‘మద్యం, డీఎస్సీ, భూములు.. ఇలా ఏదీ వదలకుండా దోపిడీ’ | YSRCP Leader TJR Sudhakar Babu Takes On AP Govt | Sakshi
Sakshi News home page

‘మద్యం, డీఎస్సీ, భూములు.. ఇలా ఏదీ వదలకుండా దోపిడీ’

Jun 6 2026 6:17 PM | Updated on Jun 6 2026 7:48 PM

YSRCP Leader TJR Sudhakar Babu Takes On AP Govt

తాడేపల్లి :  ఏపీలో దోచుకో, దాచుకో అనే రీతిలో పాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత టీజేఆర్‌ సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. చంద్రబాబే ఎవరు ఎలా దోచుకోవాలో సలహాలు ఇస్తున్నారని విమర్శించారు. తమ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమాన్ని నేరుగా ప్రజలకు అందేలే డీబీటీ సిస్టం అమలు చేస్తే చంద్రబాబు మాత్రం డీపీటీ( దోచుకో.. పంచుకో-తినుకో) పద్థతి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. దోపిడీనీ కూడా నిఖార్సుగా చేయడంలో చంద్రబాబు నిష్ణాతుడని, కార్యకర్తల నుండి మీడియా సంస్థల వరకు దోచి పెడుతున్నారన్నారు. 

ఈరోజు(శనివారం, జూన్‌ 6వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుండి మాట్లాడిన టీజేఆర్‌..  చంద్రబాబుకు ఐదు ఎకరాల్లో కడుతున్న ఇంటి నిర్మాణం చేస్తున్నదెవరని ప్రశ్నించారు.  ‘ఆ సంస్థకు నక్కపల్లిలో ఇచ్చిన కాంట్రాక్టులు బయట పెట్టాలి. తెలంగాణలో హెరిటేజ్ ఐస్ క్రీం కంపెనీ నిర్మాణం చేస్తున్న కంపెనీ అమరావతిలో కాంట్రాక్టు సంస్థే. ఈనాడు ఎండీ కిరణ్ వియ్యంకుడుకి పోలవరం కాలువల నిర్మాణం కాంట్రాక్టు ఇచ్చారు. ఎల్లోమీడియా అంతా దొంగల ముఠాగా ఏర్పడి దోచుకుంటున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ ఇబ్రహీంపట్నం దగ్గర హైడెల్ ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్నారు. టీవీఫైవ్ యజమానికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. రాష్ట్రంలో అంతులేని అవినీతి, దోపిడీ జరుగుతోంది. 

అమరావతిలో అడుగుకు రూ.20 వేలకు పైనే ఖర్చు చేయటం అవినీతికి పరాకాష్ట. అమరావతికి కనెక్టివిటీ రోడ్లే వేయలేకపోయిన చంద్రబాబు లక్షల కోట్లతో అమరావతి నిర్మిస్తారట. ఆల్రెడీ ఉన్న అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టులను కాదని మళ్ళీ వేల కోట్లతో కొత్తవి నిర్మించటం ఎందుకు?, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు తీవ్ర అన్యాయం చేసి, పెద్దలు మాత్రం భూదోపిడీ చేస్తున్నారు. తెలంగాణ సెక్రటేరియట్ అడుగుకు రూ.6 వేలు మాత్రమే. కానీ చంద్రబాబు మాత్రం రూ.20 వేలు ఎలా ఖర్చు చేస్తారు?, ఈ ఖర్చులు చూసి దేశ ఆర్ధిక నిపుణులే విస్తుపోతున్నారు. రోడ్లు, ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం చేసే ఖర్చు చూస్తే కల్లు తిరగాల్సిందే. మద్యం, డీఎస్సీ, భూములు, ప్రాజెక్టులు.. ఏదీ వదలకుండా దోపిడీ చేస్తున్నారు’ అని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement