ఘాటెక్కి.. చప్పబడ్డ విష్ణు విందు

Twist And Turns Around Former MLA Vishnuvardhan Reddy - Sakshi

సోదరి విజయారెడ్డి చేరికపై అసంతృప్తి 

అలాంటిదేమీలేదని మీడియాకు స్పష్టీకరణ

హాజరైన మధుయాష్కీ, శ్రీధర్‌బాబు, వీహెచ్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: మాజీ సీఎల్పీ నేత పి.జనార్దన్‌రెడ్డి తనయుడు, జూబ్లీహిల్స్‌ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి అకస్మాత్తుగా సీనియర్‌ నాయకులను మంగళవారం తన ఇంటికి లంచ్‌కు పిలవడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. పదిరోజుల క్రితం విష్ణు సోదరి విజయారెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అప్పటి నుంచి విష్ణువర్ధన్‌రెడ్డి రాష్ట్ర పార్టీ పెద్దలపై ఆసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోని హైదరాబాద్‌లోని సీనియర్‌ నేతలతోపాటు ఇతర ముఖ్యులను కూడా భోజనానికి ఆహ్వానించారు.

పనిలో పనిగా తన అసంతృప్తిని సీనియర్లతో పంచుకోవాలని భావించినట్లుగా ప్రచారం జరిగింది. అయితే పిలిచిన నేతలంతా లంచ్‌కు వెళ్తారా లేదా అని ఆసక్తిరేపుతున్న సమయంలో  విష్ణు మీడియాతో మాట్లాడుతూ సాధారణంగానే ప్రతీ ఏటా సీనియర్‌ నేతలను భోజనానికి ఆహ్వానిస్తుంటానని, పార్టీలో ఎవరు చేరినా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కూడా రావాలని కోరారని, అయితే వారిద్దరు ఢిల్లీలో ఉండటంతో రాలేమని చెప్పారని విష్ణు పేర్కొన్నారు. అదే సమయంలో ఢిల్లీలో రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ విష్ణు తనను భోజనానికి రావాలని కోరారని చెప్పారు. హైదరాబాద్‌లో తన అభిమానులు, కార్యకర్తలతో సభ పెట్టుకుంటానని అడిగారని, అందుకు తాను అనుమతిచ్చినట్టు వెల్లడించారు. 

ప్రకటన తర్వాత దిగిన నేతలు...
అటు రేవంత్‌రెడ్డి, ఇటు విష్ణువర్ధన్‌ ప్రకటనలతో సీనియర్‌ నేతలంతా ఆయన గృహానికి వెళ్లడం ప్రారంభించారు. కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్‌ శ్రవణ్, గ్రేటర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రోహిణ్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి చామల కిరణ్‌రెడ్డి, జహీరాబాద్‌ కాంగ్రెస్‌ నేత మదన్‌మోహన్‌రావు, బెల్లయ్య నాయక్‌ తదితర నేతలు దోమల్‌గూడలోని విష్ణువర్థన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. 

అసమ్మతి అనుకునేలోపు...
విష్ణు ఆహ్వానించిన జాబితాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేరని చాలామంది నేతలు వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. చేరికలపై ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని, దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయాలని నేతలు భావించారు. అసమ్మతి గ్రూపును నడిపిద్దామని భావించిన నేతలకు తీరా విష్ణు ఇచ్చిన స్పష్టతతో మింగుడుపడకుండా అయినట్టు చర్చ జరుగుతోంది. కాగా, విందు అనంతరం వీహెచ్‌ మాట్లాడుతూ ఒకప్పుడు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశానని, ఆయనను సోనియాగాంధీ నియమించినందున ఆయన నాయకత్వాన్ని బలపరుస్తానని, అదే సమయంలో రేవంత్‌రెడ్డి కూడా అందర్నీ కలుపుకొని వెళ్లాలని సూచించారు. పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటారని, ఈరోజు లంచ్‌ మీటింగ్‌తో అందరి అపోహలు తొలగిపోయాయని ఆయన తెలిపారు. తన సమస్యపై కేంద్ర నాయకత్వంతోనే మాట్లాడుతానన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top