TJS Party: కోదండరామ్‌కు అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆఫర్‌! ఆ పార్టీ విలీనం తప్పదా?

TJS Party Leaders Secret Meeting At Ibrahimpatnam Farmhouse - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జనసమితి పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తారని వస్తున్న వార్తలకు బలం చేకూర్చేలా శనివారం ఓ రహస్య సమావేశం జరిగింది. ఇబ్రహీంపట్నం పరిధిలోని రావిరాల ఫామ్‌హౌస్‌లో టీజేఎస్‌ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీకి కోదండరామ్‌తో పాటు, పార్టీ ముఖ్యనేతలంతా హాజరవడం జరిగింది. గతంలోనే రెండు ప్రముఖ​ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో.. టీజేఎస్‌ను విలీనం చేయాలని చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. 

అయితే తాజాగా ఆమ్‌ ఆద్మీ పార్టీలో విలీనం చేయాలని ప్రతిపాదనలు రావడంతో ఈ విషయంపై పార్టీ నేతలతో కోదండరాం చర్చిస్తున్నారు. ఈ భేటీలో ఎక్కువ మంది నేతలు ఆమ్‌ ఆద్మీలో విలీనానికే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.. అయితే టీజేఎస్‌ అధినేత కోదండరాం మాత్రం ఎన్నికలు సమీపిస్తున్నందున అప్పటి దాకా వేచి చూసే ధోరణిలో ఉండాలని నాయకులకు సూచించినట్లు సమాచారం. 

ఇదిలా ఉండగా, ఆమ్‌ ఆద్మీ పార్టీ పంజాబ్‌ ఎన్నికల్లో గెలిచిన తర్వాత  తెలంగాణపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమ్‌ ఆద్మీకి చెందిన కీలక నేత టీజేఎస్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒకటి రెండు రోజుల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా హైదరాబాద్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

చదవండి: (కేసీఆర్‌ 3 గంటలే నిద్రపోతున్నారు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top