బెంగాల్‌ దంగల్‌: దీదీకి మొదలైన తలనొప్పి 

West Bengal Election 2021: Mamata Banerjee Eye on Small Parties - Sakshi

పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో చిన్న రాజకీయ పార్టీల ప్రభావంపై మమతా బెనర్జీ దృష్టి

ముస్లింల ఏకీకరణపై ఒవైసీ– సిద్ధిఖీ దృష్టి 

గిరిజనుల ఏకీకరణపై జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌

వామపక్షాలతో కలిసి కాంగ్రెస్‌ పోటీ

సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకోసం మిషన్‌ బెంగాల్‌లో భాగంగా రాజకీయ పార్టీలు ఎత్తులు పైఎత్తులతో ప్రణాళికలు రచించడంలో నిమగ్నమయ్యాయి. త్వరలో జరిగే పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పోటీ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు బీజేపీకి మధ్యే ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను సమీకరించేందుకు పలు ప్రాంతీయ పార్టీలు దృష్టిపెట్టడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో జెండా ఎగురవేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ బెంగాల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించి దుమారానికి తెరలేపారు. ఒవైసీ రంగప్రవేశంతో రాష్ట్రంలో ఉన్న 30 శాతం మంది ముస్లింల ఏకీకరణ జరుగుతుందని దీదీకి కలవరం మొదలైంది. ఇప్పడా కలవరం మరింత పెరుగుతోంది. బంగ్లాదేశ్‌ ముస్లింల ప్రభావంతో, ఫుర్‌ఫురా షరీఫ్‌ దర్గాకు చెందిన ఫిర్జాదా అబ్బాస్‌ సిద్దిఖీ ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ అనే పార్టీని ఏర్పాటు చేసి తాను బరిలో ఉన్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒవైసీ–సిద్దిఖీల మధ్య ముస్లింల ఏకీకరణ అనే అంశంలో ఎవరు పైచేయి సాధిస్తారు? ఎవరు ప్రయోజనం పొందుతారు? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే వీరిద్దరి మధ్య పోటీ దీదీకి కలిసొస్తుందని తృణమూల్‌ నాయకులు ఆశిస్తున్నారు.  

బెంగాల్‌ ఎన్నికల్లో ప్రధాన పోటీ తృణమూల్, బీజేపీ మధ్య ఉన్నప్పటికీ కాంగ్రెస్‌– వామపక్షాలు కలిసి పోటీ చేస్తుండడంతో పోటీ ఇప్పుడు త్రిముఖపోటీగా ఉండనుంది. బెంగాల్‌లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకునేందుకు ఇతర రాష్ట్రాల్లోని మరికొన్ని పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు ఓట్ల సమీకరణపై దృష్టిపెట్టాయి. అయితే ఈ ప్రాంతీయ పార్టీలు ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తాయనే విషయంపై స్పష్టత కరువైంది. హిందుత్వ ఎజెండాతో బరిలో దిగే బీజేపీ దూకుడుకు కళ్లెంవేసేందుకు శివసేన వ్యూహరచన చేస్తోంది.  

బెంగాల్‌ ఎన్నికల్లో జార్ఖండ్‌ రాజకీయ పార్టీలు తమ ప్రాధాన్యతను పెంచుకునే పనిలోఉన్నాయి. ఇప్పటికే జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ఝాడ్‌గ్రామ్‌ జిల్లాలో జరిగిన మొదటి ఎన్నికల సమావేశంలో తమ పార్టీ 40 స్థానాల్లో బరిలో దిగనుందని ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. జార్ఖండ్‌లో బీజేపీ మిత్రపక్షమైన ఏజేఎస్‌యూ నాయకులు బెంగాల్‌ సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ), జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ), లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ), హిందూస్తానీ లెఫ్ట్‌ ఫ్రంట్‌ (హమ్‌), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)తో సహా శివసేన వంటి పార్టీలు బెంగాల్‌ బరిలో తమ వ్యూహాలు రచిస్తున్నాయి. హేమంత్‌ సోరెన్‌కు మమతా బెనర్జీతో మంచి సంబంధాలే ఉన్నప్పటికీ, బెంగాల్‌ ఎన్నికల్లో జేఎంఎం బరిలో దిగుతుందన్న సోరెన్‌ ప్రకటనను దీదీ జీర్ణించుకోలేకపోతున్నారు. హేమంత్‌ బెంగాల్‌ వచ్చి రాజకీయాలు చేస్తున్నాడని మమత వ్యాఖ్యానించారు. 

2016 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 54 పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దింపాయి. బీఎస్పీ 161, ఎస్పీ 23 మంది, శివసేన 21 మంది అభ్యర్థులను నిలబెట్టింది. జేఎంఎం, ఏజేఎస్‌యూ, ఎల్‌జేపీ, ఎన్‌సీపీ, ఆర్‌జేడీ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ ఫలితంలేకుండా పోయింది. పదేళ్లు అధికారంలో ఉన్న కారణంగా ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.  

రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాల్లో 193 సీట్లలో పోటీకి సంబంధించి కాంగ్రెస్, వామపక్షాలు ఒప్పందం పూర్తయింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయని తృణమూల్‌ నాయకులు భావిస్తున్నారు. త్రిముఖ పోటీలో చిన్న పార్టీల పాత్ర కీలకంగా మారబోతోంది. ఒవైసీ– సిద్దిఖీలు ముస్లిం ఓటు బ్యాంకుపై దృష్టిసారించగా, జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం), ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌(ఏజేఎస్‌యూ) గిరిజనులు ఎక్కువగా ఉన్న పురూలియా, ఝాడ్‌గ్రామ్, పశ్చిమ మేదినీపూర్, బంకురా, తూర్పు మరియు పశ్చిమ బర్ధమాన్, వీర్‌భూం వంటి జిల్లాలపై దృష్టిసారిస్తున్నారు. ఈ జిల్లాల్లోని గిరిజన ఓట్లు చాలా సీట్ల విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

చదవండి:
అద్దంలో చూస్కోండి: బీజేపీ నేతలకు మమత సలహా

కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ సీఎం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top