ముచ్చటగా మూడోసారి: విజయం దక్కుతుందా?

Triangle Fight In Dubbaka Bypoll - Sakshi

అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు

బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘునందన్‌

సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికలో ఏ పార్టీ నుంచి ఎవరికి టికెట్‌ వస్తుందోనన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అందరికన్నా ముందుగా తమ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత పేరును ప్రకటించింది. మంగళవారం బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పేరును ఆ పార్టీ జాతీయ ఎన్నికల కమిటీ ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి పేరును ఖరారు చేస్తూ ఏఐసీసీ నుంచి బుధవారం ప్రకటన విడుదల చేశారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో నామినేషన్ల దాఖలు, ప్రచార వ్యూహాలపై నేతలు కసరత్తు ప్రారంభించారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి టికెట్‌ ఆశించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వచ్చినా చివరకు అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందరూ ఊహించినట్లుగానే సుజాత పేరును ప్రకటించారు.

కాంగ్రెస్‌ పార్టీలో ముందుగా వెంకటనర్సింహారెడ్డి, తర్వాత శ్రావణ్‌కుమార్‌ రెడ్డి, అనంతరం శ్రీనివాస్‌రావు, నర్సారెడ్డి పేర్లు వినిపించాయి. చివరకు నర్సారెడ్డి పేరును ఖారారు చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్‌ మరో ఆలోచనగా మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడిని పోటీలో దింపాలనే ఆలోచనకు వచ్చింది. ఇందుకు అనుగుణంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించి.. శ్రీనివాస్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 55 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏఐసీసీ నుంచి అభ్యర్థుల జాబితా విడుదలైంది. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ దుబ్బాక నియోజకవర్గంపై కన్నేసింది. ఇందులో భాగంగానే రెండు నెలలుగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్‌రావు నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారం ప్రారంభించారు.(పట్టుబడ్డ నగదు: వివాదంలో రఘునందన్‌)

ముచ్చటగా మూడోసారి బరిలో..
అయితే ఈ సారి తనకు టికెట్‌ ఇవ్వాలని జిల్లా కిసాన్‌ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలాకర్‌ రెడ్డి ఆశించడంతో ఇద్దరి మధ్య పోటీ పెరిగింది. ఈ విషయంపై తర్జనభర్జన చేసిన అధినాయకత్వం రఘునందన్‌రావును ప్రకటించారు. 2014,18 వరుస ఎన్నికలతో పాటు గత లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓటమి చవిచూసిన రఘునందన్‌ ఈసారి ఎలాగైన విజయం సాధించి తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టాలని ఆతృతగా ఉన్నారు. దుబ్బాక అసెంబ్లీ స్థానంలో ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగిన ఆయనకు ఉప ఎన్నిక ఎలాంటి ఫలితానిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ అభ్యర్థులతో పోల్చుకుంటే రఘునందన్‌ ప్రచారంలో ఓ అడుగు ముందే ఉన్నారు.‌ సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావుతో పాటు కేటీఆర్‌లపైనే ఆయన ప్రధానంగా విమర్శలు గుప్పిస్తున్నారు. సిద్దిపేట, సిరిసిల్లపై ఉన్న ప్రేమ టీఆర్‌ఎస్‌ నేతలకు దుబ్బాకపై లేదని, ప్రశ్నించే గొంతుకగా తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లును అభ్యర్థిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడే పోటీ చేసి ఓటమి చవిచూసిన తనపై ఈసారి దుబ్బాక ఓటర్లు సానూభూతి చూపిస్తారని, మొదటి సారి అసెంబ్లీలోఅడుగుపెట్టే అవకాశం దక్కడం ఖాయమని గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

ముమ్మరంగా ప్రచారం.. 
ఉప ఎన్నికలో మొదటి ఘట్టం అభ్యర్థుల ప్రకటన దాదాపుగా పూర్తయింది. దీంతో నామినేషన్ల స్వీకరణ, ప్రచార వ్యూహాలపై కసరత్తు ప్రారంభించారు. 9వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉండటంతో.. ఎప్పుడు నామినేషన్‌ వేయాలి? ఎంత మందితో వేయాలి? నామినేషన్లు వేసే ప్రక్రియకు ఎవరు హాజరు అవుతారు అనే విషయంపై అన్ని పార్టీల్లో చర్చ సాగుతోంది. అదేవిధంగా నామినేషన్‌ వేసిన తర్వాత ఇరువై రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఇప్పటి నుంచే ప్రచా ర వేగం పెంచారు. టీఆర్‌ఎస్‌ గెలుపు బాధ్యత భుజాన వేసుకున్న మంత్రి హరీశ్‌రావు రెండు రోజులుగా అభ్యర్థి సుజాతతో కలిసి ప్రచారంలో వేగం పెంచారు. బీజేపీ నుంచి రఘునందన్‌రావు ఒంటరి పోరాటం చేస్తూ ప్రచారం ము మ్మరం చేశారు. మంగళవారం గాంధీ భవన్‌లో శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడమే ఆలస్యంగా బుధవారం సిద్దిపేటలో మాజీ ఎంపీ హనుమంతరావు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క ప్రచారం ప్రారంభించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top