ఐదేళ్ల క్రితం యూపీలో రౌడీ రాజ్యం!

Uttar Pradesh Assembly elections 2022: PM Modi launches scathing attack on SP - Sakshi

ఎస్‌పీపై ప్రధాని మోదీ విమర్శలు

లక్నో: ఐదేళ్ల కిందట ఉత్తరప్రదేశ్‌ను మాఫియా, అల్లరి మూకలు పాలించేవని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో బాఘ్‌పత్, షమ్లీ, గౌతమ్‌ బుద్ధనగర్, ముజఫర్‌నగర్, శరణ్‌పూర్‌ జిల్లాల్లోని 21 అసెంబ్లీ స్థానాల ర్యాలీల నుద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో వ్యాపారులు దోపిడీకి గురయ్యారని, ఆడపిల్లలు ఇళ్లు దాటే పరిస్థితి లేకపోయిందన్నారు.

ప్రభుత్వ అండదండలతో మాఫియా స్వేచ్ఛగా తిరిగేదని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌పై ప్రధాని మాటల దాడి చేశారు. మూఢ నమ్మకాలతో అఖిలేశ్‌ యువత కలల ప్రపంచమైన నోయిడాకు రాలేదని, అలాంటి మూఢ నమ్మకాలున్న వ్యక్తి యువతకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తారని ప్రశ్నించారు. మన దేశం తయారు చేసిన కోవిడ్‌ వ్యాక్సిన్‌పై భరోసా ఉంచని వారు, పుకార్లకు ప్రాధాన్యమిచ్చినవారు ఉత్తరప్రదేశ్‌యువత ప్రతిభను, ఆవిష్కరణలను ఎలా గౌరవిస్తారని ప్రధాని సందేహం వ్యక్తం చేశారు.

బీజేపీ యూపీ మార్పును కోరుకుంటుందని, కానీ ప్రత్యర్థులు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారని, వాళ్లు టికెట్‌ ఇచ్చిన వారిని చూస్తే అది అర్థమవుతుందని అన్నారు. ప్రతీకారమే వారి సిద్ధాంతమని, అలాంటి వారి పట్ల యూపీ ప్రజలు అప్రమత్తంగా ఉండటం తనకు ఆనందం కలిగిస్తోందని మోదీ తెలిపారు. కృష్ణుడు తన కలలోకి వస్తాడన్న అఖిలేశ్‌ మాటలనుద్దేశించి ప్రస్తావిస్తూ... ఆయన నిద్రపోయి కలలు కంటూనే ఉంటారని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాత్రం యూపీ అభివృద్ధికోసం నిరంతరం పనిచేస్తారని అన్నారు.  

బీజేపీలోకి నిదా ఖాన్, గంగారామ్‌ అంబేడ్కర్‌
మహిళా హక్కుల ఉద్యమకారిణి నిదా ఖాన్, బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఓఎస్డీగా పనిచేసిన గంగారామ్‌ అంబేడ్కర్‌  భారతీయ జనతాపార్టీలో చేరారు. చేరికల కమిటీ నాయకుడు లక్ష్మీకాంత్‌ బాజ్‌పేయ్‌ ఆధ్వర్యంలో సోమవారం వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బాజ్‌పేయ్‌ మాట్లాడుతూ... ఇక అల్లరి మూకల రాజ్యం చెల్లదని, ప్రజలంతా నిర్భయంగా జీవించే యోగి ఆదిత్యనాథ్‌ పరిపాలన నడుస్తోందని అన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top