ఒవైసీ మూడో ఫ్రంట్‌.. పశ్చిమ బెంగాల్‌లో ముక్కోణపు పోరు! | Will the Muslim Vote Split Change the Game In West Bengal | Sakshi
Sakshi News home page

ఒవైసీ మూడో ఫ్రంట్‌.. పశ్చిమ బెంగాల్‌లో ముక్కోణపు పోరు!

Mar 24 2026 8:06 PM | Updated on Mar 24 2026 8:31 PM

Will the Muslim Vote Split Change the Game In West Bengal

ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్.. క్లుప్తంగా మజ్లిస్ పార్టీ..! హైదరాబాద్‌లో పత్తర్‌గట్టీ మునిసిపల్ డివిజన్ నుంచి ప్రస్తానం ప్రారంభించిన మజ్లిస్ పార్టీ.. ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా భారత్ వ్యాప్తంగా విస్తరిస్తోంది. జాతీయ పార్టీగా ఎదిగిన మజ్లిస్ ఇప్పుడు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కొంగొత్త ఎత్తులతో ముందుకు సాగుతోంది. తాజాగా మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మూడో ఫ్రంట్‌ను ప్రకటించడంతో.. ఇప్పుడు బెంగాల్‌లో ముక్కోణపు పోరు మొదలైంది.

ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోరు అంటే.. అయితే టీఎంసీ—లేదంటే బీజేపీ అన్నట్లుగా సాగింది. అయితే.. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన హుమయూన్ వేరు కుంపటి పెట్టారు. ఆమ్ జనతా ఉన్నయాన్ పార్టీ పేరుతో ఎన్నికలకు వెళ్తున్నారు. ఇప్పుడు మజ్లిస్ చీఫ్ అసదుద్దీ ఒవైసీ అతనితో కలిసి ఎన్నికల్లో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల బీజేపీకి.. కాషాయపార్టీ సాంప్రదాయ ఓటుబ్యాంకుకు ఎలాంటి నష్టం లేకపోయినా.. టీఎంసీ ఓట్లలో మాత్రం చీలికకు కారణమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ చీఫ్ మమతాబెనర్జీ ఈసారి కూడా తన విజయంపై ధీమాగా ఉన్నప్పటికీ, మజ్లిస్ కారణంగా తెరపైకి వచ్చిన మూడో కూటమి కారణంగా చమటోడ్చక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు జరగడం కూడా తృణమూల్‌కు ప్రతికూలాంశంగా మారుతోంది.

ఈ నేపథ్యంలో ముస్లిం ఓటు బ్యాంకును మజ్లిస్ కచ్చితంగా చీలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మమతకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే హుమయూన్ ప్రకటించగా.. తమ కూటమి 294 స్థానాల్లో కలిసి పోటీ చేస్తుందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి ఒక ముస్లిం ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ కూటమి అహరహం పనిచేస్తోంది. మూడో కూటమి అధికారంలోకి వస్తుందా? బెంగాల్‌లో పాగా వేయాలనే కాషాయం కల నెరవేరుతుందా? మమత ఎత్తుల ముందు విపక్షాల వ్యూహాలన్నీ చిత్తవుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. మే 4న వచ్చే ఫలితాల వరకు వేచిచూడాల్సిందే..!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement