయస్ జగన్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లి, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, మెడికల్ కాలేజీలు, పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయడంతో పాటు లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించింది.ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సూడాన్, సోమాలియా వంటి నిరుపేద దేశాల కంటే దారుణంగా తయారైంది. ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తోంది. కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందడం లేదు. చేయూత, చేదోడు వంటి సంక్షేమ పథకాలు అటకెక్కాయి. రైతులకు మద్దతు ధర లేదు.. రైతు భరోసా లేదు.రాష్ట్ర ఆదాయం ఆవిరివైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో తలసరి ఆదాయం, జీఎస్డీపీ, జీఎస్టీఎన్ వసూళ్లు, పారిశ్రామిక వృద్ధి, వ్యవసాయ వృద్ధి, సేవారంగ వృద్ధి గణనీయంగా పెరిగాయి. కానీ నేడు ఆ ప్రగతి కనిపించడం లేదు. సంపద సృష్టిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, రాష్ట్ర సంపదనే ఆవిరి చేస్తున్నారు. క్వార్ట్జ్, మట్టి, ఇసుక, మద్యం, సిలికా, భూములు అన్నింటినీ టీడీపీ నేతలు దోచుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు దారి మళ్లిపోవడంతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది.మద్యం ఏరులై పారుతున్నా రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం లేదు. అమరావతి పేరుతో అంచనాలు పెంచి దోపిడీ చేస్తున్నారు. కూటమి పాలనలోనే రాష్ట్రం దివాళా దిశగా వెళ్తోందని కాగ్ లెక్కలే చెబుతున్నాయి. సంక్షేమ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఈ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదన్న నిరంకుశ ధోరణితో పాలన సాగుతోంది.గాడితప్పిన శాంతి భద్రతలురాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో హోంమంత్రి అనిత అసెంబ్లీలో ఇచ్చిన సమాధానమే చెబుతోంది. గంటకు ముగ్గురు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆమె స్వయంగా వెల్లడించారు. ముచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తల్లిదండ్రులు వారం రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. విజయవాడలో సాయికృష్ణ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. రాప్తాడులో మైనర్ బాలికపై అత్యాచారం, గుంటూరులో టీడీపీ నేతల ఆగడాలు, మహిళలపై వేధింపుల ఘటనలపై మౌనం పాటిస్తున్న ప్రభుత్వం.. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను మాత్రం రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తోంది.'మేకప్' వ్యాఖ్యలే పెద్ద సమస్యా?రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు, బడుగు బలహీన వర్గాల భద్రత కంటే హోంమంత్రిపై చేసిన 'మేకప్' వ్యాఖ్యలే పెద్ద సమస్యగా చూపించడం దురదృష్టకరం. టీడీపీ, జనసేన నేతలు గతంలో వైఎస్సార్సీపీ మహిళా నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మరిచి ఇప్పుడు నీతులు చెబుతున్నారు. అసలు సమస్యలపై సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. నా కూతురు ఎక్కడ? నా కొడుకు ఎక్కడ? అని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి రాజకీయ రచ్చ చేయడం మానుకోవాలి. ఈ కీచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో ప్రజలే తగిన తీర్పు ఇస్తారు అని వీరశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. -
జిల్లాలో దొంగలు పడ్డారు
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణం మోడంపల్లె పరిధిలోని రాజేశ్వరి నగర్లో నివాసం ఉంటున్న వ్యాపారి కర్నాటి వీరశేఖర్‌రెడ్డి ఇంటిలో భారీ చోరీ జరిగింది. దొంగలు బంగారు, వెండి నగలతోపాటు నగదును అపహరించారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు ... వీరశేఖర్‌రెడ్డి తన సతీమణి శ్రీదేవి, పిల్లలు విశ్వనాథరెడ్డి, శివకుమార్‌రెడ్డి, జ్యోతిలతో కలిసి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీశైలంకు వెళ్లారు. ఇంటిలో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన దొంగలు అదే రోజు రాత్రి చోరీకి పాల్పడ్డారు. బీరువాలోని నెక్లస్‌లు, చైన్లు, బ్రాస్లైట్లు తదితర 25 తులాల బంగారు నగలు, వెండి ప్లేట్లు, చెంబు తదితర మూడున్నర కిలోల వెండి నగలను చోరీ చేశారు. వీటితోపాటు బీరువాలోనే ఉంచిన రూ.2.15లక్షల నగదును తీసుకెళ్లారు. సుమారు లక్ష రూపాయల విలువ గల మూడు పట్టు చీరెలను కూడా అపహరించారు. సోమవారం మధ్యాహ్న సమయంలో పక్కింటిలో నివశిస్తున్న మహిళ వీరశేఖరరెడ్డి ఇంటి తలుపులు తెరచిన విషయాన్ని గమనించింది. వెంటనే వీరశేఖర్‌రెడ్డికి ఫోన్ ద్వారా తెలిపింది. ఆయన తమ బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వారు ఇంటి వద్దకు వెళ్లి చోరీ జరిగినట్లు గుర్తించారు. సోమవారం సాయంత్రానికి ఇంటికి వచ్చిన వీరశేఖర్‌రెడ్డి టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం క్లూస్ టీం అధికారులతోపాటు టూటౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చి విచారించారు. సినీ హబ్ అధినేత బసిరెడ్డి రాజేశ్వరరెడ్డి, కౌన్సిలర్ నారాయణరెడ్డితోపాటు పలువురు వీరశేఖరరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారంలో రెండో సంఘటన ప్రొద్దుటూరులో వారంలో రెండో భారీ చోరీ సంఘటన వెలుగు చూడటం గమనార్హం. ఈనెల 23న వైఎంఆర్ కాలనీలోని డీఏడబ్ల్యూ కళాశాల కరస్పాండెంట్ దేవరశెట్టి నాగరాజు కుటుంబ సభ్యులతో బెంగుళూరుకు వెళ్లారు. ఆ సందర్భంగా ఇంటి తాళాలు పగులగొట్టి రూ.12.50 లక్షల విలువైన బంగారు, నగదును అపహరించుకెళ్లారు. 26వ తేదీన చోరీ సంఘటనను గుర్తించారు. ఇదే తరహాలో ప్రస్తుతం వీరశేఖర్‌రెడ్డి ఇంటికి తాళం వేసి శ్రీశైలంకు వెళ్లగా చోరీ జరగింది. దీనిని బట్టి తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఈసంఘటనలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.


