
ఉప ఎన్నికలో పోటీపై సందిగ్ధత
బిహార్ మహాకూటమిలో చేరేందుకు అసక్తి
రాష్ట్రంలో కాంగ్రెస్‌తో మజ్లిస్ సత్సంబంధాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో ‘బిహార్ కూటమి’కి మెలిక పెట్టేందుకు ఆల్ ఇండియా మజ్లిస్–ఎ–ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) సిద్ధమవుతోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో మజ్లిస్ గత మూడు పర్యాయాలుగా అక్కడ పాగా వేసేందుకు ప్రయతి్నస్తూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో అధికార కాంగ్రెస్‌కు మిత్ర పక్షం కానప్పటికీ... ప్రభుత్వ నిర్ణయాలకు సహకరిస్తూ వస్తోంది.
అయితే తాజాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్, ఆర్‌జేడీ సారథ్యంలోని మహా కూటమి(ఇండియా)లో చేరేందుకు అసక్తి చూపుతున్నా....కూటమి నుంచి సానుకూల స్పందన రాక పోవడాన్ని మజ్లిస్ తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతో కాంగ్రెస్ పాలిత ప్రాంతమైన తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలను సాకుగా చూపించి మహా కూటమిపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒకవేళ అక్కడ కూటమిలో అవకాశం దక్కని పక్షంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్‌కు గుణ పాఠం చెప్పాలా..? లేక స్థానిక అవసరాల కోసం సహకరించాలా? అని సందిగ్దంలో పడినట్లు కనిపిస్తోంది. మజ్లిస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో దిగితే అధికార కాంగ్రెస్‌కు గెలుపు అంత సులువు కాదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
ముస్లిం ఓటర్లు అధికం..
గత మూడు పర్యాయాలుగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో పాగా వేసేందుకు మజ్లిస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో సగానికి పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. తొలిసారిగా 2014లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బరిలో దిగి ఢీ.. అంటే ఢీ అనే విధంగా పోటీ పడి స్పల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన మజ్లిస్... ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం బీఆర్‌ఎస్ దోస్తీ కోసం బరిలో దిగకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది.
కాగా 2023లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చి జూబ్లీహిల్స్ (Jubilee Hills) మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేపై స్నేహపూర్వక పోటీకి దిగి పరాజయం పాలైంది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు అధికారం చేజారగా, కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో అధికార కాంగ్రెస్‌తో మజ్లిస్ స్నేహం కుదిరింది. తాజాగా సిట్టింగ్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఆ దిశగా ప్రయత్నాలు
త్వరలో జరుగనున్న బిహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎన్‌డీఏ కూటమిని ఓడించేందుకు కాంగ్రెస్, ఆర్‌జేడీ సారథ్యంలోని మహా కూటమి(మహా ఘట్బంధన్) లో చేరేందుకు ఏఐఎంఐఎం శతవిధాల ప్రయత్నిస్తోంది. సంస్థాగతంగా బలంగా ఉన్న సీమాంచల్‌లో ఆరు స్థానాలు కేటాయిస్తే కలిసి వస్తామని ఇప్పటికే ప్రకటించింది. మహా కూటమి తమతో కలిసిరాని పక్షంలో బిహార్‌లోని అన్ని నియోజకవర్గాల్లో మజ్లిస్ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఆ పార్టీ అధినేత ఒవైసీ ఇప్పటికే స్పష్టం చేశారు.
వాస్తవంగా తెలంగాణ, మహారాష్ట్ర తర్వాత బిహార్‌ను పార్టీ విస్తరణకు అనుకూలంగా మజ్లిస్ భావిస్తోంది. తొలిసారిగా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్‌లోని ఆరు స్థానాల్లో తొలిసారి పోటీ చేసి విజయం సాధించలేక పోయినప్పటికి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లలో పోటీ చేసి ఐదు సీట్లను దక్కించుకుంది. ఐదుగురు శాసనసభ్యుల్లో నలుగురు పార్టీని వీడి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)లో చేరారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో పోటీ చేసినా.. ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.
ఇటీవల మహాకూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తూ ఇటీవల సాక్షాత్తు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్‌న్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు లేఖ రాశారు. రాబోయే ఎన్నికల్లో లౌకిక ఓట్లు చీలిపోయి మతతత్వ శక్తులు అధికారంలోకి వచ్చే అవకాశం ఇవ్వకూడదనే కూటమిలో చేరేందుకు ముందుకు వస్తున్నట్లు, గత అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికల సమయంలో మహా కూటమిలో చేరాలనే ఆసక్తి కనబర్చామని కానీ తమ ప్రయత్నాలు ఫలించలేదు‘ అని లేఖలో పేర్కొన్నారు అయితే మహా కూటమి నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం వైపు నుంచి ఒత్తిడి తెచ్చేందుకు మజ్లిస్ సిద్దమైనట్లు సమాచారం.