న్యూడెమోక్రసీలో చీలిక.. ప్రజాపంథా పార్టీ ఆవిర్భావం

Telangana: Split In CPI ML New Democracy Party - Sakshi

రాష్ట్ర కార్యదర్శిగా డి.వి. కృష్ణ, సహాయ కార్యదర్శిగా రంగారావు 

కమిటీ సభ్యుడిగా గుమ్మడి నర్సయ్య

కేంద్ర నాయకత్వ   విధానాలు నచ్చక బయటకు 

సాయుధ పోరాటంతోనే విముక్తి సాధ్యమని స్పష్టీకరణ 

సాక్షి, హైదరాబాద్‌/ఇల్లెందు: సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీలో చీలిక ఏర్పడింది. సీపీఐ (ఎంఎల్‌) ప్రజాపంథాగా కొత్త పార్టీ ఆవిర్భవించిం ది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా డి.వి.కృష్ణ, సహాయ కార్యదర్శిగా పోటు రంగారావును ఎన్నుకున్నారు. కొత్త పార్టీలోకి మాజీ ఎమ్మె ల్యే గుమ్మడి నర్సయ్య కూడా వచ్చారు. ఈ సందర్భంగా డి.వి. కృష్ణ, పోటు రంగారావు ఓ ప్రకటన విడుదల చేశారు. సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ అనుసరిస్తున్న కరుడుగట్టిన విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ పోరాడుతూ వచ్చిందని చెప్పారు.

ప్రజల నుంచి పార్టీని దూరం చేసే కాలం తీరిన అతివాద విధానాలను మార్చుకోవడాన్ని కేంద్ర కమిటీ మొండిగా తిరస్కరించిందన్నారు. పైగా రాష్ట్ర కమిటీకి పోటీ కమిటీలను ఏర్పాటు చేసి, రాష్ట్ర కమిటీని దాని నాయకత్వంలోని ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుటిల ప్రయత్నాలు సాగించిందన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీని, ఉద్యమాన్ని కాపాడుకోవడానికి కేంద్ర కమిటీతో తెగతెంపులు చేసుకోవటం అనివార్యమైందన్నారు. పార్లమెంటరీ, పార్లమెంటేతర పోరాటాలను జోడించాలని భావిస్తున్నామన్నారు. పార్లమెంటు ద్వారానే అధికారాన్ని సాధించగలమనే పార్లమెంటరీ విధానాన్ని, పాలకవర్గాలతో ఫ్రంట్లు కట్టే విధానాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు.

అంతిమంగా సాయుధ పోరాటం ద్వారా విముక్తి సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. పోరాటాలకు కలిసి వచ్చే శక్తులన్నింటితో పనిచేయడం తమ నిలకడైన విధానంగా ఉంటుందన్నారు.  
రాష్ట్ర కమిటీ సభ్యులు వీరే..: గుమ్మడి నర్సయ్య, కెచ్చెల రంగయ్య, కె.రమ, రాయల చంద్రశేఖర్, పాయం చిన్న చంద్రన్న, గోకినపల్లి వెంకటేశ్వరరావు, కె.సూర్యం, కె.జి.రాంచందర్, కర్నాటి యాదగిరి, చండ్ర అరుణ, వి.కృష్ణ, ఎస్‌ఎల్‌ పద్మ. 

1967 నుంచి ఇప్పటివరకు చీలికలు ఇలా.. 
భారత విప్లవ పరిస్థితులకు రివిజనిజం పెను ప్రమాదమంటూ 1967లో సీపీఎం నుంచి బయటకు వచ్చి చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో సీపీఐ (ఎంఎల్‌)ను స్థాపించారు. 1984లో సీపీఐ (ఎంఎల్‌)లో సిద్ధాంతపరమైన విభేదాలతో చీలిక వచ్చి చండ్ర పుల్లారెడ్డి, పైలా వాసుదేవరావు వర్గాలు ఏర్పడ్డాయి. కొంతకాలానికి పైలా వర్గం ప్రజాపంథాగా, చండ్ర పుల్లారెడ్డి వర్గం విమోచన గ్రూపుగా మారింది. ప్రజాపంథా పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలను విస్తరించి దేశవ్యాప్తంగా రూపం తెచ్చేందుకు 1994లో న్యూడెమోక్రసీ (ఎన్డీ)గా అవతరించింది. ఎన్డీలోనూ 2013లో మరో చీలిక వచ్చి ఎన్డీ చంద్రన్న వర్గం, ఎన్డీ రాయల వర్గంగా ఆవిర్భవించాయి.

అయితే 2013 నాటి చీలిక సమయం నుంచే ఎన్డీ రాయల వర్గంలో నేతలు రెండు వర్గాలుగా పనిచేస్తూ ప్రస్తుతం క్షీణ దశకు చేరాయి. ఈ క్రమంలోనే రాయల వర్గం నుంచి డి.వి.కృష్ణ, పోటు రంగారావు బయటకు వచ్చి ప్రజాపంథాగా అవతరించినట్లు ప్రకటించారు. వీరిద్దరూ రాయల వర్గంలో రాష్ట్ర కార్యదర్శి, సహాయ కార్యదర్శులుగా పని చేశారు. వీరు బయటకు రావడంతో ఆ వర్గానికి రాష్ట్ర కార్యదర్శిని ఎంపిక చేసేందుకు త్వరలోనే మహబూబాబాద్‌లో సమావేశం నిర్వహించనున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top