‘కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి’ | Ys Avinash Reddy Demands Opposition Status For Ysrcp | Sakshi
Sakshi News home page

‘కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి’

Feb 24 2025 3:09 PM | Updated on Feb 25 2025 1:20 PM

Ys Avinash Reddy Demands Opposition Status For Ysrcp

సాక్షి,వైఎస్సార్‌జిల్లా: వైఎస్సార్‌సీసీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తమ బాగోతం బయటపడుతుందనే భయం అధికార పక్షానికి పట్టుకుంది. అందుకే తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి అన్నారు. దమ్ముంటే వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

సోమవారం (ఫిబ్రవరి24) ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం తర్వాత సభలో ఉంది తామేనని, కాబట్టి ప్రజాగళం వినిపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.  

ఇదే అంశంపై ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ప్రతిపక్షం ఉండేది కేవలం వైఎస్సార్సీపీనే. 11 సీట్లంటున్నారు. కానీ.. 40 శాతం ఓట్లు వచ్చాయనేది మర్చిపోతున్నారా?. నలుగురు ఎంపీలున్నారు..11 మంది ఎమ్మెల్యేలున్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ముంటే ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇతర ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లు వైఎస్సార్‌సీపీ అధినేత, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రెండు నిమిషాలు మాత్రమే  మైక్‌ ఇస్తామంటే ఎలా?  

అదే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ముఖ్యమంత్రి గంట మాట్లాడితే 40 నిమిషాలు ప్రధాన ప్రతిపక్షనేత మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రజల గొంతుక అసెంబ్లీలో వినిపించే అవకాశం ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వకపోతే ప్రజల సమస్యలను వినిపించే అవకాశమే ఉండదు. వైఎస్‌ జగన్‌ను అవమానిస్తున్నామని స్పీకర్, చంద్రబాబు అనుకుంటున్నారు కానీ..ప్రజలను అవమానిస్తున్నారనేది మర్చిపోతున్నారు.

ప్రధాన ప్రతిపక్షాన్ని గుర్తించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతోనే మేం అసెంబ్లీకి వెళ్లాం. ప్రధాన ప్రతిపక్షనేతగా జగన్‌  వెళ్తే వీళ్లకి ఏ రకమైన సినిమా కనిపిస్తుందో వాళ్లకు తెలుసు. వాళ్లిచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు.ఇదే అంశంపై వైఎస్‌ జగన్‌ మాట్లాడటం మొదలు పెడితే వాళ్లు సమాధానం చెప్పలేరు. దాని నుంచి తప్పించుకోవడం కోసమే ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వకుండా ఇలా వ్యవహరిస్తున్నారు.

నిజంగా పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందనే ముచ్చట పడితే కూటమి గాలిలో 65 వేల ఓట్లతో బీటెక్‌ రవి ఓడిపోయాడు.వాళ్లకు అంత ముచ్చటగా ఉంటే..పులివెందుల, కుప్పం, మంగళగిరి, పిఠాపురం నాలుగు చోట్లా రాజీనామాలు చేయండి. ఎన్నికలకు వెళ్దాం.ఈ తొమ్మిది నెలల పాలనకు రిఫరెండంగా, సూపర్‌ సిక్స్‌ పాలనకు రిఫరెండంగా ఎన్నికలకు వెళ్లి చూసుకుందాం. ప్రజలేం తీర్పు ఇస్తారో చూద్దాం..కాకమ్మ కబుర్లు, దద్దమ్మ మాటలు మాట్లాడొద్దు’ అని కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలతో విరుచుకు పడ్డారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement