TDP Graph That Fell Into Kuppam - Sakshi
Sakshi News home page

‘సైకిల్‌’ కకావికలం.. కుప్పంలో పడిపోయిన టీడీపీ గ్రాఫ్‌ 

Published Fri, Oct 28 2022 10:32 AM

TDP Graph That Fell Into Kuppam - Sakshi

సాక్షి, చిత్తూరు: ప్రజలను పట్టించుకోకుంటే ఏం జరుగుతుందో ప్రతిపక్షనేత చంద్రబాబుకు ఇప్పుడు అర్థమవుతోంది. కార్యకర్తలను కేవలం మెట్లుగానే ఉపయోగించుకుంటే పరిస్థితి ఎలా తారుమారవుతుందో అవగతమవుతోంది. అభివృద్ధి ఫలాలను అందించకుండా మాయమాటలకే పరిమితమైతే జరిగే నష్టం ఎలా ఉంటుందో తెలిసివస్తోంది. కుప్పం కోట చేజారిపోయిందనే బెంగ రోజురోజుకూ పెరిగిపోతోంది. దశాబ్దాలుగా మోసిన తమ్ముళ్లు సైతం జారిపోతుంటే ఆందోళన అధికమవుతోంది. కుదేలైన సైకిల్‌కు ఎన్ని మరమ్మతులు చేసినా పార్టీ గ్రాఫ్‌ దిగజారిపోతుండడంతో దిక్కుతోచనిస్థితి ఎదురవుతోంది. ఈ మేరకు గురువారం విజయవాడలో కుప్పం టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమై బుజ్జగింపులకు దిగినట్లు తెలిసింది.
చదవండి: పత్రాలు మార్చి అసైన్డ్‌ అరాచకం.. బాబు హయాంలో భారీ భూ కుంభకోణం!  

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల కుప్పంలో బహిరంగ సభ నిర్వహించిన తర్వాత టీడీపీ పరిస్థితి మరింత పడిపోయింది. ఒకప్పుడు ఏడాదికి ఒకసారి కూడా నియోజకవర్గం వైపు చూడని చంద్రబాబుకు ఇప్పుడు కలలో కూడా కుప్పమే కనిపిస్తోంది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కోటలా మార్చుకున్న నియోజకర్గం చేజారిపోతుందేమో అనే దిగులు చందబ్రాబును వెంటాడుతోంది.

డీలా పడిన టీడీపీ 
అభివృద్ధి చూడాలంటే కుప్పం రండి అంటూ ఒకప్పుడు చంద్రబాబు జబ్బలు చరుచుకునేవారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజమైన అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో కుప్పం ప్రజలకు తెలిసిపోయింది. ఇంతకాలం మాటలతో తాము మోసపోయామని గ్రహించారు. దీంతో స్థానిక సంస్థలు, మున్సిపల్‌ ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టి షాక్‌ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గంపగుత్తగా గెలిపించారు.

ప్రతిపక్షనేత ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గమైనా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏమాత్రం వివక్ష చూపకుండా అభివృద్ధిని పరుగులు తీయిస్తుండడంతో ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరిగింది. నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,149 కోట్లు మంజూరు చేయడంతో అభిమానం రెండింతలైంది. ఈ క్రమంలోనే సెపె్టంబర్‌ 23వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభకు ప్రజానీకం తండోపతండాలుగా తరలివచ్చింది. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నంత సేపూ హర్షధ్వానాలతో మద్దతు పలికింది. దీంతో అటు చంద్రబాబుకు, ఇటు స్థానిక టీడీపీ నేతలకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. అసలు విషయం అర్థమయ్యేసరికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

పరువు కోసం పాట్లు!
గత సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ తగ్గడంతో చంద్రబాబుకు తత్వం బోధపడింది. కుప్పంలో తన ప్రభ మసకబారుతోందని అర్థమైంది. దీనికితోడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని మొత్తం 175 సీట్లు గెలవడమే లక్ష్యమని ప్రకటించగానే బాబులో మరింత గుబులు మొదలైంది. సొంత నియోజకవర్గంలోనే ఓడిపోతే పరువు పోతుందనే ఉద్దేశంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారని టీడీపీ నేతలే చెబుతున్నారు. అందులో భాగంగానే 25 మంది కుప్పం నేతలను గురువారం విజయవాడకు పిలిపించుని మాట్లాడినట్లు వెల్లడించారు. కార్యకర్త నుంచి నేతల వరకు అందరూ సమష్టిగా పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా కుప్పం టీడీపీ ఇన్‌చార్జి పీఎస్‌ మునిరత్నంపై పలువురు ఆరోపణలు గుప్పించినట్లు సమాచారం. ఆయన వల్ల పార్టీ పరిస్థితి మరింత దిగజారుతోందని, వెంటనే ఇన్‌చార్జిని మార్చాలని డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. దీనిపై చంద్రబాబు దృష్టి సారించారని, త్వరలోనే కొత్త ఇన్‌చార్జిని నియమించనున్నట్లు తమ్ముళ్లు చెబుతున్నారు. 

సీఎం వరాలపై జనంలో చర్చ 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.66 కోట్లు కేటాయించారు. నియోజకవర్గంలో డీబీటీ పథకాల ద్వారా రూ.866 కోట్లు, నాన్‌ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.283 కోట్లు మొత్తంగా రూ.1,149 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కుప్పం వాసులు సైతం ముఖ్యమంత్రి కురిపించిన వరాలపై చర్చించుకుంటున్నారు. ఏళ్ల తరబడి గెలిపిస్తే చంద్రబాబు చేసింది శూన్యమని, మూడున్నరేళ్లలోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పరుగులు తీయిస్తోందని ప్రశంసిస్తున్నారు. అలాగే సంక్షేమ పథకాల అమలుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement