
కడప కార్పొరేషన్: కమలాపురం ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డిపై టీడీపీ పొలిటికల్ విభాగం దు్రష్పచారానికి ఒడిగట్టింది. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది. కల్తీ క్లోరిన్ నీటిలో కలవడం వల్లే ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురయ్యారని, నీటి శుద్ధికి కావాల్సిన రసాయనాలను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి సరఫరా చేస్తున్నారంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టి తప్పుడు ప్రచారానికి తెరతీసింది. దీనిపై ఎమ్మెల్యే సీరియస్‌గా స్పందిస్తూ టీడీపీ నాయకులు ఇలా దిగజారి ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తాను అలాంటి వ్యాపారమేదీ చేయలేదని, క్లోరిన్ సరఫరా, ఇతర కాంట్రాక్టులతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు.
తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మేనమామ అయినందునే టీడీపీ శ్రేణులు ఉద్దేశపూర్వకంగా నిందలు వేస్తూ ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తాము విలువలతో కూడిన రాజకీయాలు చేశామే తప్ప, ఇలాంటి నీచ రాజకీయాలు ఎన్నడూ చేయలేదని రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పారు.