Vice President Elections 2022: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు మమత షాక్‌.. ఓటింగ్‌కు దూరం

TMC Said It Will Abstain From Vice President Election Voting - Sakshi

కోల్‍కతా: ఉపరాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో విపక్షాలకు షాక్‌ ఇచ్చారు పశ్చిమ్ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌కు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ దూరంగా ఉండనుందని బాంబు పేల్చారు. ఈ ఓటింగ్‌కు తమ పార్టీ సభ్యులు గైర్హాజరవుతారని ప్రకటించింది టీఎంసీ. ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయటంలో ఇతర విపక్షాల వైఖరే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ‘ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖడ్‌కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. అదే సమయంలో.. టీఎంసీతో సంబంధం లేకుండా విపక్షాలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించిన తీరు అభ్యంతరకరం. విపక్షాల అభ్యర్థికీ మేము మద్దతు ఇవ్వం. అందుకే ఓటింగ్‌కు మా పార్టీ సభ్యులు దూరంగా ఉంటారు.’ అని స్పష్టం చేశారు టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ.

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫున జగదీప్​ ధన్‌ఖడ్‌​ పోటీ చేస్తున్నారు. బెంగాల్ గవర్నర్‌గా పనిచేసిన ఆయన.. అనేక విషయాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో తీవ్రంగా విభేదించారు. మరోవైపు.. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్​ ఆల్వాను బరిలోకి దింపాయి కాంగ్రెస్, ఎన్​సీపీ సహా ఇతర పార్టీలు. శివసేన, జేఎంఎం వంటి పార్టీలు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు మద్దతు తెలపటమూ టీఎంసీ ఓటింగ్‌కు దూరంగా ఉండేందుకు కారణంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు.. ఇటీవలే గవర్నర్‌ దగదీప్‌ ధన్‌ఖడ్‌, అస‍్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మలతో మమతా బెనర్జీ భేటీ అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది.  

ఆగస్టు 6న ఓటింగ్‌..
ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌ ఆగస్టు 6న జరగనుంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10న ముగియనుంది. లోక్‍సభ, రాజ్యసభ ఎంపీలంతా ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. నామినేటెడ్​ సభ్యులు కూడా ఓటు వేసేందుకు అర్హులే.

ఇదీ చదవండి: Draupadi Murmu: గిరిజన ఘన మన... అధినాయకి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top