
గొల్లపల్లి/ధర్మపురి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మనుషులనే కాదు దేవుళ్లను సైతం మోసం చేస్తున్నారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ధ్వజమెత్తారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ధర్మపురి పట్టణంలో గురువారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ...ధర్మపురి నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి కానరావడం లేదని, ధర్మపురి నృసింహుడి క్షేత్రాన్ని రూ.500 కోట్లతో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి ఆ తర్వాత రూ.200 కోట్లు, రూ.100కోట్లకు కుదించి రూపాయి కూడా మంజూరు చేసిన పాపాన పోలేదని విమర్శించారు.
వైఎస్సార్ హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధే తప్పా ఎక్కడా అభివృద్ధి కానరావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే నియోజకవర్గానికి చెందిన మంత్రి కొప్పుల ఈశ్వర్ వందల ఎకరాలు భూకబ్జాలు, ఇసుక మాఫియాతో దండుకుంటున్నారని ఆరోపించారు. ఆయనను ప్రశ్నించిన ప్రజలపై, జర్నలిస్టులపై కేసులు పెట్టి హింసించే సంస్కృతికి దిగజారారన్నారు.