టీడీపీ ‘సామాజిక’ చిచ్చు

Thammineni Sitaram Comments On behavior of TDP members - Sakshi

సభా విలువలు.. సభాపతి స్థానంపై ఆ పార్టీకి గౌరవం లేదు 

వేళ్లు చూపిస్తూ.. సభ కనిపించకుండా ముఖానికి ప్లకార్డులు అడ్డుపెడతారా? 

ప్లకార్డు అడ్డు తొలగిస్తే స్పీకర్‌ కొట్టేశారంటూ గోల చేస్తారా? 

సభలో సభ్యులందరికీ సమాన హక్కులుంటాయి 

ప్రశ్నోత్తరాల తర్వాతే వాయిదా తీర్మానం ఇవ్వాలని టీడీపీ సభ్యులకు తెలీదా? 

ప్రొసీడింగ్స్‌ చదవకుండా సభలో గందరగోళం చేయడానికే వస్తున్నారు 

ఇలా చేయమని వారికి ఎవరు చెబుతున్నారు? 

ఇన్నాళ్లు వారి ప్రవర్తన, అసభ్య కామెంట్లను మౌనంగా భరించా.. సహించా 

టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తనపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆవేదన 

సభ్యులు వెల్‌లోకి వచ్చినా.. నినాదాలు చేసినా సస్పెండ్‌ అయ్యేలా రూలింగ్‌ 

సాక్షి, అమరావతి: సామాజికవర్గాల మధ్య చిచ్చుపెట్టేలా టీడీపీ సభ్యులు సభలో ప్రవర్తిస్తున్నారని శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం విమర్శించారు. వాయిదా తీర్మానానికి ఆర్డర్‌లో రావాలని చెప్పినా వినిపించుకోవట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. గౌరవం ఇవ్వలేని ప్రతిపక్షం ఉన్న సభలో సభాపతిగా ఉండటం బాధగా ఉందన్నారు.

తన విధులను త్రికరణశుద్ధిగా నిర్వర్తించాలనే ఆలోచనతో సభను నడిపిస్తున్నట్లు చెప్పారు. తనకు పార్టీ­లపైనా, ఏ ఒక్క సభ్యుడిపైనా ప్రత్యేక అభిమానం లేదన్నారు. కానీ, టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తనను ఇన్నాళ్లూ మౌనంగా సహించానన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా సోమవారం అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనలపై స్పీకర్‌ స్పందిస్తూ..  

‘సభాపతి స్థానానికి కొన్ని పద్ధతులుంటాయి. వాటిని పట్టించుకోకుండా టీడీపీ సభ్యులు పోడియంపైకి వచ్చి నినాదాలు చేస్తారు. చైర్‌ను చుట్టుముట్టి గుద్దుతారు. నా ముఖంపై వేళ్లు చూపిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. డోలా బాలవీరాంజనేయస్వామి ప్రవర్తించిన తీరు హేయంగా ఉంది. అచ్చెన్నాయుడు అయితే ఎత్తుగా ఉండటంతో కింద నుంచే సభ కనిపించకుండా నా ముఖానికి ఎదురుగా ప్లకార్డు అడ్డుపెడతారు.

రామకృష్ణబాబు స్టీరియో కామెంట్లు చేస్తారు. అయినా మౌనంగానే భరించాను.. సహించాను. ఎమ్మెల్యే ఏలిజా (వైఎస్సార్‌సీపీ) వచ్చి మా హక్కులు రక్షించాలని కోరుతుంటే.. టీడీపీ సభ్యుడు నా ముఖానికి అడ్డుగా పెట్టిన ప్లకార్డును పక్కకు జరిపాను. అది కింద పడిపోయింది. అంతే.. వెంటనే స్పీకర్‌ కొట్టేశారంటూ గోలచేశారు. ఇలా చేయమని మీకు ఎవరు చెప్పి పంపిస్తున్నారు? ఇది మంచి సంస్కారం కాదు’..  అని టీడీపీ సభ్యులకు తమ్మినేని హితవు పలికారు.  

విలువైన సభా సమయం వృథా.. 
ఇక సభలో సభ్యులందరికీ సమాన హక్కులు ఉంటాయని స్పీకర్‌ స్పష్టంచేశారు. ఇది తెలుసుకోకుండా టీడీపీ సభ్యులు సభా సమయాన్ని, ప్రజాధనా­న్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు మైక్‌ ఇస్తుంటే సభను తప్పుదారి పట్టిస్తున్నారని.. సభ జరుగుతున్న తీరు­ను ప్రజలు గమనిస్తున్నారని.. కచ్చితంగా సమ­యం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటారన్నారు.   

ఆర్డర్‌ ప్రకారమే సభను నడిపిస్తాం 
నిజానికి.. సభలో వాయిదా తీర్మానం అనేది ప్రశ్నోత్తరాల తర్వాత వస్తుందని స్పీకర్‌ చెప్పారు. గత ప్రభుత్వంలో 5–3–2016న అప్పటి సభలోనూ ఇదే చెప్పారన్నారు. ‘టీడీపీ వాళ్లు చెప్పింది వాళ్లకే గుర్తులేకపోవడం దురదృష్టకరం. ప్రొసీడింగ్‌ చదవకుండా సభలో గందరగోళం సృష్టించి, అగౌరవపరచడం దారుణం. ప్రశ్నోత్తరాలు జరుగుతుంటే.. అచ్చెన్నాయుడు వాయిదా తీర్మానమిచ్చి ‘మీరు ఇప్పుడే చదవాలి’ అంటారు.

ఇదా సీనియారిటీ? సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి తొలిసారిగా గవర్నరుగా వచ్చిన వ్యక్తి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రోజు నుంచి ఇప్పటివరకు విపక్ష సభ్యుల ప్రవర్తన, అసభ్య పదజాలాన్ని అందరూ చూస్తున్నారు. జాతీయ మీడియా సైతం అటెన్షన్‌ చేసేలా గవర్నర్‌ రాకను కూడా తప్పుపట్టారు.

గవర్నర్‌ రావడం కూడా టెబుల్‌ అజెండానా? దీనిని బీఏసీలో పెట్టాలనడం ఏమిటి? ఇది గవర్నర్‌ ఆఫీసు, అసెంబ్లీ సెక్రటేరియట్‌ మధ్య ఉండాల్సింది. కనీసం అది తెలుసుకోకుండా టీడీపీ సభ్యులు మాట్లాడటం శోచనీయం. ఏ శాసనసభలోనూ ఎవరూ టీడీపీ సభ్యుల్లా ప్రవర్తించి ఉండరు’.. అని స్పీకర్‌ అన్నారు. 

అది బీసీలకు ఇచ్చిన గౌరవం 
‘సీఎం జగన్‌ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ.. నా మైనార్టీలు అని ధైర్యంగా చెప్పుకోగలిగిన గొప్ప నాయకుడు. నన్ను సభాపతిగా చేశారంటే.. సీఎం బలహీనవర్గాలకు ఇచ్చిన గౌరవం అది. ఇప్పుడు టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి పెద్ద సమయం పట్టదు. కానీ, వాళ్లు కూడా సభకు రావాలి. ప్రజా సమస్యలపై చర్చించాలి. ఇదే నా అభిమతం’.. అని స్పీకర్‌ అన్నారు. 

ఎర్రగీత దాటితే ఆటోమేటిగ్గా సస్పెన్షన్‌ 
‘అసెంబ్లీ గౌరవాన్ని పెంచేలా ఎందరో మహానుభావులు స్పీకర్‌గా సేవలందించారు. వ్యక్తి ఎవరన్నది ముఖ్యం కాదు. సభాపతి స్థానంలో ఎవరున్నా గౌరవించాలి. సభ్యులు నిరసన వ్యక్తంచేయడంలో అభ్యంతరంలేదు. కానీ, టీడీపీ సభ్యులకు సభాపతి స్థానం, సభా­­విలువలపై గౌరం లేదు.

టీడీపీ సభ్యుల తీరు గర్హనీయం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. అందుకే సభ్యులు కారణం లేకుండా సభలో నినాదాలు చేయడం, చైర్‌ వద్దకు రావడం, వెల్‌లో బైఠాయించడం చేస్తే ఆటోమేటిగ్గా సస్పెండ్‌ అయ్యేలా రూలింగ్‌ ఇస్తున్నాం’ అని స్పీకర్‌ ప్రకటించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top