‘గులాబీ’ పార్టీలో కలవరం అందుకేనా?.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?

TRS And  BJP, Congress Political Situation In Suryapet District - Sakshi

సాక్షి, నల్గొండ/సూర్యాపేట: మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే సూర్యాపేట సెగ్మెంట్‌లో వచ్చేసారి తీర్పు ఎలా ఉండబోతోంది? ప్రతిపక్షమే లేని జిల్లాలో గులాబీ పార్టీ మళ్లి ఏకఛత్రాధిపత్యం వహిస్తుందా? కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి ఎలా ఉంది? యాదాద్రి, భువనగిరి జిల్లాలో మూడు పార్టీలు ఏమంటున్నాయి?
చదవండి: కాంగ్రెస్‌లో సీనియర్లు, పెద్దలు అంతా అక్కడే.. భీకర పోరు తప్పదా?

ఉమ్మడి  జిల్లా టీఆర్ఎస్‌లో వర్గపోరు లేని ఏకైక నియోజకవర్గం సూర్యాపేట. రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి నియోజకవర్గం కావడంతో ముఠాలు కట్టి వర్గాలుగా విడిపోయే ధైర్యం ఎవరూ చేయడం లేదు. అయితే గత రెండు ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో గెలవడం టీఆర్ఎస్‌ను కలవరపెడుతోంది. దీనికి తోడు కొంతమంది అనుచరులు మంత్రికి తలనొప్పులు తీసుకొస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఈసారి అక్కడ జరిగిన అభివృద్ధి పనులను చూపిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని ఆ పార్టీ ఆలోచిస్తోంది. స్థానికంగా మెడికల్ కాలేజీ నిర్మాణం, రోడ్ల వెడల్పు, కొత్త కలెక్టరేట్ నిర్మాణం గులాబీ పార్టీకి పాజిటీవ్‌గా మారే అవకాశం ఉంది. 

ఇక కాంగ్రెస్‌లో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, రేవంత్ అనుచరుడు పటేల్ రమేష్‌రెడ్డి మధ్య నువ్వానేనా అన్నట్లు పరిస్థితి తయారైంది. ఇక్కడ పార్టీ పిలుపునిచ్చే ఏ కార్యక్రమాన్ని జాయింట్‌గా నిర్వహించడం లేదు. గత ఎన్నికల్లో ఈ వర్గపోరే పార్టీని దెబ్బతీసింది. మరోసారి అలాంటి పరిస్థితులు రాకుండా చూడాల్సిన రేవంతే తన శిష్యుడిని దామోదర్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ రాకున్నా ఇండిపెండెంట్‌గా పోటీ చేయడం  పక్కా అని తెలుస్తోంది. బీజేపీలో మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావుకు వర్గపోరు లేకున్నా నోటి దురుసుతనమే ఆయనకు మైనస్‌గా మారుతోంది.

కోదాడలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఎదురు చూస్తున్నారు. మరోసారి తన భార్యను నిలబెట్టి గెలిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం కుటుంబంలో ఒకరికే టికెట్ అని ప్రకటించిన నేపథ్యంలో టికెట్ రాకపోతే పరిస్థితి ఏంటనేది స్పష్టత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ వర్గంగా ముద్రపడిన పందిరి నాగిరెడ్డి తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. టీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కి వర్గపోరు పెద్ద తలనొప్పిగా తయారైంది. పైగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేటీఆర్, హరీష్‌రావుకు దగ్గర అని చెప్పుకునే జలగం సుధీర్, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు కుటుంబం నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో బీజేపీ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది అన్న చందంలా తయారు అయింది పరిస్థితి. 

హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్య రాజకీయ యుద్ధం మధ్య తారాస్థాయికి చేరింది. గతంలో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచే పోటీ చేస్తానని ఉత్తమ్ ప్రకటించడంతో రాజకీయ వేడి పెరిగిపోయింది. టీఆర్ఎస్‌లో టికెట్ అడిగే స్థాయిలో వర్గపోరు లేకున్నా కొందరు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు అనుచరులపై వస్తున్న అవినీతి ఆరోపణలు కూడా ఎమ్మెల్యేకు కొంత ఇబ్బందిగా మారిందంట. అయితే ఇవేవి తనను అడ్డుకోలేవన్న ధీమాతో ప్రస్తుత ఎమ్మెల్యే సైదిరెడ్డి ఉన్నారు. బీజేపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తుంగతుర్తి నియోజకవర్గంలో ఒకప్పుడు కాంగ్రెస్‌కి పోటీగా నిలబడాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అద్దంకి దయాకర్‌తో పాటు మరో ఇద్దరు తెరపైకి వచ్చారు. వడ్డేపల్లి రవిని పార్టీలో చేర్చుకోవడాన్ని రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో పాటు అద్దంకి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రెండుసార్లు ఓడిపోయిన అద్దంకికి కాకుండా మరో నేతకు టికెట్ ఇవ్వాలని దామోదర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన గ్యాదరి కిషోర్ హ్యాట్రిక్ సాధించాలని ఆశిస్తున్నారు. అయితే మందుల శ్యామ్యూల్ ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారంట. రెండు సార్లు టికెట్ త్యాగం చేశానని ఈసారి తనను దృష్టిలో పెట్టుకోవాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఇక ఇక్కడ బీజేపీకి సరైన అభ్యర్థి లేరు. ఇతర పార్టీల నుంచి ఎవరైనా గట్టి నేత వస్తే పోటీకి నిలపాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.

భువనగిరి నుంచి గత రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి జెండా ఎగరేయాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఆయన ఆశలకు చింతల వెంకటేశ్వర రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అడ్డుతగిలే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి భువనగిరి నుంచి పోటీ చేసేది తామే అని బహిరంగంగా ప్రకటించుకుంటున్నారని తెలుస్తోంది.

ఇక కాంగ్రెస్ పార్టీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి లాంటి సంపన్న నేత ఉన్నప్పటికీ కోలుకోలేకపోతోంది. పార్టీలో ముఠా తగాదాలే దీనికి కారణం. క్యాడర్ పటిష్టంగా ఉన్నా నేతల కొట్లాటలతో పార్టీని దెబ్బ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో భువనగిరి ఒకటి. ఇక్కడి నుంచి పోటీకి చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారు. జిట్టా బాలకృష్ణరెడ్డి, పీవీ శ్యాంసుందర్, గూడూరు నారాయణ రెడ్డి, పడమటి జగన్‌మోహన్‌రెడ్డి లిస్టులో ఉన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు సెగ్మెంట్ రాజకీయం అస్తవ్యస్తంగా మారిందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు సార్లు టీఆర్ఎస్ విజయం సాధించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగడి సునీత ఈ సారి తన భర్తకు అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరినట్లు ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహ్ములు కూడా టీఆర్‌ఎస్‌లో చేరడంతో సునీతకు తలనొప్పిగా మారింది.

అసంతృప్తులు అంతా నర్సింహ్ములు వర్గంలో చేరిపోయారు. దీంతో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. అయితే ఇక్కడి నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం ఇద్దరు నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇక కాంగ్రెస్‌లో క్యాడర్ కంటే లీడర్ల సంఖ్యే ఎక్కువగా ఉందని జోకులు వేసుకుని నవ్వుకునే పరిస్థితి వచ్చింది. బీజేపీలో వర్గపోరు లేనప్పటికీ కొద్ది రోజుల క్రితం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య అసలైన బీజేపీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
చదవండి: మునుగోడు బరిలోకి వైఎస్సార్‌టీపీ! 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top