‘ఫ్యాన్‌’ హ్యాట్రిక్‌

YSR Congress Party Grand Hat Trick Victory In Badvel Bypoll - Sakshi

బద్వేల్‌లో మూడోసారి వైఎస్సార్‌సీపీ విజయభేరి

1955 నుంచి ఇప్పటివరకూ ఇదే భారీ మెజార్టీ

సాక్షి, అమరావతి: బద్వేలు అసెంబ్లీ ఎన్నికల్లో మూడుసార్లు విజయభేరి మోగించడం ద్వారా వైఎస్సార్‌సీపీ హ్యాట్రిక్‌ సాధించింది. తాజా ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధ 90,533 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. బద్వేల్‌ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ బద్వేల్‌ శాసనసభ స్థానానికి నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే నెగ్గారు. టీడీపీ నేరుగా పోటీ చేసినా.. బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగినా.. లోపాయికారీగా జట్టు కట్టినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. 

ప్రతి ఎన్నికల్లోనూ ఫ్యాన్‌ ప్రభంజనం..
బద్వేల్‌ శాసనసభ స్థానానికి తొలిసారిగా 1955లో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటివరకూ 17 సార్లు ఎన్నికలు (రెండు సార్లు ఉప ఎన్నికలు) నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం తర్వాత బద్వేల్‌ స్థానానికి 2014లో నిర్వహించిన ఎన్నికల్లో 50.66 శాతం ఓట్లను సాధించిన పార్టీ అభ్యర్థి జయరాములు 9,502 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి ఎన్‌డీ విజయజ్యోతిపై విజయం సాధించారు. 2019లో ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దివంగత డాక్టర్‌ వెంకట సుబ్బయ్య 60.89 శాతం ఓట్లు సాధించి టీడీపీ అభ్యర్థి ఓబుళాపురం రాజశేఖర్‌పై 44,734 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. తాజాగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధ భారీ ఆధిక్యతంతో విజయబావుటా ఎగురవేశారు. ప్రతి ఎన్నికలోనూ ఇక్కడ వైఎస్సార్‌ సీపీ బలం పెంచుకుని ఆధిక్యతను చాటుతోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top