ఒకేసారి రెండు పాత్రలు పోషించడం సాంకేతికంగా ఎలా సాధ్యం? | Who Will Be In Cabinet Of TDP Janasena BJP coalition Govt | Sakshi
Sakshi News home page

ఒకేసారి రెండు పాత్రలు పోషించడం సాంకేతికంగా ఎలా సాధ్యం?

Jun 6 2024 3:56 AM | Updated on Jun 6 2024 11:52 AM

Who Will Be In Cabinet Of TDP Janasena BJP coalition Govt

మంత్రుల రేసులో.. కూటమి మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు?

ఆశావహుల జాబితాపై చంద్రబాబు ప్రాథమిక కసరత్తు

పవన్‌ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవిపై అస్పష్టత

విపక్షంగా సభలో అడుగు పెట్టి ప్రభుత్వంలో చేరతామంటున్న జనసేన అధ్యక్షుడు

ఒకేసారి రెండు పాత్రలు పోషించడం సాంకేతికంగా ఎలా సాధ్యం?

సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే అంశంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కూటమి నుంచి 164 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో మంత్రి పదవులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పటికే కొందరికి మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇవ్వడం, చాలామంది సీనియర్లు గెలుపొందడం, బీజేపీ, జనసేనకు అవకాశం ఇవ్వాల్సినందున మంత్రివర్గ కూర్పు కత్తిమీద సాములా మారనుంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని ఎన్నికలకు ముందు నుంచే ప్రచారం సాగుతుండగా బుధవారం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించడం గమనార్హం. 

మరోవైపు ప్రభుత్వంలోనూ భాగస్వా­ములుగా ఉంటామని చెప్పుకొచ్చారు. అయితే ఈ రెండు ఎలా సాధ్యమనే ప్రశ్నలు ఉత్పన్నమవు­తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలని నిర్ణయించుకుంటే మంత్రివర్గంలో జనసేన చేరడం కుదరదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ పవన్‌ కళ్యాణ్‌ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటూ తన పార్టీకి చెందిన వారికి మంత్రి పదవులు ఇప్పించాలనుకున్నా సాంకేతికంగా అది సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. దీంతో ఎలా ముందుకు వెళతారనే అంశం ఆసక్తికరంగా మారింది. 

జనసేన మంత్రివర్గంలో చేరితే నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాస్‌కు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలనే విషయంపై వెనక్కి తగ్గితే పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునే అవకాశం ఉంది. ఇక బీజేపీ నుంచి అసెంబ్లీకి గెలిచిన వారిలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ పేర్లు వినిపిస్తున్నాయి. సత్యకుమార్, విష్ణుకుమార్‌రాజుకు కూడా అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు.

పాతవారికే పెద్దపీట
టీడీపీలో మంత్రి పదవుల ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. 135 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి గెలుపొందడంతో ఎవరికి అవకాశం దక్కుతుందోననే చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణలు, సీనియారిటీ ప్రాతిపదికన పలువురు నేతలు తమకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని గట్టిగా నమ్ముతున్నారు. చంద్రబాబు ఇప్పటికే దీనిపై ప్రాథమికంగా కొంత కసరత్తు చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నారా లోకేష్, పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకు కచ్చితంగా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement