కవిత, షర్మిల ట్వీట్ల యుద్ధం

YS Sharmila and Kalvakuntla Kavitha tweets war in Twitter - Sakshi

తాము వదిలిన బాణానికి ‘తామర పువ్వులు’ తందానా: కవిత

పదవులే కాని పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవలేదు: షర్మిల

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. ట్విట్టర్‌ వేదికగా పరస్పర విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. షర్మిల అరెస్టును బీజేపీ నేతలు ఖండించడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘తాము వదిలిన బాణం తానా అంటే తందానా అంటున్న ‘తామరపువ్వులు’’అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ చేశారు. దీనికి వైఎస్‌ షర్మిల సైతం కవితాత్మకంగా స్పందించారు. ‘పాదయాత్రలు చేసింది లేదు.

ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కాని పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవలేదు’అని తిరుగు సమాధానం ఇచ్చారు. ‘అమ్మా.. కమల బాణం, ఇది మా తెలంగాణం, పాలేవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజాగణం. మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు, నేడు తెలంగాణ రూటు, మీరు కమలం కోవర్టు, ఆరెంజ్‌ ప్యారెట్టు. మీలాగా పొలిటికల్‌ టూరిస్ట్‌ కాను నేను, రాజ్యం వచ్చాకే రాలేదు నేను, ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి ’కవిత’ను’అంటూ ఎమ్మెల్సీ కవిత మరో ట్వీట్‌ చేశారు.

నేడు రాజ్‌భవన్‌కు వైఎస్‌ షర్మిల 
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. గురువారం ఉదయం 11.30 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను కలవనున్నారు. 2 రోజులుగా టీఆర్‌ఎస్‌ వర్గాల దాడుల నేపథ్యంలో షర్మిల రాజ్‌భవన్‌కు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకోనుంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top