Congress-Twitter: కాంగ్రెస్‌ నేతలకు ట్విటర్‌ షాక్‌!

Twitter blocks official handle of 5 Congress Leaders - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం కాంగ్రెస్‌ పార్టీకి ట్విటర్‌ షాక్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ట్విటర్‌ ఖాతాను ఇప్పటికే లాక్‌ చేసిన ట్విటర్‌ తాజాగా మరో ఐదుగురు కాంగ్రెస్‌  సీనియర్‌ నేతల అకౌంట్లను తాత్కాలికంగా బ్లాక్‌ చేయడం దుమారం రేపింది. దీంతోపాటు కాంగ్రెస్ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌ను కూడా బ్లాక్‌ చేసింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ నేతలు మండి పడుతున్నారు. 

పార్టీ మీడియా హెడ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, లోక్ సభలో పార్టీ విప్ మాణిక్యం ఠాగూర్, మాజీ మంత్రి జితేంద్ర సింగ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్  ట్విటర్‌ అకౌంట్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ విషయాన్ని పార్టీ నేత ప్రణవ్‌ ఝా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ట్విటర్ చీఫ్ జాక్ డోర్సేపై విమర్శలు గుప్పించారు. 

తమ సీనియర్‌ నేతలతోపాటు దాదాపు 5 వేలమంది ఇతర నాయకులు, కార్యకర్తల ఖాతాలు బ్లాక్‌ అయ్యాయని ఆరోపించిన కాంగ్రెస్‌ మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తింది. మోదీజీ ఇంకెంత భయపడతారంటూ ఎద్దేవా చేసింది. దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్‌ పోరాడింది, ప్రజల ఆకాంక్షను కేవలం సత్యం, అహింస తోనే సాధించిందనీ, అప్పుడూ గెలిచాం, మళ్లీ గెలిచి తీరుతాం అంటూ కాంగ్రెస్‌ తన ఇన్‌స్టా పేజీ పోస్ట్‌లో  పేర్కొంది. ప్రజలకోసం పనిచేస్తున్న తమను ఇలాంటి చర్యలు ఏమాత్రం అడ్డుకోలేవంటూ ట్విటర్‌ ఇండియాకు సవాల్‌ విసిరింది. 

కాగా ఢిల్లీలో ఇటీవల తొమ్మిదేళ్ల బాలిక హత్యాచార ఘటన నేపథ్యంలో రాహుల్  బాధిత బాలిక, తలిదండ్రుల ఫోటోలను షేర్‌ చేసిననేపథ్యంలో ఆయన అధికారిక ట్విటర్‌ ఖాతాను బ్లాక్‌ చేసింది. మరోవైపు బాధితుల ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంపై సీరియస్‌గా స్పందించిన జాతీయ బాలల హక్కుల సంఘం రాహుల్‌పై  చర్య తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top