
విజయవాడ: ఏపీలో జరుగుతున్నది సుపరిపాలన కాదని, అరాచక పాలన అని ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు. ఈరోజు(శనివారం, జూలై 19) విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లాది విష్ణుతో పాటు వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ వైలజారెడ్డి తదితరులు పాల్లొన్నారు.
దీనిలో భాగంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘టిడిపి కక్షపూరిత పాలన చేస్తోంది. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు. మద్యం కుంభకోణం కేసును తెరపైకి తీసుకువచ్చి అనేక మందిని అరెస్టు చేయాలని చూస్తున్నారు. అరెస్టులకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయపడేది లేదు. వైఎస్ జగన్ ఆదేశాల మేరక టీడీపీ కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళతాం.
సుపరిపాలన పేరుతో ప్రజల ముందుకు వెళ్లిన టీడీపీ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మాట తప్పింది. ఇదేనా సుపరిపాలనా అంటే?, ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సన్నద్ధం కావాలి. వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలన త్వరలోనే రానుంది’ అని మల్లాది విష్ణు స్పష్టం చేశారు.