బీజేపీలో చేరిన కాంగ్రెస్ దిగ్గజ నేత కుమారుడు.. తప్పుడు నిర్ణయమని తండ్రి ఆవేదన

బీజేపీలో చేరిన కాంగ్రెస్ దిగ్గజ నేత కుమారుడు.. తండ్రి హర్ట్..! - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని బీజేపీలో చేరారు. తండ్రి సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధమైన కమలం గూటికి వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీలోని అన్ని హోదాలకు రాజీనామా చేసి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరిక కార్యక్రమం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, వీ మురళీధరన్, కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్‌.. అనిల్‌ ఆంటల్‌ని పార్టీలోకి ఆహ్వానించారు. పుష్పగుచ్చం ఇచ్చి, పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.

అనిల్‌ ఆంటోని కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్‌ను నిర్వహించేవారు. అయితే కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ విడుదల చేసిన అనంతరం.. బీజేపీకి మద్దతుగా ఆయన ట్వీట్ చేయడం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి ఈ డాక్యుమెంటరీని అతను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కాంగ్రెస్‌ను వీడటం గమనార్హం.

బీజేపీలో చేరిన అనంతరం కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు అనిల్ ఆంటోని. దేశంలోని కాంగ్రెస్ నాయకులంతా కేవలం ఒక్క కుటుంబం కోసమే పని చేస్తున్నారని ధ్వజమెత్తారు.  తాను కలిసి పనిచేసిన నాయకులపైనా తీవ్ర విమర్శలు చేశారు.

తండ్రి రియాక్షన్..
మరోవైపు కుమారుడు బీజేపీలో చేరడం తనను తీవ్రంగా బాధించిందని ఏకే ఆంటోని ఆవేదన వ్యక్తం చేశారు. అతను పూర్తిగా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని పేర్కొన్నారు.  కొడుకులా తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. లౌకికవాదమే భారతదేశ ఐక్యత అని, కానీ 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని మండిపడ్డారు.  దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
చదవండి: నాది కాంగ్రెస్‌ రక్తం.. కోమటిరెడ్డి సంచలన కామెంట్స్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top