సీఎం జగన్‌ తలుచుకుంటే.. అది పెద్ద కష్టమేమీ కాదు..

Tdp And Yellow Media Over Action On Mla Quota Mlc Election Results - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ్యుల కోటా నుంచి శాసనమండలికి జరిగిన ఎన్నికలలో ఆరు సీట్లను గెలుచుకున్న అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఒక సీటు కోల్పోవడం సహజంగానే చర్చనీయాంశం అవుతుంది. ఇందులో  తప్పెవరిది, ఒప్పు ఎవరిది అన్న మీమాంస ఉంటుంది. కాని ఒక్క విషయం మాత్రం స్పష్టం అవుతుంది. ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మాత్రం రాజకీయాలలో ఫెయిర్‌గా ఉండాలన్న తన ఆలోచనను వీడలేదని, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయాలన్న ఉద్దేశానికి రాలేదని అర్ధం అవుతుంది.

శరభ.. శరభ.. పూనకం పూనినట్లు..
ఈ విషయంలో ఆయన నిజాయితీని మెచ్చుకోవలసిందే. తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో శరభ.. శరభ.. పూనకం పూనినట్లు ఒక ఎమ్మెల్సీ సీటు టీడీపీకి వచ్చిందంటూ  పేజీలకొద్ది వార్తలు, వ్యాఖ్యలను  ప్రచారం చేశాయి. ఇదేదో మంచి అవకాశంగా ఆ మీడియా సంస్థలు భావించి ఉండవచ్చు. కాని వారు తెలిసిరాశారో, తెలియక రాశారో కాని జగన్ ఎంత నిబద్దతతో ఉంటారో తెలియచెప్పేలా కొన్ని కథనాలు వాటిలో ఉన్నాయి. జగన్‌కు షాక్ అంటూ రాస్తున్న ఉత్సాహంలో కొన్ని వాస్తవాలు బయటపెట్టారు.

ఉదాహరణకు ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనం చూడండి. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు ఓపెన్ గానే పార్టీతో కొంత కాలం క్రితం విభేదించారు. వారు ఆత్మప్రబోధానుసారం ఓట్లు వేస్తామని చెప్పారు. కాగా రహస్యంగా ఉన్న మరో ఎమ్మెల్యే గురించి ఈనాడులో ఏమి రాశారంటే...'నెల్లూరు జిల్లాకే చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యేకి వచ్చే ఎన్నికలలో టిక్కెట్ ఇవ్వడం లేదని ఇటీవల ముఖ్యమంత్రి జగన్ తేల్చి చెప్పినట్లు సమాచారం.

ఆయన అడిగిన పనులు కూడా చేయలేదు...అంటూ ఆ వార్తలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులొకరికి మార్కెట్ చైర్మన్ పదవి కూడా అడిగినా ఇవ్వలేదని తెలిపారు. మరో పేరాలో ఇలా రాశారు...'రాజకీయంగా చైతన్యవంతమైన కోస్తాజిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కి సైతం రానున్న ఎన్నికలలో టిక్కెట్ ఇవ్వడం సాధ్యం కాదని ఇటీవల పార్టీ అగ్రనేతలు తేల్చి చెప్పారు. ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులంతా కలిసి సి.ఎమ్. జగన్‌తో గురువారం భేటీ అయ్యారు. అప్పుడు కూడా టిక్కెట్ ఇవ్వలేనని పునరుద్ఘాటించినట్లు సమాచారం..." అని తెలిపారు.

ఈ విషయాలు చూస్తే ఏమనిపిస్తుంది..
ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇలాంటి వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించే అవకాశం ఉందని తెలిసినా, జగన్ మాత్రం నిజాయితీగా తన అభిప్రాయం చెప్పడం ఎంత ధైర్యంతో కూడిన పని అని తెలియడం లేదా!ఒక వేళ టిక్కెట్లు ఇస్తామనో, లేక మరేదో చేస్తామని మాట ఇచ్చి, ఆ తర్వాత మాట తప్పితే వచ్చే అప్రతిష్టను భరించడానికి ఆయన సిద్దంగా లేరన్నమాట. మరో పత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం చూడండి..'ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అధినేత చంద్రబాబు నిశ్శబ్దంగా గెలుపు కొట్టేశారు. తనకు చాలినంత బలం లేకపోయినా పోటీ పెట్టి, అధికార పార్టీ శిబిరాన్ని చీల్చి మరీ తమ అభ్యర్ధి పంచుమర్తి అనూరాధను గెలిపించుకున్నారు.." అని పేర్కొన్నారు. అంటే దీని అర్ధం ఏమిటి?

చంద్రబాబు తనదైన శైలిలో వ్యూహ రచన చేసి వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి గెలిపించుకున్నారనే కదా! అలా ప్రలోభపెట్టడాన్ని ఈ పత్రిక సమర్దిస్తున్న తీరు పెద్ద ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాలలో కొందరు మీడియా యజమానులు  కూడా భాగస్వాములవుతుండడమే కావచ్చు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒకసారి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వంపై ఏవో ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత ఆయన మీడియా తో మాట్లాడుతూ మాటవరసకు చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు..అని వ్యాఖ్యానించారు.

ఎంత గగ్గోలు పెట్టాయో గుర్తు చేసుకోండి.
అంతే.. ఇవే మీడియా సంస్థలు ఎంత గగ్గోలు పెట్టాయో గుర్తు చేసుకోండి.. ఇంకేముంది టీడీపీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి జగన్ స్కెచ్ వేశారని వీరు ఆరోపించారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ నాయకత్వం కొనుగోలు చేసింది. దానిని తప్పు అని ఈ మీడియా ఖండించలేదు. అలాగే ఇప్పుడు కూడా టీడీపీ వారు వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం తప్పు అని అనడం లేదు.అది చంద్రబాబు చాతుర్యంగా ప్రచారం చేస్తున్నారు. పైగా చంద్రబాబు నిశ్శబ్దంగా కొట్టేశారు ! అని శీర్షికలు కూడా పెట్టారు. తెలుగుదేశం పార్టీకి చాలా కాలం క్రితం నలుగురు ఎమ్మెల్యేలు దూరం అయ్యారు.

అదేదో ముందుగానే గ్రహించి ఉంటే..
జగన్ తలచుకుని ఉంటే ఇంకొంతమందిని టీడీపీకి దూరం చేయడం పెద్ద కష్టం కాదు. అయినా ఆయన ఆ పని చేయలేదు. గతంలో తెలంగాణలో ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం నేతలు ఎలా పట్టుబడ్డారో అందరికి తెలుసు. అయినా మళ్లీ అదే పనికి టీడీపీ పూనుకోవడం రాజకీయ చాతుర్యంగా చెప్పుకోవడం సిగ్గుచేటైన వ్యవహారమా?.కాదా అన్నది ఆలోచించుకోవాలి. టీడీపీ మీడియా కథనాల ఆధారంగా విశ్లేషిస్తే ఏమి కనిపిస్తుంది.వైఎస్సార్‌ కాంగ్రెస్ అభ్యర్ధి ఒకరు ఓడిపోయే అవకాశం ఉందని తెలిసినా, జగన్  తన విధానంలో రాజీపడలేదనే కదా! అయితే అదేదో ముందుగానే గ్రహించి ఉంటే ఈ కాస్త అసౌకర్యం కూడా ఏర్పడేది కాదేమో!

ఇక్కడ గమనించవలసిన సంగతి ఏమిటంటే?
ఆరు ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ గెలిచినా, ఒక్క సీటును గెలుచుకున్న టీడీపీ మాత్రం మొత్తం మండలినే గెలుచుకున్నంత సంబరం చేసుకుంది. నిజానికి మండలిలో ఒక సీటు గెలవడం, ఒక సీటు ఓడడం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే అవి దాదాపు అన్ని పరోక్ష ఎన్నికల ప్రాతిపదిక ద్వారానే భర్తీ అవుతుంటాయి. ఇక్కడ గమనించవలసిన సంగతి ఏమిటంటే 2019 శాసనసభ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు అన్నిటిలో వైఎస్సార్‌ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అలాగే బద్వేలు, ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలలోను, తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికలోను వైసీపీ భారీ ఆధిక్యతతో గెలిచింది. ఇవన్ని ప్రత్యక్ష ఎన్నికలు. అదే టైమ్‌లో పరోక్షంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధికం వైసీపీ గెలిచినా, నాలుగింటిని మాత్రం టీడీపీ సాధించుకుంటే, మొత్తం మారిపోయిందని చెప్పడమే విడ్డూరం.

-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top