పరీక్షలకు సిద్ధమా..?

Telangana BJP Chief Bandi Sanjay challenge To Minister KTR - Sakshi

నేను తంబాకు తింటానన్నావ్‌ కదా.. ఇద్దరం పరీక్షలు చేయించుకుందాం అంటూ కేటీఆర్‌కు బండి  సవాల్‌ 

రక్తం, వెంట్రుకల నమూనాలిస్తే నిరూపించేందుకు సిద్ధమని వెల్లడి 

నిర్మల్‌:  ‘కేసీఆర్‌ కొడుకు ట్విట్టర్‌ టిల్లు డ్రగ్స్‌ వాడతాడు. రక్తం, వెంట్రుకల నమూనాలిస్తే నిరూపించేందుకు సిద్ధం. నేను తంబాకు తింటానని పచ్చి అబద్ధాలు చెప్పినవ్‌ కదా కేటీఆర్‌.. నువ్వు, నేను పరీక్షలు చేయించుకుందాం. నా శరీరంలోని ఏభాగమైనా పరీక్షలకు ఇచ్చేస్తా. నీకు ఖాళీ.. రక్తం, రెండు వెంట్రుకలిచ్చే దమ్ముందా..?’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. దేశమంతా ఓవైపు ఉంటే.. కేసీఆర్‌ మరోవైపు ఉంటాడని, ప్రధాని మోదీ అంటే పడనివాళ్లు సైతం దేశం కోసం జీ–20 నిర్వహణ సమావేశానికి వెళ్లారని చెప్పారు.

కేసీఆర్‌ మాత్రం తన బిడ్డను లిక్కర్‌ స్కాం నుంచి ఎలా బయటపడేయాలా అని లాయర్లతో మీటింగ్‌ పెట్టాడని విమర్శించారు. నిర్మల్‌ జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్ర మంగళవారం మామడ మండల కేంద్రం నుంచి ఖానాపూర్‌ నియోజకవర్గ కేంద్రానికి చేరుకుంది. మార్గంమధ్యలో దిమ్మదుర్తిలో అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సంజయ్‌ నివాళులర్పించారు. అక్కడ నిర్వహించిన సభలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష, ఎంపీ సోయం బాపురావుతో కలిసి మాట్లాడారు. 

అంబేడ్కర్‌ భిక్షతోనే ఎంపీనయ్యా.. 
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ భిక్షతోనే ఎంపీనయ్యానని, అతిపెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగానని బండి సంజయ్‌ అన్నారు. అలాంటి మహనీయుడిని గుర్తించిన ఘనత కూడా బీజేపీదే అన్నారు. భారతరత్నతో గౌరవించుకున్నామని, అంబేడ్కర్‌కు సంబంధించిన స్థలాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతిని చేయడంతో పాటు 12 మంది ఎస్సీ ఎంపీలను కేంద్ర మంత్రులుగా, పలువురిని గవర్నర్లు, ముఖ్యమంత్రులగా చేసిన ఘనత తమ పార్టీదేనని చెప్పారు. కనీసం అంబేడ్కర్‌ వర్ధంతి, జయంతిలకు రాని దౌర్భాగ్యపు సీఎం కేసీఆర్‌ అని మండిపడ్డారు.  

దేశం కంటే బిడ్డే ముఖ్యమా? 
జీ–20 దేశాల సమావేశాన్ని నిర్వహించే అవకాశం మన దేశానికి రావడం గర్వకారణమని సంజయ్‌ పేర్కొన్నారు. ఈ సమావేశం నిర్వహణపై సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల అధ్యక్షులను ఆహ్వానిస్తే కేసీఆర్‌ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. దేశం కంటే బిడ్డ ముఖ్యమా అని నిలదీశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top